అవార్డులపై గౌరవం అందుకే తగ్గింది! కంగన-యామీలను కాదని కృతికి!?
సినిమా అవార్డుల నిజాయితీపై నమ్మకం లేదనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. జీ సినీ అవార్డ్స్ 2026 వేడుక ఇందుకు అతీతం కాదు.
By: Sivaji Kontham | 3 March 2026 12:16 PM ISTసినిమా అవార్డుల నిజాయితీపై నమ్మకం లేదనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. జీ సినీ అవార్డ్స్ 2026 వేడుక ఇందుకు అతీతం కాదు. అవార్డుల కార్యక్రమం ముగిసినా... దాని చుట్టూ ఉన్న వివాదాలు మాత్రం ఇప్పుడప్పుడే తగ్గేలా లేవు. ఆదివారం (మార్చి 1) జరిగిన ఈ ప్రయివేట్ అవార్డుల వేడుకలో `తేరే ఇష్క్ మే` చిత్రానికి గానూ కృతి సనన్ `ఉత్తమ నటి` అవార్డును గెలుచుకుంది. అయితే ఈ ఎంపికపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అవార్డుల ఎంపిక తీరును ప్రశ్నిస్తూ.. కృతి కంటే అర్హులైన వారు రేసులో ఉన్నారని వాదిస్తున్నారు.
ముఖ్యంగా కంగనా రనౌత్ లేదా యామీ గౌతమ్‌లలో ఒకరికి ఈ అవార్డు దక్కాల్సిందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. `ఎమర్జెన్సీ` చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా పరకాయ ప్రవేశం చేయగా, `హక్` సినిమాలో యామీ గౌతమ్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వీరిద్దరినీ కాదని కృతి సనన్‌ను విజేతగా ప్రకటించడంపై సినిమా లవర్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.
రెడిట్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తూ.. అవార్డు వేడుకకు హాజరైన వారికే బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. ``కంగనా, యామీ వేడుకకు రాలేదు కాబట్టే అక్కడ ఉన్న కృతికి అవార్డు కట్టబెట్టా`` అంటూ నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. కేవలం హాజరు ఆధారంగా ప్రతిభను తక్కువ చేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
`తేరే ఇష్క్ మే` చిత్రంలో కృతి సనన్ నటన నిజంగా అంత అద్భుతంగా ఉందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సినిమాలో కృతి నటన బాగానే ఉన్నా కానీ.. అది ఒక ఉత్తమ నటి అవార్డును అందుకునేంత స్థాయిలో లేదని సగటు సినీ ప్రేక్షకుడు భావిస్తున్నాడు. కొందరైతే సినిమా చూస్తున్నంత సేపు ఆ పాత్ర చిరాకు తెప్పించిందని, అలాంటి నటనకు అవార్డు ఇవ్వడం ఏంటని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు నెటిజన్లు ఈ రేసులో ట్రిప్తి దిమ్రి పేరును కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ ఏడాది మంచి ప్రదర్శన కనబరిచిన నటీమణులను పక్కన పెట్టి.. కేవలం పాపులారిటీ లేదా ఇతర సమీకరణాల ఆధారంగా అవార్డులు పంచడం వల్ల ఇలాంటి వేడుకల విలువ తగ్గుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యామీ గౌతమ్ `హక్` కోసం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
మొత్తానికి జీ సినీ అవార్డ్స్ 2026 విజేతల జాబితా బాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపింది. అవార్డుల ఎంపికలో పారదర్శకత ఉండాలని.. కేవలం నటనకు మాత్రమే పెద్దపీట వేయాలని సినీ ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. కృతి సనన్ ఈ అవార్డును అందుకుని ఆనందంగా ఉన్నా కానీ, సోషల్ మీడియాలో వస్తున్న ఈ నెగెటివిటీ తనను చిన్నబుచ్చుతోంది.
