అగ్ర హీరో మేనకోడలికి నిరసనలో గాయాలు.. పోలీసుల అదుపులో మేనల్లుడు!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ మేనకోడలు, నటి జైన్ మేరీ ముంబైలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో భాగంగా అరెస్టై ఆ తర్వాత విడుదల కావడం ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.
By: Sivaji Kontham | 12 Oct 2026 12:30 PM ISTబాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ మేనకోడలు, నటి జైన్ మేరీ ముంబైలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో భాగంగా అరెస్టై ఆ తర్వాత విడుదల కావడం ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆమెతో పాటు అమీర్ ఖాన్ మేనల్లుడు, అతడి భార్య కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. ముంబైలోని చారిత్రాత్మక ఆగస్ట్ క్రాంతి మైదాన్ వేదికగా జరిగిన సీజేపీ నిరసన కార్యక్రమంలో వారంతా పాల్గొనగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీజేపీ (CJP) నిరసన పిలుపునకు మద్దతుగా తలపెట్టిన ఈ ఆందోళనకు ఎలాంటి ముందస్తు అనుమతి లేదన్న కారణంతో ముంబై పోలీసులు జైన్ మేరీతో పాటు నటుడు ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. బాంబే హైకోర్టు నిబంధనల ప్రకారం.. ఆజాద్ మైదాన్‌లో మాత్రమే నిరసనలకు అనుమతి ఉందని తెలపడంతో ఈ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న సుమారు 400 మందికి పైగా పోలీసుల పర్యవేక్షణలో తాత్కాలికంగా నిర్బంధించారు. అయితే కొద్ది గంటల విచారణ అనంతరం వీరందరినీ పోలీసులు విడుదల చేశారు.
పోలీసుల అదుపు నుంచి విడుదలైన మరుసటి రోజు నటి జైన్ మేరీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టులు అందరినీ విస్మయానికి గురిచేశాయి. నిరసన సమయంలో పోలీసుల చర్యల వల్ల తన చేతులు, వేళ్లు- కాళ్లపై తీవ్రమైన గాయాలైనట్లు ఒక వీడియో ద్వారా తెలియజేసారు. ఈ సందర్భంగా జైన్ మేరీ కెమెరా ముందు మాట్లాడుతూ.. ``మనలో ఎలాంటి భయమూ మిగిలిపోనంతగా మమ్మల్ని ఎక్కువగా భయపెట్టకండి`` అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
నిర్బంధంలో ఉన్న సమయంలోనూ ఈ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించారు. పోలీస్ వ్యాన్‌లో ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్‌లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ జైన్ మేరీ `ఇంక్విలాబ్ జిందాబాద్` అని పోస్ట్ చేశారు. మరోవైపు పోలీసులు తమను వెంటనే ఇంటికి వెళ్లనీయకుండా ఇబ్బంది పెట్టారని... అయినప్పటికీ తాము సురక్షితంగానే ఇంటికి చేరుకుంటున్నామని లేఖా వాషింగ్టన్ ఒక వీడియోలో వివరించారు.
ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కుపై పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపడుతూ పలువురు సెలబ్రిటీలు గళం విప్పుతుండగా.. జైన్ మేరీకి సంబంధించిన గాయాల గుర్తులు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి.
అయితే జైన్ మేరీ యాక్ట్ పై నెటిజనుల కామెంట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్‌పై నెటిజన్లు తీవ్ర వ్యంగ్యంతో పాటు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఈ సంఘటనను కొందరు కేవలం డ్రామా లేదా పబ్లిసిటీ స్టంట్‌గా అభివర్ణిస్తూ, `మేకప్ ఆర్టిస్ట్` అంటూ ఎగతాళి చేస్తుండగా.. మరికొందరు దీనిని `లవ్ బైట్` అంటూ ట్రోల్ చేస్తున్నారు.
మరోవైపు ఢిల్లీ పోలీసుల చర్యలను సమర్థిస్తూ కొందరు యూజర్లు అంకితభావాన్ని ప్రశంసిస్తుంటే.. ఇంకొందరు మాత్రం చట్టాన్ని ధిక్కరించే వారికి మరింత కఠినమైన శిక్షలు ఉండాలని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఈ చర్చ ద్వారా నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
