ప్రభాస్ కి నానమ్మ.. చిరంజీవికి అమ్మ.. ఈ సంక్రాంతి మొత్తం ఈవిడదేగా!
సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్న హీరోలను మొదలుకొని పెద్దపెద్ద హీరోలు తమ సినిమాలను విడుదల చేసి సక్సెస్ పొందే దిశగా అడుగులు వేస్తారు.
By: Madhu Reddy | 13 Jan 2026 1:41 PM ISTసంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్న హీరోలను మొదలుకొని పెద్దపెద్ద హీరోలు తమ సినిమాలను విడుదల చేసి సక్సెస్ పొందే దిశగా అడుగులు వేస్తారు. అయితే హీరోలే కాదు హీరోయిన్స్ కూడా తమ నటనతో సంక్రాంతి హీరోయిన్గా పేరు దక్కించుకుంటూ ఉంటారు. అయితే గతంలో ఒక హీరోయిన్గా మంచి పేరు దక్కించుకున్న ఒక నటి.. ఇప్పుడు నానమ్మగా, అమ్మగా ఇలా పలు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి సంక్రాంతి మొత్తం ఈవిడదే అని అందరి చేత అనిపించుకుంటోంది. ఆమె ఎవరో కాదు జరీనా వహాబ్.
ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేసి హీరోయిన్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఈ సంక్రాంతికి ఏకంగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కామెడీ హారర్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ది రాజాసాబ్. జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ కి నానమ్మ పాత్రలో నటించి తన పాత్రతో భారీ పాపులారిటీ అందుకుంది జరీనా వహాబ్ .
ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో కూడా ప్రభాస్ ఈమె గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాతో పాటు మరో హీరో ఈ సినిమాలో ఉన్నారు. ఆమె మా నానమ్మ జరీనా వహాబ్ అంటూ ఆమెను ఆకాశానికెత్తేశారు. అలా ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు ఈ జరీనా వహాబ్. అలా ఈ సినిమాతో వెలుగులోకి వచ్చిన ఈమె ఇప్పుడు మరో సంక్రాంతి మూవీలో కూడా నటించింది. అదే మన శంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా , అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అటు బుక్ మై షో లో కూడా ఒక్కరోజులోనే ఏకంగా ఐదు లక్షల టికెట్స్ బుక్ అయ్యి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో చిరంజీవికి అమ్మగా నటించి మరోసారి హైలెట్గా నిలిచారు జరీనా వహాబ్ . దీంతో ఈ రెండు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె గురించి తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈమె ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈమె స్వస్థలం విశాఖపట్నం. పూణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది.. బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నం చేసి 1974లో తొలిసారి హీరోయిన్గా అరంగేట్రం చేశారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఈమె కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ముఖ్యంగా ప్రముఖ నటులు రాజ్ కపూర్ లాంటి వారి చేత విమర్శలు అందుకున్న ఈమె.. ఆ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ను సీరియస్గా తీసుకొని తనను తాను మార్చుకొని 1976లో బసు చటర్జీ తీసిన చిత్ చోర్ సినిమాల్లో తన నటనను ప్రూవ్ చేసుకొని.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి మళ్లీ వెను తిరిగి చూసుకోలేదు.
బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా సినిమాలు చేసారు. ముఖ్యంగా 1975లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గాజుల కృష్ణయ్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత హిందీ, మలయాళం, తమిళ్ భాషల్లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులో చివరిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన దసరా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో కూడా నటించారు. అయితే అప్పుడు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ.. ప్రభాస్ ఈమెను హైలైట్ చేయడంతో ఇప్పుడు మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
