మాజీ భార్యకు సైలెంట్‌గా చాహల్ రిటర్న్ గిఫ్ట్
అలాంటి సున్నితమైన సమయంలో ``మీ స్వంత షుగర్ డాడీగా ఉండండి`` అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి చాహల్ కోర్టులో ప్రవేశించాడు.
By: Sivaji Kontham | 20 Aug 2025 10:17 PM ISTక్రికెటర్ యజ్వేంద్ర చాహల్- ధనశ్రీ జంట నడుమ విభేధాలు విడాకులకు దారి తీసిన విషయం తెలిసిందే. కోర్టు కేసులు, గొడవల్లో నలుగుతున్నప్పుడు ఆ ఇద్దరి పైనా విమర్శలు వచ్చాయి. చాహల్ ప్రముఖ రేడియో జాకీ మహ్వాష్ తో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వచ్చాయి. అదే సమయంలో ధనశ్రీ వర్మ తన రియాలిటీ షో సహ నటుడితో హద్దులు మీరడమే విడాకులకు కారణమని పుకార్లు షికార్ చేసాయి.
కారణం ఏదైనా ఆ ఇద్దరి విడాకులు ఖరారయ్యాయి. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాల్లో వారిపై బోలెడంత చర్చ సాగుతూనే ఉంది. తాజాగా చాహల్ `మిలియన్ ఫీలింగ్స్, జీరో వర్డ్స్` అని సోషల్ మీడియాల్లో రాశారు. `హ్యూమన్స్ ఆఫ్ బాంబే` ఇంటర్వ్యూలో ధనశ్రీ మాట్లాడగా, ఆ విషయాలు అంతర్జాలంలోకి వచ్చిన అనంతరం చాహల్ పైవిధంగా స్పందించాడు. ఈ ఇంటర్వ్యూలో ధనశ్రీ మాట్లాడుతూ... విడాకుల రోజున చాహల్ కోర్టుకు రావడం ఆశ్చర్యపరిచిందని వెల్లడించింది.
అలాంటి సున్నితమైన సమయంలో ``మీ స్వంత షుగర్ డాడీగా ఉండండి`` అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి చాహల్ కోర్టులో ప్రవేశించాడు. నిజానికి అతడు అలా వచ్చేప్పటికే నన్ను ప్రజలు చాలా తిట్టుకుని ఉంటారు. ఆ టీషర్ట్ స్టంట్ జరిగిందనే విషయం నాకు తెలియక ముందే ఆ సందేశం జనంలోకి వెళ్లింది. ప్రజలు నన్ను తిట్టుకురని ఊహించగలను! అని ధనశ్రీ పేర్కొన్నారు. కోర్టు విడాకుల ప్రాసెస్ జరుగుతున్న సమయంలో టీషర్ట్ ఘటన వేగంగా వైరల్ అయింది. చాలా మంది ఇది ధనశ్రీని అవమానించడమేనని ఊహించారు. అలాంటి సమయంలో చాహల్ అలా ప్రవర్తించడం తనను బాధించిందని ధనశ్రీ పేర్కొంది.
ఇప్పుడు ధనశ్రీ వ్యాఖ్యలకు నేరుగా స్పందించకపోయినా, చాహల్ నర్మగర్భ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం ఫ్యాన్స్ అతడి వ్యాఖ్య వెనక దాగి ఉన్న అర్థాన్ని వెతుకుతున్నారు. ఇది చాహల్ ఇచ్చిన సంక్షిప్త జవాబు.. విడాకుల తర్వాత అతడి ఆలోచనను ఇది ప్రతిబింబిస్తుంది.. అని ఒకరు వ్యాఖ్యానించారు. నిజానికి ధనశ్రీని తాను మోసం చేసానని వచ్చిన పుకార్లను తట్టుకోలేకపోయానని చాహల్ ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను అలాంటి వాడిని కానని, అక్క చెల్లెళ్ల మధ్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించానని, తనను ఎవరూ అలా తప్పుడు వ్యక్తి అని అనలేరని కూడా చాహల్ తనను తాను సమర్థించుకున్నారు. డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్న చాహల్- ధనశ్రీ జంట మార్చి 2025లో అధికారికంగా విడిపోయారు.
