అతడు ఎప్పుడూ తండ్రిలా లేడు.. యూవీ షాకింగ్ కామెంట్!
టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ , అతడి తండ్రి యోగరాజ్ సింగ్‌ల మధ్య ఉన్న సంబంధం ఎప్పుడూ చర్చనీయాంశమే.
By: Sivaji Kontham | 29 Jan 2026 10:08 AM ISTటీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ , అతడి తండ్రి యోగరాజ్ సింగ్‌ల మధ్య ఉన్న సంబంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి యువీ చెప్పిన విషయాలు నిజంగానే షాకింగ్‌గా ఉన్నాయి.
ఈ ఇంటర్వ్యూలో యూవీ మాట్లాడుతూ.. అతడు ఎప్పుడూ తండ్రిలా లేడు! అని షాకింగ్ కామెంట్ చేసాడు. దీనివెనక చాలా పెద్ద కారణం కూడా విడమర్చి చెప్పాడు. యువరాజ్ సింగ్ తన తండ్రి గురించి మాట్లాడుతూ, -``ఆయన నాకు ఎప్పుడూ తండ్రిలా లేడు, ఒక కఠినమైన కోచ్‌లా మాత్రమే ఉన్నాడు`` అని చెప్పారు. చిన్నప్పటి నుండి తనను ఒక సైనికుడిలా పెంచారని, సాధారణ తండ్రీకొడుకుల మధ్య ఉండే ప్రేమ, సరదా తన బాల్యంలో లేవని యువీ పేర్కొన్నాడు.
యోగరాజ్ సింగ్ తండ్రి అంత స్ట్రిక్టా? అంటే.... అవును.. ఆయన అత్యంత కఠినంగా ఉండేవారని కూడా తెలిపాడు. చిన్నప్పుడు యువీకి స్కేటింగ్ అంటే ఇష్టం ఉండేది. కానీ యోగరాజ్ సింగ్ ఆ స్కేటింగ్ మెడల్స్‌ను విసిరేసి, కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని బలవంతం చేశారు. చలికాలంలో కూడా తెల్లవారుజామునే లేపి, చన్నీళ్లతో స్నానం చేయించి ప్రాక్టీస్‌కు తీసుకెళ్లేవారట. తండ్రి అంటే ప్రేమ కంటే భయమే ఎక్కువగా ఉండేదని, ఆ ఒత్తిడి వల్లే తాను అంత గొప్ప క్రికెటర్ అయ్యానని యువీ అంగీకరించినా కానీ, మానసికంగా అది చాలా కష్టంగా ఉండేదని చెప్పాడు.
భార్య హేజిల్ కీచ్ పాత్ర...
తమ పిల్లల విషయంలో తాను తన తండ్రిలా ఉండకూడదని యువీ గట్టిగా నిర్ణయించుకున్నాడట. పిల్లలతో సాన్నిహిత్యం చాలా ముఖ్యమని గ్రహించినట్టు తెలిపాడు. తన పిల్లలకు తండ్రిగా పూర్తి ప్రేమను అందించాలని, వారితో స్నేహితుడిలా ఉండాలని యువీ ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయంలో తన భార్య హేజిల్ కీచ్ తనకు ఎంతో మద్దతుగా నిలుస్తోందని యువీ తెలిపాడు. ఒక తండ్రిగా ఎలా ఉండాలో.. పిల్లలతో ఎలా మెలగాలో ఆమె తనకు నేర్పిస్తోందని కొనియాడారు. నా తండ్రి నాకు ఇవ్వని ఆ తండ్రి ప్రేమను, నేను నా పిల్లలకు పుష్కలంగా ఇవ్వాలనుకుంటున్నాను! అని యువరాజ్ సింగ్ అన్నారు.
యువీ అన్నట్లుగా, శిక్షణ మొదలైన తర్వాత యోగరాజ్ సింగ్ కేవలం ఒక ఇన్‌స్ట్రక్టర్‌గా మారిపోయారు. అదే అత్యంత బాధాకరమైన విషయమని యువీ అనడంలో ఉద్దేశ్యం.. ఆటలో మెళకువలు నేర్పే వ్యక్తి దొరికారు కానీ, అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఓదార్చే తండ్రి కరువయ్యారని... అర్థం చేసుకోవాలి.
ఇది తరం నుండి తరానికి పాఠం లాంటిది. తల్లిదండ్రులు తమకు తెలిసిన విద్యనే పిల్లలకు నేర్పిస్తారు. యోగరాజ్ సింగ్‌కు తెలిసింది కఠినమైన క్రమశిక్షణే.. అందుకే దానినే యువీపై ప్రయోగించారు. అయితే మనం దాని నుండి నేర్చుకుని, మన పిల్లల విషయంలో అంతకంటే మెరుగ్గా ఉండాలి! అని యువీ అనడం ఆయన పరిణతిని చూపిస్తుంది. గతంలో జరిగిన తప్పులు తన పిల్లల విషయంలో రిపీట్ కాకూడదని యూవీ గట్టిగా నమ్ముతున్నారు. తన తండ్రి తనపై చూపించిన ఒత్తిడిని, తన పిల్లలపై చూపించకూడదని యువీ నిశ్చయించుకున్నారు.
క్రమశిక్షణ అవసరమే అయినా.. అది తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని దెబ్బతీయకూడదని ఆయన భావిస్తున్నారు. యువరాజ్ సింగ్ తన తండ్రిని ద్వేషించడం లేదు.. కానీ ఆయన పద్ధతి వల్ల తాను కోల్పోయిన `తండ్రి ప్రేమ` గురించి నిజాయితీగా మాట్లాడుతున్నారు. ఇది నేటి తరం తల్లిదండ్రులకు ఒక గొప్ప పాఠం లాంటిది. యువరాజ్ సింగ్ - యోగరాజ్ సింగ్ మధ్య ఇటీవల కాలంలో సంబంధాలు మెరుగుపడ్డాయనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు యువీ తన పిల్లలతో తాను ఎలా ఉంటున్నాడో తన తండ్రికి వివరిస్తున్నాడని అనుకోవాలి.
యూవీపై బయోపిక్ ప్లాన్:
2007- T20 ప్రపంచ కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా రికార్డులు సృష్టించిన ఎడమచేతి వాటం ఆల్ రౌండర్, మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ మైదానంలో, మైదానం వెలుపల పోరాట యోధుడు. యువీ అని ప్రేమగా పిలుచుకునే యువ క్రికెటర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ బయోపిక్ చేస్తే, రణబీర్ కపూర్ తన బయోపిక్ చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. అతడు తప్ప వేరొకరు సరితూగరని యూవీ అన్నాడు. యువరాజ్ జీవితంలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా తండ్రితో సంఘర్షణ. దాని గురించి తెలుసుకుంటే బహుశా సందీప్ రెడ్డి వంగా మరో క్లాసిక్ ని తీయగలడేమో. తండ్రితో కొడుకు సంఘర్షణ కథతోనే యానిమల్ తెరకెక్కించి సక్సెస్ సాధించాడు కదా!
