'ఆల్ఫా'ను కరిచిన 'వార్ 2' బూచీ
యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్శ్ లో ఇప్పటివరకూ పఠాన్, టైగర్ పాత్రల హంగామా అభిమనులకు తెలుసు.
By: Sivaji Kontham | 26 Oct 2025 9:42 AM ISTయష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్శ్ లో ఇప్పటివరకూ పఠాన్, టైగర్ పాత్రల హంగామా అభిమనులకు తెలుసు. టైగర్ ఫ్రాంఛైజీతో సల్మాన్ అద్భుత విజయాలను అందించాడు. ఆ తర్వాత స్పై యూనివర్శ్ లో `పఠాన్`తో షారూఖ్ కూడా చేరాడు. పఠాన్ లో టైగర్ గా సల్మాన్ అతిథి పాత్ర అభిమనుల్లో కొత్త ఉత్సాహం పెంచింది. ఇక ఇదే స్పై యూనివర్శ్ మార్గంలోకి `ఆల్ఫా` కూడా చేరింది. ఆల్ఫా మొదటిసారి ఇద్దరు లేడి స్పైలతో ప్రయోగాత్మక చిత్రం కాబోతోంది. ఆలియా భట్, శార్వరి వాఘ్ లాంటి ప్రతిభావంతులు స్టంట్స్ తో అదరగొట్టబోతున్నారు. ఇప్పటికే ఆల్ఫా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది.
తాజా సమాచారం మేరకు `ఆల్ఫా`లో అతిథి పాత్రలు తారుమారు అవుతున్నాయని తెలిసింది. ఆల్ఫాలో హృతిక్ అతిథిగా నటిస్తాడని ఇటీవల వార్తలు వచ్చాయి. నిజానికి యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్శ్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న `వార్` హృతిక్ రోషన్ మాయాజాలంతో యూనివర్శ్ క్రేజ్ ని పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆల్ఫాలో హృతిక్ తో అతిథి పాత్ర చేయించాలని ఆదిత్యాచోప్రా బృందం ప్లాన్ చేసింది. కానీ అనూహ్యంగా `వార్ 2` డిజాస్టర్ ఫలితం చాలా సమీకరణాలను మర్చేసింది. ఆదిత్య చోప్రా వెంటనే ప్లాన్ ఛేంజ్ చేసాడని తెలిసింది.
ఇద్దరు అందగత్తెలు నటిస్తున్న ఆల్ఫాలో హృతిక్ అతిథి పాత్రను తొలగించారు. దానికి బదులుగా షారూఖ్, సల్మాన్ అతిథి పాత్రలతో వస్తే అది ఫ్రాంఛైజీకి అదనపు హంగును సమకూరుస్తుందని చోప్రా భావిస్తున్నారు. ఆల్ఫాలో పఠాన్, టైగర్ పాత్రలు మరింత మైలేజ్ ని పెంచే ఎత్తుగడ. పఠాన్ బ్లాక్ బస్టర్ ఫలితం అందుకోగా, టైగర్ పాత్రకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. వార్ 2 డిజాస్టర్ కావడంతో కబీర్ ప్రవేశాన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచారు. అదే సమయంలో పఠాన్ 2 కోసం ఆల్ఫా ద్వారా హింట్ ఇచ్చేందుకు కూడా మార్గం సుగమం చేస్తున్నారని తెలిసింది.
షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్‌లను పఠాన్- టైగర్‌గా అతిధి పాత్రల్లో నటించమని ఆదిత్య చోప్రా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే షారూఖ్ ని ఆది సంప్రదించారు. అయితే షారూఖ్ `కింగ్` సినిమా కోసం బల్క్ డేట్లు కేటాయించారు గనుక తేదీల్ని సర్ధుబాటు చేసేందుకు కొంత సమయం కోరినట్టు తెలిసింది.
ఈ సంవత్సరం క్రిస్మస్ కానుకగా ఆల్ఫా విడుదలవుతుంది. నవంబర్ ప్రారంభంలో తన భాగాన్ని చిత్రీకరించడానికి ఆదిత్య చోప్రా షారుఖ్ ను డేట్లు కోరారు. ఒక వారం నుండి 10 రోజుల పాటు ఖాన్ పాత్ర షూటింగ్ జరుగుతుంది. షారూఖ్ తో పాటు సల్మాన్ అతిథిగా చేరతాడా లేదా? అన్నదానిపైనా మరింత స్పష్ఠత రావాల్సి ఉంది. వార్ 2 డిజాస్టర్ ప్రభావం ఆల్ఫాపై స్పష్ఠంగా కనిపిస్తోంది. అనూహ్యంగా అతిథి పాత్రలను మార్చాల్సి వచ్చిందనేది స్పష్ఠమైంది.
