యూట్యూబర్ అన్వేష్.. ఒకప్పుడు అలా.. కానీ ఇప్పుడు..
ఆదర్శ యూట్యూబర్ గా, నిజాయితీగల కంటెంట్ క్రియేటర్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అన్వేష్ యూట్యూబ్ ప్రయాణం చాలా మందికి ప్రేరణగా నిలిచింది.
By: M Prashanth | 29 Dec 2025 5:33 PM ISTసోషల్ మీడియాను యూజ్ చేసే దాదాపు అందరికీ యూట్యూబర్ అన్వేష్ సుపరిచితుడమే. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ను మెయింటైన్ చేస్తున్న అతను ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆదర్శ యూట్యూబర్ గా, నిజాయితీగల కంటెంట్ క్రియేటర్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అన్వేష్ యూట్యూబ్ ప్రయాణం చాలా మందికి ప్రేరణగా నిలిచింది.
సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన అన్వేష్.. తన జీవన ప్రయాణంలో ఎదురైన సంఘటనలను నిజాయితీగా ప్రేక్షకుల ముందు ఉంచుతూ లక్షలాది మంది ఫాలోవర్స్ ను ఇప్పటికే సంపాదించుకున్నారు. ప్రయాణాలు, అనుభవాలు, సమాజంపై తన అభిప్రాయాలను సూటిగా చెప్పడమే ఆయనకు ఆదరణ తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై తీవ్రంగా విమర్శలు చేయడం ద్వారా అన్వేష్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ సమయంలో అన్వేష్ వైఖరి యువతను ఆకట్టుకోవడమే కాకుండా.. మంచి కంటెంట్ ఇచ్చే యూట్యూబర్ గా కొనియాడేలా చేసింది. అప్పుడు అనేక మంది అతనికి అభిమానులుగా మారారు. సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారాడు అన్వేష్.
కానీ కొన్ని రోజులుగా అన్వేష్ పై నెగిటివిటీ ఎక్కువగా పెరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొన్ని వీడియోల్లో ఆయన ఉపయోగించిన పదజాలం, చేసిన వ్యాఖ్యలు అసంతృప్తికి గురి చేస్తున్నట్లు కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా అసభ్యకరమైన పదాలు మాట్లాడుతున్నారని, కొన్నిసార్లు హద్దులు దాటుతున్నారని సోషల్ మీడియాలో పలువురు ఫాలోవర్స్ పోస్టులు పెడుతున్నారు.
ఫలితంగా ఫాలోవర్స్ సంఖ్య కూడా తగ్గుతోందని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇటీవల నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్వేష్ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపాయని చెప్పాలి. ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారడమే కాకుండా, వివాదానికి కూడా ఆజ్యం పోశాయి! ముఖ్యంగా రామాయణం, మహాభారతం వంటి మహా గ్రంథాల గురించి అన్వేష్ మాట్లాడటం సరికాదని అంటున్నారు.
మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లితోపాటు ద్రౌపదిపై చేసిన వ్యాఖ్యలను అనేక మంది జుగుప్సాకరమైనవిగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందూ దేవతలు, భారతీయ మహిళల గౌరవాన్ని కించపరిచేలా అన్వేష్ మాట్లాడాడని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆయనను ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు.
అంతే కాదు అన్వేష్ ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశ్వ హిందూ పరిషత్ (VHP) ప్రతినిధులు.. విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలపై, భారతీయ మహిళల వస్త్రధారణపై అన్వేష్ తీవ్రంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా పొందుపరిచారు.
ఒకప్పుడు ప్రశంసలు అందుకున్న యూట్యూబర్ అన్వేష్.. ఇప్పుడు అదే సోషల్ మీడియా ద్వారా విమర్శల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిసార్లు స్పందించడం తప్పు కాదని, కానీ బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అంటున్నారు. అన్వేష్ తన అభిప్రాయం అది కాదని చెప్పినా.. విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
