Begin typing your search above and press return to search.

నేను తప్పు చేస్తే ఈ రాత్రికి రక్తం కక్కుకుని చనిపోతా: నా అన్వేష్

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యూట్యూబర్ అన్వేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   29 Dec 2025 7:13 PM IST
నేను తప్పు చేస్తే ఈ రాత్రికి రక్తం కక్కుకుని చనిపోతా: నా అన్వేష్
X

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యూట్యూబర్ అన్వేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. హిందూ పురాణాలలోని ద్రౌపది, సీతమ్మల గురించి, అలాగే ప్రముఖులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై లేటెస్ట్ గా అన్వేష్ స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. బ్యాంకాక్‌లోని వినాయకుడి విగ్రహం సాక్షిగా తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూనే, ఎవరెవరినైతే బాధపెట్టానో వారందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

​తాను ద్రౌపది దేవికి, సీతా దేవికి, గరికపాటి నరసింహారావు గారికి, నటుడు శివాజీకి, అలాగే హిందూ సంఘాలకు క్షమాపణలు కోరుతున్నట్లు వీడియో ప్రారంభంలోనే అన్వేష్ స్పష్టం చేశారు. తాను ద్రౌపదిని కించపరచలేదని, కేవలం ఒక సామాజిక అంశాన్ని ప్రశ్నించే క్రమంలో ఆ ఉదాహరణలు తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు. పురాణాల్లో తప్పు చేయబోతేనే కీచకుడు, సైంధవుడు, రావణాసురుడు చనిపోయారని, కానీ ఇప్పుడు సమాజంలో వేల సంఖ్యలో రేపులు చేస్తున్నా నిందితులు దర్జాగా బిర్యానీలు తింటున్నారని, వారిని మీరేం చేస్తున్నారని ప్రశ్నించడమే తన ఉద్దేశమని తెలిపారు.

​అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించాలని కోరుతూనే, అన్వేష్ ఒక సవాలు విసిరారు. తాను చెప్పిన దాంట్లో నిజంగా తప్పు ఉంటే ఈ రాత్రికి రక్తం కక్కుకుని చనిపోతానని, కానీ తన ఉద్దేశం సరైనదే అయి ఉండి కూడా తనను తప్పుబడితే, వారికే ఈ ఏడాది మొత్తం అష్ట దరిద్రాలు పట్టుకుంటాయని వ్యాఖ్యానించారు. తాను చేసింది తప్పు అని భావిస్తే క్షమాపణ స్వీకరించాలని, లేదంటే ఫలితం వినాయకుడే చూసుకుంటాడని అన్నారు.

​ఇక గరికపాటి నరసింహారావు గారి విషయంలో ఆడవారి వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తాను కొన్ని పదాలు వాడానని, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు అన్వేష్ తెలిపారు. పెద్దాయన కాబట్టి ఆయన్ని గౌరవిస్తున్నానని, ఆ వివాదానికి అక్కడితో ముగింపు పలుకుతున్నట్లు చెప్పారు. అలాగే నటుడు శివాజీని కూడా తాను విమర్శించానని, ఆ మాటలను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని భావిస్తున్నట్లు వెల్లడించారు.

​ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిదని, లేదు ఇంకా సాగదీస్తామంటే అది ఎవరి ఇష్టమని అన్వేష్ అన్నారు. తాను మాత్రం ఇప్పుడు థాయ్‌లాండ్‌లో సాండ్‌విచ్ మసాజ్ చేయించుకుని, రాత్రికి మంచి సినిమా చూసి రిలాక్స్ అవుతానని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నానని, అందులో తాను కూడా ఉండాలని ఆశిస్తున్నట్లు వీడియోను ముగించారు. ​తనపై వస్తున్న విమర్శలకు అన్వేష్ తన స్టైల్‌లోనే సమాధానం ఇచ్చారు. ఒకపక్క క్షమాపణలు చెబుతూనే, మరోపక్క తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మరి ఈ వీడియో తర్వాత నెటిజన్ల నుంచి, హిందూ సంఘాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. ​