Begin typing your search above and press return to search.

ఓటీటీలు ఖ‌తం.. ఉచిత వినోదం వైపు ప్రపంచం చూపు.. బ‌తుకు భార‌మైన ప్ర‌జా జీవితాలు

ప్రేక్షకుల వీక్షణ అలవాట్లు మొబైల్ స్క్రీన్ల నుండి స్మార్ట్ టీవీల వైపు వేగంగా మారడం కూడా యూట్యూబ్‌కు భారీగా కలిసివచ్చింది.

By:  Sivaji Kontham   |   7 Jun 2026 11:37 AM IST
ఓటీటీలు ఖ‌తం.. ఉచిత వినోదం వైపు ప్రపంచం చూపు.. బ‌తుకు భార‌మైన ప్ర‌జా జీవితాలు
X

ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లలో ప్రభుత్వాలు లేదా కార్పొరేట్ సంస్థలు స్థూల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని ఎంతగా ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల బడ్జెట్ కథ పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల భారం, స్థిరమైన ఆదాయాలు లేకపోవడం వల్ల మెజారిటీ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నెలా కుటుంబ బడ్జెట్‌ను సమతుల్యం చేసుకునే క్రమంలో సగటు మానవుడు ఐచ్ఛిక ఖర్చుల పరిధిలోకి వచ్చే వినోదానికి చివరి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఫలితంగా, నెట్‌ఫ్లిక్స్ వంటి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ల కోసం ప్రత్యేకంగా డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రజలు వెనుకాడుతున్నారు.

ఈ ఆర్థిక సంక్షోభం మారుతున్న వినియోగదారుల ఆలోచనా విధానం నేరుగా థియేట‌ర్ల‌లో సినిమాల వీక్ష‌ణ‌తో పాటు, ఓటీటీ మార్కెట్‌పైనా ప్రభావం చూపుతోంది. భారతదేశంతో పాటు సుమారు 20 అంతర్జాతీయ మార్కెట్లలో డబ్బు చెల్లించి ప్రీమియం కంటెంట్ చూసే వారి సంఖ్య కంటే, యూట్యూబ్‌లో ఉచితంగా లభించే ఇన్ఫర్మేటివ్- క్రియేటర్ ఆధారిత కంటెంట్‌ను ఆదరించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతంలో కేవలం మొబైల్ స్క్రీన్‌లకే పరిమితమైన యూట్యూబ్ ఇప్పుడు స్మార్ట్ టీవీల ద్వారా నేరుగా ఇళ్లలోని లివింగ్ రూమ్‌లను ఆక్రమించింది. ఈ పరిణామం నెట్‌ఫ్లిక్స్ వంటి సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ల మనుగడకు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఒకవైపు ధరల విష‌య‌లో అత్యంత సున్నితంగా ఉండే మార్కెట్లు... మరోవైపు ఉచితంగా లభించే అపరిమిత వినోదం ముందు పెయిడ్ మోడల్స్ వెలవెలబోతున్నాయి.

భవిష్యత్తులో నెట్‌ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌లు తమ ఉనికిని, ఆదాయాన్ని కాపాడుకోవాలంటే తమ సాంప్రదాయ బిజినెస్ మోడల్‌ను పూర్తిగా మార్చుకోక తప్పదు. కేవలం ఎగువ మధ్యతరగతి లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని మాత్రమే నమ్ముకుంటే మార్కెట్ విస్తరణ సాధ్యం కాదని తాజా గణాంకాలు నిరూపిస్తున్నాయి. అందుకే రానున్న‌ రోజుల్లో ఇవి కూడా యూట్యూబ్ తరహాలోనే ప్రకటనల ఆధారిత ఉచిత లేదా తక్కువ ధర కలిగిన `హైబ్రిడ్ మోడల్స్` (ఏవివోడి) వైపు మొగ్గు చూపాల్సి ఉంటుంది. అలాగే స్థానిక టెలికాం ఆపరేటర్లతో జతకట్టి రీఛార్జ్ ప్లాన్లతో బండ్లింగ్ ఆఫర్లు ఇవ్వడం ద్వారా మాత్రమే సామాన్యుడికి చేరువ కాగలవు. లేనిపక్షంలో ఉచిత డిజిటల్ విప్లవంలో ఈ ప్రీమియం ఓటీటీ వేదిక‌లు తమ మార్కెట్ వాటాను వేగంగా కోల్పోయే ప్రమాదం ఉంది.

గ్లోబల్ ఓటీటీ మార్కెట్‌లో యూట్యూబ్ హవా: నెట్‌ఫ్లిక్స్‌కు తప్పని సవాలు

ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలో డిజిటల్ విప్లవం కొత్త మలుపు తిరిగింది. అంతర్జాతీయంగా అత్యధిక జనాభా - మార్కెట్ ప్రాధాన్యత కలిగిన దాదాపు 20 దేశాలలో సగటు రోజువారీ వీక్షణ సమయం పరంగా యూట్యూబ్ ఏకంగా నెట్‌ఫ్లిక్స్‌నే దాటేసింది. `డిజిటల్ ఐ` సంస్థ పరిశోధన ప్రకారం.. ప్రతి యూట్యూబ్ ఖాతా రోజువారీ వీక్షణ సమయం 99.1 నిమిషాలకు పెరగ్గా, నెట్‌ఫ్లిక్స్ వీక్షణ 93.4 నిమిషాలకు పడిపోయింది. భారతదేశం వంటి ధరల విష‌యంలో సెన్సిబిల్ గా ఉండే మార్కెట్లలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక భారాల కారణంగా సామాన్యుడు కుటుంబ బడ్జెట్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లకు కోత పెడుతూ.. యూట్యూబ్‌లో ఉచితంగా లభించే వైవిధ్యమైన ఇన్ఫర్మేటివ్, క్రియేటర్ కంటెంట్‌కే జై కొడుతున్నాడనే వాస్తవాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రేక్షకుల వీక్షణ అలవాట్లు మొబైల్ స్క్రీన్ల నుండి స్మార్ట్ టీవీల వైపు వేగంగా మారడం కూడా యూట్యూబ్‌కు భారీగా కలిసివచ్చింది. లివింగ్ రూమ్‌లలో పెద్ద తెరలపై యూట్యూబ్ వీక్షణ శాతం 35 శాతానికి పెరగడంతో ఇది కేవలం సోషల్ మీడియాల‌లోనే కాకుండా టీవీ - నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీలకు యూట్యూబ్ ప్రత్యక్ష ప్రత్యామ్నాయంగా అవతరించింది. పోటీని తట్టుకోవడానికి యూట్యూబ్ ప్రీమియం కంటెంట్, లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్స్‌లోకి విస్తరిస్తుండగా.. నెట్‌ఫ్లిక్స్ కూడా తన మనుగడను కాపాడుకునేందుకు యాడ్-సపోర్టెడ్ (AVOD) ప్లాన్ల వైపు అడుగులు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో వినియోగదారుడి జేబుకు అనుగుణంగా బిజినెస్ మోడల్స్‌ను మార్చుకోకపోతే కేవలం కంటెంట్ నాణ్యతను నమ్ముకుని ప్రీమియం ట్యాగ్‌తో నిలదొక్కుకోవడం పే-ఓటీటీలకు భవిష్యత్తును ప్ర‌శ్నార్థ‌కం చేయ‌నుంది. క‌రోనా- యుద్ధాలు- ఆయిల్ క్రైసిస్- గ్యాస్ క్రైసిస్- స్కామ్ లు- ప్ర‌భుత్వాల వైఫ‌ల్యాలు- అధికారుల మోసాలు .. ఇవ‌న్నీ ప్ర‌జా జీవితాల‌ను అత‌లాకుత‌లం చేయడం వ‌ల్ల కూడా వినోదానికి ప్ర‌జ‌ల‌ పెట్టుబడులు త‌గ్గిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.