Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్‌పై యూట్యూబ్ ఆధిక్యం..సంప‌ద ఎంతో తెలుసా?

స్ట్రీమింగ్ ప్రపంచంలో యూట్యూబ్ ఎదుగుద‌ల అసాధార‌ణంగా ఉంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ప్ర‌పంచాన్ని శాసిస్తున్న దిగ్గ‌జ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆదాయాన్ని సైతం యూట్యూబ్ అధిగ‌మించింది.

By:  Sivaji Kontham   |   7 Feb 2026 10:59 PM IST
నెట్ ఫ్లిక్స్‌పై యూట్యూబ్ ఆధిక్యం..సంప‌ద ఎంతో తెలుసా?
X

స్ట్రీమింగ్ ప్రపంచంలో యూట్యూబ్ ఎదుగుద‌ల అసాధార‌ణంగా ఉంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ప్ర‌పంచాన్ని శాసిస్తున్న దిగ్గ‌జ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆదాయాన్ని సైతం యూట్యూబ్ అధిగ‌మించింది. నెట్ ఫ్లిక్స్ ఇప్ప‌టికి 45 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌ల్ని సృష్టిస్తే, యూట్యూబ్ 2025 నాటికి ఏకంగా 60 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌ను సృష్టించింది. ఈ మొత్తం నెట్ ఫ్లిక్స్ తో పోలిస్తే ఏకంగా 15 బిలియ‌న్ డాల‌ర్లు అధికంగా క‌నిపిస్తోంది. దీనిని బ‌ట్టి యూట్యూబ్ మాధ్య‌మం తిరుగులేని శ‌క్తిగా అవ‌తరించింద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే నెట్ ఫ్లిక్స్ కి కేవ‌లం స‌బ్ స్క్రిప్ష‌న్ల ద్వారా ఆదాయం ఆర్జిస్తుంటే, యూట్యూబ్ స‌బ్ స్క్రిప్ష‌న్ల‌తో పాటు, ప్ర‌క‌ట‌న‌ల ద్వారాను ఆర్జిస్తోంది. నెట్ ఫ్లిక్స్ సొంతంగా కంటెంట్ కోసం వేల కోట్లు ఖ‌ర్చు చేస్తుంటే, యూట్యూబ్ మాత్రం ఉచితంగా కంటెంట్ పొందుతోంది. దీంతో ఇది కంటెంట్ ప్ర‌పంచంలో రారాజుగా నిలిచింది. యూట్యూబ్ ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంతో ఎంద‌రో రారాజులుగాను ఎదుగుతుంటే నెట్ ఫ్లిక్స్ స్వార్థ‌పూరిత ప్ర‌యోజ‌నాల‌తోనే ఎదుగుతోంది.

యూట్యూబ్ కి కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌ ద్వారా వచ్చే ఆదాయం నెట్‌ఫ్లిక్స్ మొత్తం ఆదాయాన్ని దాటేస్తోంది. నిజానికి నెట్ ఫ్లిక్స్ సొంత సినిమాలు, సిరీస్ ల కోసం బిలియ‌న్ల డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేస్తోంది. కానీ యూట్యూబ్ కంటెంట్ ను యూజర్లే ఉచితంగా సృష్టించ‌డం అడ్వాంటేజ్‌గా మారింది. యూట్యూబ్ కేవలం లాభాల్లో వాటా మాత్రమే ఇస్తుంది.

టిక్‌టాక్ తరహాలో వచ్చిన `షార్ట్స్` యూట్యూబ్ లో విపరీతమైన పాపులారిటీ సంపాదించాయి. దీనివల్ల యూజర్ల సంఖ్య , యాడ్ వ్యూస్ భారీగా పెరిగాయి. ఇప్పుడు చాలా మంది టీవీల్లో నేరుగా యూట్యూబ్ చూస్తున్నారు. ఇది పెద్ద బ్రాండ్‌లకు ఖరీదైన యాడ్స్ ఇచ్చే అవకాశం కల్పిస్తోంది.

త‌దుప‌రి యూట్యూబ్ టీవీ, ఎన్‌.ఎఫ్‌.ఎల్ సండే టికెట్ వంటి స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కులతో ట్రెడిషనల్ కేబుల్ టీవీ మార్కెట్‌ను కూడా యూట్యూబ్ దెబ్బ తీస్తోంది. నెట్‌ఫ్లిక్స్ కూడా దీనికి పోటీగా ఇప్పుడు యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కానీ యూట్యూబ్ కి ఉన్న నెట్‌వర్క్, డేటా ముందు అది ఇంకా వెనుకబడే ఉంది. యూట్యూబ్ ఎదుగుదల చూస్తుంటే, భవిష్యత్తులో `టీవీ అంటే యూట్యూబ్` అనే స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఉపాధి హామీనిచ్చే క‌ల్ప‌త‌రువు:

చాలా మంది ప్ర‌తిభావంతుల‌ను యూట్యూబ్ ఆర్జ‌న‌లో ఉత్త‌ములుగా మ‌లుస్తోంది. యూట్యూబ్ అనేది ఇప్పుడు ఒక `డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్` లాంటిది. నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం ఎంపిక చేసుకున్న స్టార్లు మాత్రమే ఉంటారు, కానీ యూట్యూబ్‌లో ఒక సామాన్యుడు కూడా స్టార్ కావచ్చు. క్రియేటర్లను ఒక వ్యాపార భాగస్వాములుగా చూసే విధానం యూట్యూబ్ కి మాత్ర‌మే చెల్లిన‌ ప్ర‌త్యేక‌త‌.