Begin typing your search above and press return to search.

ల‌వ్ టుడే - ప్రేమ‌లు రేంజ్‌కు వెళ్లాల్సింది కానీ..

ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా చ‌ర్చించుకున్న ప్రేమ‌క‌థా చిత్రం స‌య్యారా. ఈ బాలీవుడ్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించి 500 కోట్లు పైగా వ‌సూలు చేసింది.

By:  Sivaji Kontham   |   30 March 2026 10:15 AM IST
ల‌వ్ టుడే - ప్రేమ‌లు రేంజ్‌కు వెళ్లాల్సింది కానీ..
X

ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా చ‌ర్చించుకున్న ప్రేమ‌క‌థా చిత్రం స‌య్యారా. ఈ బాలీవుడ్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించి 500 కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఆషిఖి ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన సినిమాగా స‌య్యారాకు మొద‌టి నుంచి క్రేజ్ నెల‌కొన‌డం న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న అంత పెద్ద విజ‌యానికి కార‌ణం. అయితే ద‌క్షిణాదిన కూడా గ‌తంలో వ‌చ్చిన ల‌వ్ టుడే, ప్రేమ‌లు వంటి యువ‌త‌రం చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంతృప్తిక‌ర‌మైన విజ‌యాల్ని అందుకున్నాయి. ముఖ్యంగా యువ‌త‌రం రిపీటెడ్ గా ఈ చిత్రాల‌ను చూడ‌టంతో అవి బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపించాయి.

అయితే ఇప్పుడు ఇంచుమించు అదే త‌ర‌హాలో యువ‌త‌రాన్ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నంతో రూపొందించిన యూత్ త‌మిళ‌నాడు బాక్సాఫీస్ వ‌ద్ద గొప్ప‌గానే ఆడింది. కానీ తెలుగులో ఈ సినిమా మాస్ ఆడియెన్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోయింద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఈ చిత్రానికి ఏ క్లాస్ సెంట‌ర్ల‌లో వ‌సూళ్లు బావున్నా మాస్ ఏరియాల్లో అంత‌గా జ‌నం థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డం మైన‌స్ గా మారింది. ముఖ్యంగా దురంధ‌ర్ 2, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ లాంటి భారీ చిత్రాలు విడుద‌ల కావ‌డంతో వాటి ప్ర‌భావం కూడా ఇత‌ర సినిమాల‌పై ఉంద‌నేది సుస్ప‌ష్ఠం.

అయితే కంటెంట్ ప‌రంగా ఫ్రెష్ నెస్ తో ఆక‌ట్టుకుంద‌న్న టాక్ అయితే `యూత్` చిత్రానికి ఉంది. ఈ త‌మిళ అనువాద చిత్రానికి శ‌ర్వానంద్ లాంటి స్టార్ ప్ర‌మోష‌న్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఇప్పుడు అదే శ‌ర్వానంద్ న‌టించిన బైక‌ర్ చిత్రం మ‌రో ఐదు రోజుల్లో విడుద‌ల కానుండ‌గా, అప్ప‌టివ‌ర‌కూ అయినా యూత్ బాగా వ‌సూలు చేస్తుందా? అంటూ చ‌ర్చ సాగుతోంది. ఈ వారంలో బైక‌ర్, రాకాస వంటి చిత్రాలు క్రేజీగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కంటెంట్ ఉన్న `యూత్` థియేట‌ర్ల నుంచి వైదొల‌గాల్సి ఉంటుంది. అయితే మైత్రి మూవీ మేక‌ర్స్ లాంటి పెద్ద సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేసి ప్ర‌మోష‌న్స్ ప‌రంగా త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేయ‌డం కొంత‌వ‌ర‌కూ మేలైంది. ఈ ఉగాదికి త‌మిళ‌నాడులో ఉత్త‌మ‌మైన ఫ‌లితాన్ని అందుకున్న యూత్ చిత్రం తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింద‌ని చెప్పాలి.

క‌థ‌- కాస్టింగ్ ముఖ్యం:

సినిమా రంగంలో కథ ఎంత ముఖ్యమో, ఆ కథలోని పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన `యూత్` సినిమా కాస్టింగ్ విషయంలో మేకర్స్ ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చిత్రంలో ప్రధానంగా యువ ప్రతిభకు పెద్దపీట వేయడం విశేషం.

కెన్ కరుణాస్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌. అత‌డే ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ ప్ర‌తిభావంతుడు గతంలో అళగు కుట్టి చెల్లమ్ (2016), అసురన్ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించాడు. యూత్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించారు. తన తండ్రి కరుణాస్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కెన్ ఈ `యూత్` చిత్రంతో మరో మెట్టు ఎక్కాడ‌నే చెప్పాలి. ఈ చిత్రంలో కథానాయికగా అనిష్మా అనిల్‌కుమార్ నటించారు. యువతను ఆకట్టుకునేలా ఆమె పాత్రను డిజైన్ చేయ‌డం వివేషం.: సీనియర్ నటి దేవదర్శిని ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. తన సహజసిద్ధమైన నటనతో ఆమె ఈ చిత్రానికి అదనపు బలాన్ని చేకూర్చారు. మలయాళ చిత్ర పరిశ్రమలో జాతీయ అవార్డు గ్రహీత అయిన సూరజ్ వెంజారమూడు ఈ సినిమాలో నటించడం విశేషం. ఆయన ఉనికి సినిమా స్థాయిని మరింత పెంచింది. వర్ధమాన నటి ప్రియాన్షి యాదవ్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో మెరిసారు. ప్రవీణ్ వంటి ఇతర యువ నటీనటులు కూడా తమ వంతు ప్రతిభను చాటారు.