Begin typing your search above and press return to search.

క్యాస్టింగ్ కౌచ్ బెడద.. ఇంకా పూర్తిగా తగ్గలేదా?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఒకప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించేవి.

By:  M Prashanth   |   26 Aug 2026 2:55 PM IST
క్యాస్టింగ్ కౌచ్ బెడద.. ఇంకా పూర్తిగా తగ్గలేదా?
X

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఒకప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించేవి. ఈ మధ్య ఆ అంశం పెద్దగా వార్తల్లోకి రాకపోయినా సమస్య పూర్తిగా ముగిసిందని మాత్రం చెప్పలేం. ఇప్పుడు ఓ తెలుగు యువ దర్శకుడిపై నటి చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దర్శకుడిని అదుపులోకి తీసుకుని, తర్వాత రిమాండ్‌కు పంపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

సదరు దర్శకుడిపై ఆ నటి గతంలోనే కొన్ని ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఉన్నత పోలీసు అధికారులను సంప్రదించి, తన దగ్గర ఉన్న ఆధారాలను కూడా అందించినట్లు సమాచారం. ఆ తర్వాతే పోలీసులు రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇందులో ఉన్న వ్యక్తుల పేర్లు అధికారికంగా ఇంకా బయటకు రావాల్సి ఉంది.

నిజానికి క్యాస్టింగ్ కౌచ్ సమస్య సినిమా రంగానికే పరిమితం కాదు. కానీ సినీ పరిశ్రమలో ఇలాంటి ఆరోపణలు వస్తే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కొత్తగా అవకాశాల కోసం వచ్చే నటీనటులు దర్శకులు, నిర్మాతలు, కాస్టింగ్ టీమ్స్‌తో ఎక్కువగా పరిచయాలు పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకే సినిమా ఛాన్స్ పేరుతో ఎవరైనా హద్దులు దాటారనే ఆరోపణ వస్తే అది వెంటనే పెద్ద విషయంగా మారుతుంది.

ఈ ఏడాది మొదట్లోనే హైదరాబాద్‌లో ఓ యువ నటి కాస్టింగ్ ఆర్టిస్ట్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించిన ఘటన కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మరో దర్శకుడిపై వచ్చిన ఫిర్యాదు అదే సమస్యను మళ్లీ ముందుకు తీసుకొచ్చింది. ఇక పోలీసుల దర్యాప్తు తర్వాతే అసలు విషయం బయటపడుతుంది.

ప్రస్తుతం ఈ యువ దర్శకుడు ఓ మలయాళ నటుడితో సినిమా చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి, కేసులో తర్వాత ఏం జరుగుతుందన్నది పోలీసుల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే తెలుస్తుంది. మగవాళ్ళు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గతంలో టాక్ వచ్చింది. ఇక క్యాస్టింగ్ కౌచ్ అనే దానికి ఎవరు భయపడకుండా బయటకు వచ్చి చెబితేనే ఎండ్ కార్డ్ పడుతుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.