తమన్, డీఎస్పీ Vs అనిరుధ్, అభ్యంకర్.. ఏంటి కథ?
అనిరుధ్ రవిచందర్, సాయి అభ్యకంర్ వంటి యువ సంగీత దర్శకులపై మ్యూజిక్ లవర్స్, సినీ ప్రియుల్లో ప్రత్యేక చర్చ జరుగుతోంది.
By: M Prashanth | 15 July 2026 11:46 AM ISTటాలీవుడ్ లో సంగీత దర్శకుల గురించి చర్చ వస్తే ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్, తమన్ పేర్లే ఎక్కువగా వినిపించేవి. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు వీరి హవా కొనసాగింది. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారుతున్నట్లు కనిపిస్తోంది. అనిరుధ్ రవిచందర్, సాయి అభ్యకంర్ వంటి యువ సంగీత దర్శకులపై మ్యూజిక్ లవర్స్, సినీ ప్రియుల్లో ప్రత్యేక చర్చ జరుగుతోంది. దీంతో అనిరుధ్, అభ్యంకర్- తమన్, డీఎస్పీకి డిఫరెన్స్ ఏంటనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
అయితే దీనికి ఆన్సర్ టాలెంట్ లో కాదు. ఎందుకంటే తమన్, డీఎస్పీ ఇద్దరూ ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన సంగీత దర్శకులు. ఎన్నో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్లతో తమ స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని వెతుకుతూనే ఉంటారు. నిజానికి సినీ పరిశ్రమలో ఒక విషయం ఎప్పటినుంచో కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన టాలెంట్ పై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.
కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త సంగీత దర్శకుడు.. ఎవరైనా సరే స్టార్టింగ్ లో ఎక్కువ చర్చకు వస్తారు. ఎందుకంటే వారి నుంచి ఏదో కొత్తదనం వస్తుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. అనిరుధ్ విషయంలో కూడా అదే జరిగింది. తమిళంలో ఇప్పటికే స్టార్ కంపోజర్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఆయన సంగీతం కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్స్, యూత్ ను ఆకట్టుకునే ట్యూన్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
ప్రస్తుతం పెద్ద సినిమాలకు అనిరుధ్ పేరు ఫస్ట్ సెలక్షన్ గా మారడం కూడా అందుకే. ఇక సాయి అభ్యంకర్ విషయానికి వస్తే, ఇంకా కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నప్పటికీ ఆయన పేరు చర్చల్లో నిలుస్తోంది. కొత్త జెనరేషన్ కు దగ్గరగా ఉండే మ్యూజిక్ స్టైల్, సోషల్ మీడియాలో మంచి గుర్తింపు వంటి అంశాలు ఆయనపై ప్రత్యేక దృష్టి పడేలా చేస్తున్నాయి. మరోవైపు తమన్, డీఎస్పీ పరిస్థితి భిన్నంగా ఉంది. వీరిద్దరూ ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఎన్నో సూపర్ హిట్ పాటలు, భారీ విజయాలు అందించారు. ప్రేక్షకులు కూడా వారి సంగీతాన్ని బాగా తెలుసుకున్నారు. అందుకే వారి నుంచి మంచి అవుట్ పుట్ వచ్చినా అది సహజంగానే తీసుకుంటారు. అదే కొత్తవాళ్ల నుంచి చిన్న హిట్ వచ్చినా అది పెద్ద చర్చగా మారుతుంది. అయితే ఎప్పుడైనా ప్రతి జనరేషన్ తన కొత్త టాలెంట్ ను ముందుకు తీసుకువస్తుంది. కొత్త అవుట్ పుట్ వస్తూనే ఉంటుంది. ఆ కొత్తదనమే మొదట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
కొంతకాలం పాటు అందరూ వారి గురించే మాట్లాడతారు. అయితే సవాళ్లు తట్టుకుని నిలబడటం మాత్రం మరో విషయం. అందుకే అనిరుధ్, అభ్యంకర్ పై ప్రస్తుతం కనిపిస్తున్న క్రేజ్ ను తమన్, డీఎస్పీలతో పోల్చి చూడాల్సిన అవసరం లేదు. ఒకరు కొత్తదనానికి సింబల్ అయితే, మరొకరు ఎక్స్పీరియన్స్ కు మారుపేరు. ప్రస్తుతం ప్రేక్షకుల చూపు యువ సంగీత దర్శకులపై ఉన్నా, టాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్ లో తమన్, డీఎస్పీ వంటి సీనియర్ల స్థానాన్ని మాత్రం ఎవరూ తక్కువ చేసి చూడలేరు.
