Begin typing your search above and press return to search.

గ్లోబల్ మార్కెట్‌లో టాలెంట్ ఒక్కటే సరిపోదు?

పాన్-ఇండియా విజయం సాధించాలంటే ప్రాథమికంగా కావాల్సింది నేటివిటీ కథ . యూనివర్సల్ ఎమోషన్ అనే సూత్రంపై స్పష్టమైన పట్టు.

By:  Srikanth Kontham   |   22 Sept 2026 4:40 PM IST
గ్లోబల్ మార్కెట్‌లో టాలెంట్ ఒక్కటే సరిపోదు?
X

పాన్-ఇండియా మార్కెట్ అనేది కేవలం ట్రెండ్ మాత్రమే కాదు. అదొక గ్లోబల్ బెంచ్‌మార్క్. ప్రాంతీయ సరిహ ద్దులు చెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన కంటెంట్‌తో పోటీపడుతున్న నేటి చలనచిత్ర రంగాన యువ దర్శకులు విజయం సాధించడం సామాన్యమైన విష‌యం కాదు. ఒకే ప‌రిశ్ర‌మ ఆడియన్స్‌ను అలరిస్తే సరిపోదు. దేశ‌మంతాటా.. అలాగే అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం కట్టిపడేసే కథాంశాలను ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో యువ దర్శకులు రాణించాలంటే సాంప్రదాయ ఆలోచనలకు స్వస్తి చెప్పి దూరదృష్టి, అపారమైన నాలెడ్జ్ , సరికొత్త ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యంత ముఖ్యం.

పాన్-ఇండియా విజయం సాధించాలంటే ప్రాథమికంగా కావాల్సింది నేటివిటీ కథ . యూనివర్సల్ ఎమోషన్ అనే సూత్రంపై స్పష్టమైన పట్టు. దర్శకుడికి మట్టి వాసన కలిగిన కథలు, స్థానిక సంస్కృతి, చరిత్ర , జానపదాలపై లోతైన అవగాహన ఉండాలి. కథ ఎంత స్థానికంగా ఉంటే? అందులోని ఎమోషన్ అంత విశ్వజనీనంగా ఆకట్టుకుంటుంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా మానవ నైజం, బంధాలు, ఆవేశం, ఆత్మగౌరవం వంటి భావోద్వేగాలను సరైన మోతాదులో స్క్రీన్‌పై ఆవిష్కరించే సైకాలజీపై యువ మేకర్స్ పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి యూనిక్ క‌థ చెప్పినా? ఎమోష‌న్ అన్న‌ది ఏ కథ‌ కైనా కీల‌క‌మైన అంశ‌మ‌ని గుర్తించాలి.

సాంకేతికంగా నేటి యువ దర్శకులు పాతతరం కంటే ఎంతో అడ్వాన్స్‌గా ఉండటం అనివార్యం. షాట్ డివిజన్, కెమెరా యాంగిల్స్ తెలిస్తే సరిపోదు. వర్చువల్ ప్రొడక్షన్, సిజిఐ , మోషన్ క్యాప్చర్, ఆన్రీల్ ఇంజిన్ వంటి అత్యాధునిక విజ్యువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీలపై కనీస స్థాయి ప్రావీణ్యం ఉండాలి. అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్లతో సరిసమానంగా చర్చించగలిగే పరిజ్ఞానం ఉన్నప్పుడే ఆలోచనను స్క్రీన్‌పై తక్కువ ఖర్చుతో, అనుకున్న నాణ్యతతో తీసుకురాగలరు. దీంతో పాటు డాల్బీ అట్మాస్, స్పేషియల్ ఆడియో వంటి అడ్వాన్స్‌డ్ సౌండ్ డిజైన్ సాంకేతికతలపై కూడా దర్శకుడికి పట్టు ఉండాలి.

మార్కెట్ డైనమిక్స్ , విభిన్న ప్రాంతాల ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకోవడం మరో కీలకమైన అంశం. ఒక ప్రాంతంలో క్లిక్ అయ్యే కామెడీ లేదా మాస్ ఎలిమెంట్ మరొక ప్రాంతంలో వర్కవుట్ కాకపోవచ్చు. అందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వ్యత్యాసాలు, అక్కడి ప్రేక్షకుల పల్స్, థియేట్రికల్ క్రేజ్‌ను అధ్యయనం చేయడం అవసరం. ఏ సన్నివేశం ఏ భాషా ప్రేక్షకులకు ఏ రకమైన అనుభూతిని ఇస్తుందో? అంచనా వేయగల విశ్లేషణాత్మక పరిజ్ఞానం ఉన్నప్పుడే సినిమా అన్ని సరిహద్దులను దాటుతుంది.

ప్రీ-ప్రొడక్షన్, ఎగ్జిక్యూషన్ విధానంలో కూడా యువ మేకర్స్ ఏఐ టూల్స్, ప్రీ-విజువలైజేషన్ , స్టోరీబోర్డింగ్ , యాని మేటిక్స్ వంటి ఆధునిక సాధనాలను ఉపయోగించడంలో దిట్టగా మారాలి. సెట్‌కి వెళ్లకముందే సినిమా ఎలా ఉండబోతోందో? డిజిటల్ మాధ్యమంలో విజువలైజ్ చేసుకోగలిగితే ప్రొడక్షన్ ఖర్చులు తగ్గడమే కాకుండా షూటింగ్ సమయంలో సమయం వృధా కాకుండా ఉంటుంది. బడ్జెట్ మేనేజ్‌మెంట్ , టైమ్ మేనేజ్‌మెంట్ రెండింటినీ సమర్థవంతంగా సమతుల్యం చేసే పక్కా ప్రణాళికాబద్ధమైన నాలెడ్జ్ నేటి పాన్-ఇండియా దర్శకుడికి అత్యవసరం.

అంతిమంగా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డైనమిక్ నాయకత్వ లక్షణాలు, నిరంతర అధ్యయనం అనుకూలత యువ దర్శకుడిని శ్రేష్ఠుడిగా నిలబెడతాయి. సినిమా రం‌గంలో రోజురోజుకూ మారుతున్న ట్రెండ్స్, సరికొత్త విజ్యువల్ స్టాండర్డ్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ టూల్‌కిట్‌ను అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. బలమైన కథా బలం, నమ్మకం , సాంకేతిక నైపుణ్యాలను సరిగ్గా సమ్మిళితం చేసి తనదైన మార్క్ విజన్‌ను ప్రతిబింబించే యువ దర్శకులు మాత్రమే రాబోయే కాలంలో పాన్-ఇండియా లీగ్‌లో రాణించగ‌ల‌రు. వాళ్లు మాత్ర‌మే భారతీయ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా నూతన శిఖరాలకు తీసుకెళ్లగలరు.