Begin typing your search above and press return to search.

రజినీ కోసం సింబు కథ.. కమల్ ప్రాజెక్ట్ లో ఆ యంగ్ డైరెక్టర్ ఫిక్స్?

వాస్తవానికి ఈ సినిమా (తలైవా 173) కోసం ముందుగా సీనియర్ డైరెక్టర్ సుందర్ సి పేరుని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   25 Nov 2025 10:05 AM IST
రజినీ కోసం సింబు కథ.. కమల్ ప్రాజెక్ట్ లో ఆ యంగ్ డైరెక్టర్ ఫిక్స్?
X

సూపర్ స్టార్ రజినీకాంత్ స్పీడ్ చూస్తుంటే యంగ్ హీరోలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆయన ఎనర్జీ డబుల్ అవుతోంది. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ తో 'జైలర్ 2' పనుల్లో బిజీగా ఉన్న తలైవా, మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ టాక్ వినిపిస్తోంది. అది కూడా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాకు కెప్టెన్ ఎవరనేది ఇన్నాళ్లు సస్పెన్స్ గా మారింది.

వాస్తవానికి ఈ సినిమా (తలైవా 173) కోసం ముందుగా సీనియర్ డైరెక్టర్ సుందర్ సి పేరుని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఆల్మోస్ట్ షూటింగ్ కి సిద్ధమైన టైంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో తలైవాను డీల్ చేసే ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరదించుతూ ఒక యంగ్ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టిన ఆ దర్శకుడి వైపే రజినీ మొగ్గు చూపినట్లు సమాచారం.

అతను మరెవరో కాదు.. రీసెంట్ గా 'పార్కింగ్' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రామ్‌కుమార్ బాలకృష్ణన్. చిన్న కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఆడియన్స్ ను మెప్పించిన ఈ దర్శకుడు, ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. రజినీకి రామ్‌కుమార్ చెప్పిన లైన్ బాగా నచ్చడంతో దాదాపు ఈ కాంబో లాక్ అయినట్లే అని ఇన్ సైడ్ టాక్. 'పార్కింగ్' సినిమా చూసిన ఎవరైనా సరే ఈ డైరెక్టర్ టేకింగ్ కు ఫిదా అవ్వాల్సిందే.

ఇక్కడో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే.. రామ్‌కుమార్ వినిపించిన ఈ కథను మొదట హీరో శింబు కోసం రాసుకున్నారట. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. ఇప్పుడు అదే కథకు రజినీ ఇమేజ్ కు, స్టార్ డమ్ కు తగ్గట్టుగా భారీ మార్పులు చేసి వినిపించగా, తలైవా ఇంప్రెస్ అయ్యారని టాక్. శింబు కోసం రాసుకున్న కథలో రజినీని ఊహించుకోవడం అంటే.. దర్శకుడు కథను ఏ రేంజ్ లో మలిచాడో అర్థం చేసుకోవచ్చు.

ఈ భారీ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పై నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ డిసెంబర్ 12న, రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా రానుందని సమాచారం. ఒకే పోస్టర్ పై రజినీ, కమల్ (నిర్మాతగా) పేర్లు కనిపిస్తే ఫ్యాన్స్ కు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026 మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కేవలం ఒక్క సినిమా అనుభవంతోనే రజినీ లాంటి లెజెండ్ ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం రామ్‌కుమార్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. మరి ఈ 'పార్కింగ్' డైరెక్టర్ సూపర్ స్టార్ ఇమేజ్ ని ఏ రేంజ్ లో డ్రైవ్ చేస్తారో చూడాలి.