Begin typing your search above and press return to search.

45 పాత్ర‌ల‌ గిన్నిస్ రికార్డ్‌ను బ్రేక్ చేసేది ఎవ‌రు?

ఒకే సినిమాలో అత్యధిక పాత్రలు పోషించే అరుదైన ప్రయోగానికి తమిళ హాస్యనటుడు యోగిబాబు సిద్ధమయ్యారు. ‘మూన్ వాక్’ చిత్రంలో ఏకంగా 16 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు కమల్ హాసన్ ‘దశావతారం’లో 10 పాత్రలు పోషించగా, యోగిబాబు ఆ రికార్డును అధిగమించారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది.

By:  Sivaji Kontham   |   18 Nov 2026 9:07 AM IST
45 పాత్ర‌ల‌ గిన్నిస్ రికార్డ్‌ను బ్రేక్ చేసేది ఎవ‌రు?
X

సినిమాల్లో ఒకే నటుడు ద్విపాత్రాభినయం లేదా త్రిపాత్రాభినయం చేయడం సాధారణమే కానీ.. ఒకే చిత్రంలో 10 అంతకంటే ఎక్కువ విభిన్న పాత్రల్లో కనిపించడం అనేది అసాధారణమైన ప్రతిభకు నిదర్శనం. కేవలం ప్రోస్థెటిక్ మేకప్‌పైనే ఆధారపడకుండా హావభావాలు.. విభిన్న భాషల‌ యాసలు... బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అరుదైన స్టార్లు భారతీయ సినీ చరిత్రలో ఉన్నారు. హాలీవుడ్ దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రీతిలో ఒకే సినిమాలో అత్యధిక పాత్రలు పోషించి రికార్డులు సృష్టించిన నటీనటుల ప్రస్థానం సినీ ప్రియులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.

ఈ జాబితాలో ప్రపంచ రికార్డు స్థాయిలో నిలిచిన పేరు మలయాళ నటుడు జాన్సన్ జార్జ్. 2018లో విడుదలైన `ఆరాను న్జాన్` అనే చిత్రంలో ఆయన ఏకంగా 45 విభిన్న పాత్రల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. మహాత్మా గాంధీ, జీసస్ క్రైస్ట్, లియోనార్డో డా విన్సీ, చార్లీ చాప్లిన్ వంటి చారిత్రక వ్యక్తుల నుంచి సామాన్యుల వరకు 45 రకాల పాత్రలను ఒక్కరే పోషించి ప్ర‌పంచ సినీ విశ్లేష‌కుల‌ను సైతం విస్మయానికి గురిచేశారు.

ఇక భారతీయ మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల విషయానికి వస్తే.. లోకనాయకుడు కమల్ హాసన్ పేరు అగ్రస్థానంలో నిలుస్తుంది. 2008లో వచ్చిన `దశావతారం` చిత్రంలో ఆయ‌న‌ 10 విభిన్న పాత్రల్లో నటించి నట‌విశ్వరూపాన్ని ప్రదర్శించారు. 12వ శతాబ్దపు వైష్ణవుడు రంగరాజన్ నంబి, సైంటిస్ట్ గోవిందరాజన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, తెలుగు పోలీస్ అధికారి బలరామ్ నాయుడు, వృద్ధురాలు కృష్ణవేణి వంటి భిన్నమైన వ్య‌క్తిత్వాల‌తో పది పాత్రలను పోషించి భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. అయితే ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ రికార్డును కూడా బ్రేక్ చేస్తూ త‌మిళ హాస్య న‌టుడు యోగిబాబు 16 పాత్ర‌ల్లో న‌టించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. `మూన్ వాక్` అనే చిత్రంలో యోగిబాబు ఈ ప్ర‌యోగం చేసారు. ఆస‌క్తిక‌రంగా భార్య పాత్ర- భ‌ర్త పాత్ర‌లో కూడా అత‌డే న‌టించాడు. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది.

మహిళా న‌టీమ‌ణుల విష‌యానికి వ‌స్తే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అరుదైన ఘనత సాధించారు. 2009లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన `వాట్స్ యువర్ రాశీ?` చిత్రంలో పీసీ 12 రాశులకు ప్రతిరూపంగా 12 మంది వేర్వేరు అమ్మాయిల పాత్రల్లో నటించి రికార్డు సృష్టించారు. వీరితో పాటు క్లాసిక్ డే యుగంలో తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు.. తమిళంలో శివాజీ గణేశన్... హిందీలో సంజీవ్ కుమార్ `నవరాత్రి` (హిందీలో నయా దిన్ నయీ రాత్) చిత్రాల్లో నవరసాలకు ప్రతీకగా 9 విభిన్న పాత్రల్లో నటించి 10 పాత్రల రికార్డుకు అత్యంత సమీపంగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొన‌గాళ్లు చిత్రంలో మూడు పాత్ర‌లు పోషించిన విష‌యం తెలిసిందే.

హాలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్లు ఎడ్డీ మర్ఫీ `ది నట్టీ ప్రొఫెసర్` చిత్రంలో 7 పాత్ర‌లు పోషించారు. `ఆస్టిన్ పవర్స్` సిరీస్ న‌టుడు మైక్ మైయ‌ర్స్ కెరీర్ లో 2 మించి, బహు పాత్రలతో మెప్పించారు. అయితే హాలీవుడ్ లో సైతం భార‌తీయ న‌టుల రికార్డుల‌ను బ్రేక్ చేయ‌లేక‌పోయారు. ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త‌దేశంలో 45 పాత్ర‌లు.. 10-12 పాత్ర‌ల‌లో న‌టించిన తార‌లు ఉన్నారు. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేస్తూ హాస్య‌న‌టుడు యోగిబాబు 16 పాత్ర‌లు పోషించాడు. భ‌విష్య‌త్ లో ఇంకా ఎవ‌రైనా ప్ర‌యోగాల‌కు దిగి పాత రికార్డులను బ్రేక్ చేస్తారా? అనేది వేచి చూడాలి.