Begin typing your search above and press return to search.

విజ‌యం తెచ్చిన అహంకారం అంతే వేగంగా పాతాళానికి!

భారతీయ సంగీత ప్రపంచంలో రాప్ సంస్కృతిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన గాయకుడు, సంగీత దర్శకుడు యో యో హనీ సింగ్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఓ సంచలనం.

By:  Srikanth Kontham   |   28 May 2026 4:00 PM IST
విజ‌యం తెచ్చిన అహంకారం అంతే వేగంగా పాతాళానికి!
X

భారతీయ సంగీత ప్రపంచంలో రాప్ సంస్కృతిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన గాయకుడు, సంగీత దర్శకుడు యోయో హనీ సింగ్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఓ సంచలనం. తన వినూత్నమైన పాటలతో యువతను ఊరూత లూగించిన ఆయన కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పరిశ్రమకు దూరమైన సంగ‌తి తెలిసిందే. దానికి కారణం హ‌నీసింగ్ మత్తు పదార్థాల వ్యసనంలో కూరుకుపోవడం .. బైపోలార్ డిజార్డర్ వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడటమే. ఇటీవల ఓ అంతర్జాతీయ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న హనీ సింగ్, ఆ రోజుల్లో బాలీవుడ్ అగ్ర నటులు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తనను హెచ్చరించిన విషయాలను పంచుకున్నారు.

తన కెరీర్ ఉచ్ఛస్థితిలో ఉన్న 2011 -2014 మధ్య కాలంలో హనీ సింగ్ కీర్తి ప్రతిష్టలను, అపారమైన సంపదను ఆర్జించారు. అయితే అంత చిన్న వయసులోనే లభించిన అసాధారణ విజయం ఆయన ఆలోచనా విధానాన్ని ప్రవర్తనను పూర్తిగా మార్చేసింది. ఆ సమయంలో తనకు అహంకారం బాగా తలకెక్కిందని, అందరినీ చులకనగా చూడటం ప్రారంభించానని సింగ్ స్వయంగా అంగీకరించారు. ఒక రకమైన అహంతో తనను తాను దేవుడిగా భావించుకునే మానసిక స్థితికి వెళ్ళిపోయానని ఆ రాక్షస ప్రవృత్తిలోనే డ్రగ్స్‌కు బానిసనయ్యానని ఆవేదన చెందారు.

ఆ సమయంలో హనీ సింగ్ జీవనశైలిని, రోజురోజుకూ పెరుగుతున్న అలవాట్లను గమనించిన బాలీవుడ్ పెద్దలు ఆయన్ని సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నించారని రివీల్ చేసాడు. ముఖ్యంగా అగ్ర హీరోలు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ ఆయన్ని వ్యక్తిగతంగా పిలిచి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గట్టిగా మందలించారట. `నువ్వు వెళ్తున్న మార్గం సరైంది కాదు. ఈ అలవాట్లు నిన్ను పూర్తిగా నాశనం చేస్తాయి. నీ కెరీర్‌ను ముగించేస్తాయి` అని షారుఖ్ ఖాన్ పలుమార్లు తనను హెచ్చరించినట్లు హనీ సింగ్ గుర్తు చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజాలు ఎంతో సరళంగా జీవిస్తారని.. కానీ తాను మాత్రం తప్పుడు వ్యసనాల వైపు అడుగులు వేశానని చెప్పారు.

చాలా మంది ప్రముఖులు తమ పతనానికి గ్లామర్ ప్రపంచాన్ని, చిత్ర పరిశ్రమలోని ఒత్తిడిని లేదా కీర్తిని కారణాలుగా చూపుతుంటారు. కానీ హనీ సింగ్ మాత్రం పతనానికి చిత్ర పరిశ్రమను గానీ, లభించిన కీర్తిని గానీ నిందించడానికి నిరాకరించారు. అంతా తన సొంత నిర్ణయాల వల్లే జరిగిందని స్పష్టం చేశారు. మనిషి అంతరంగంలోనే లోపం ..చీకటి ఉంటే ఏ రంగంలో ఉన్నా జీవితం నాశనమవుతుందని దానికి సంగీతాన్ని లేదా సినిమా రంగాన్ని తప్పుపట్టలేమని ఎంతో పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశారు హ‌నీసింగ్. తీవ్రమైన మత్తుకు బానిస కావడం, మానసిక అనారోగ్యం బారిన పడటంతో 2017 నాటికి హనీ సింగ్ కెరీర్ పూర్తిగా కుప్పకూలింది.

దాంతో హ‌నీసింగ్ సంగీత లోకానికి పూర్తిగా దూరమై చికిత్స కోసం ఢిల్లీకి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ కష్టకాలంలో తన చుట్టూ ఉన్న యాభై మందికి పైగా స్నేహితులు, ఆప్తులు ఒక్కొక్కరుగా విడిచిపెట్టారని, కేవలం ఒకే ఒక్క చిన్ననాటి స్నేహితుడు మాత్రమే తనకు తోడుగా నిలిచాడని భావోద్వేగానికి లోనయ్యారు. సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది మానసిక దృఢత్వంతో ఇటీవల ఆయన `కళాకార్` వంటి పాటలు , సరికొత్త ఆల్బమ్స్‌తో పునరాగమనం చేశారు. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఒంటరితనాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నానని హనీ సింగ్ వెల్లడించారు. జీవితంలోకి ఒంటరిగానే వచ్చాం. ఒంటరిగానే వెళ్తాం అనే సత్యాన్ని తాను పూర్తిగా గ్రహించానని, ఇప్పుడు ప్రపంచం మొత్తం తనను విడిచిపెట్టినా భరించే మానసిక స్థితికి చేరుకున్నానని అన్నారు. గత ఏడేళ్ల కాలం తనకు జీవితం గురించిన పెద్ద పాఠాన్ని నేర్పిందన్నారు. ప్రస్తుతం తాను మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నానని తెలిపారు.