ఎల్లమ్మలో దేవీ శ్రీ కూడా లేడా? మరెవరు?
అందులో భాగంగానే తనకు వచ్చిన ఆఫర్లను కాదనుకున్నారు. అయితే ఎల్లమ్మ సినిమాను తీయాలని ఎంత తొందరపడుతున్నా అది మాత్రం అనుకున్న కొద్దీ వెనక్కి వెళ్తూనే ఉంది.
By: Sravani Lakshmi Srungarapu | 2 Nov 2025 9:00 PM ISTకొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లకముందు నుంచే వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఎల్లమ్మ కూడా ఒకటి. టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి బలగం సినిమాతో డైరెక్టర్ గా మారి అందరికీ షాకిచ్చారు. డైరెక్టర్ గా మారడమే షాక్ అనుకుంటే ఆ సినిమాను మంచి ఎమోషన్స్ తో తెరకెక్కించి దాంతో సూపర్ హిట్ అందుకుని మరో షాక్ ఇచ్చారు.
ఆలస్యమవుతూనే వస్తున్న ఎల్లమ్మ
బలగం సూపర్ హిట్ అవడంతో వేణు కు ఊహించని ఫేమ్ తో పాటూ, మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ తాను మాత్రం ఎల్లమ్మ అనే స్క్రిప్ట్ ను రాసుకుని, రెండో సినిమాగా అదే కథను సినిమాగా తీయాలని పట్టుబట్టి కూర్చున్నారు. అందులో భాగంగానే తనకు వచ్చిన ఆఫర్లను కాదనుకున్నారు. అయితే ఎల్లమ్మ సినిమాను తీయాలని ఎంత తొందరపడుతున్నా అది మాత్రం అనుకున్న కొద్దీ వెనక్కి వెళ్తూనే ఉంది.
ఎల్లమ్మ మూవీని మంచి గుర్తింపు ఉన్న హీరోతోనే తీయాలనుకున్న వేణు, దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే నేచురల్ స్టార్ నాని పేరు వినిపించింది. తర్వాత నితిన్ తో ఎల్లమ్మ తీద్దామనుకున్నారు. అంతా ఓకే సినిమాను లాంచ్ చేయడమే ఆలస్యమనుకునే టైమ్ లో ఆ ప్రాజెక్టు నుంచి నితిన్ కూడా తప్పుకున్నారని వార్తలొచ్చాయి.
లీడ్ లో దేవీ శ్రీ ప్రసాద్ అని వార్తలు
నితిన్ తర్వాత ఎల్లమ్మలో లీడ్ రోల్ కోసం పలువురు హీరోల పేర్లు వినిపించాయి. అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఎల్లమ్మ ప్రాజెక్టు ఆఖరిగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ వద్దకు వెళ్లిందని, ఆయన లీడ్ రోల్ లో ఎల్లమ్మను తీయాలని వేణు భావిస్తున్నారని, ఈ సినిమాతోనే దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారని రీసెంట్ గా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా నటించడం లేదని, దేవీ ఎల్లమ్మ కథ వినింది కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమేనని తెలుస్తోంది. మరి దేవీ శ్రీ ప్రసాద్ ఎల్లమ్మలో నటించకపోతే లీడ్ రోల్ ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
