ధనుష్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
కోలీవుడ్‌లో మరో స్టార్ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. యాక్టర్, డైరెక్టర్ ధనుష్ తన పెద్ద కొడుకు యాత్ర ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
By: Sravani Lakshmi Srungarapu | 16 Jun 2026 12:01 PM ISTకోలీవుడ్‌లో మరో స్టార్ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. యాక్టర్, డైరెక్టర్ ధనుష్ తన పెద్ద కొడుకు యాత్ర ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాకి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఒక తండ్రిగా కొడుకును వెండితెరకు పరిచయం చేయడం ఎంత ప్రత్యేకమో, డైరెక్టర్ గా ఒక డెబ్యూ హీరో తొలి అడుగును తీర్చిదిద్దడం అంతకంటే పెద్ద బాధ్యతగా మారింది.
ఇప్పటికే ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ సినిమాకు యాత్ర వర్క్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు యాత్ర హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. యాత్ర తొలి సినిమాను మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాలనే ఆలోచనలో ధనుష్ ఉన్నట్లు తెలుస్తోంది. యూత్ తో పాటూ, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా కథ, పాత్రలను రూపొందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ధనుష్ కెరీర్‌ను పరిశీలిస్తే, నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన, డైరెక్టర్ గానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. విభిన్న కథలతో, ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధనుష్ ఇప్పుడు కొడుకు కెరీర్‌కు బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే యాత్ర తొలి సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వెల్‌రాజ్ కెమెరా బాధ్యతలు చేపట్టనున్నారని, జీవీ ప్రకాశ్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. టెక్నికల్ గా కూడా ఈ సినిమాను ఉన్నత స్థాయిలో రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో చెన్నైలో ప్రోమో షూట్‌తో పాటు గ్రాండ్ పూజా కార్యక్రమం నిర్వహించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ధనుష్ అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ అనే చెప్పుకోవాలి. ఒకవైపు స్టార్ హీరోగా తన సినిమాలతో అలరిస్తున్న ధనుష్, మరోవైపు తన కొడుకుని తెరపైకి తీసుకురావడం ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో యాత్ర ఎంట్రీపై డిస్కషన్స్ మొదలయ్యాయి. తండ్రి బాటలో కొడుకు ఎంత దూరం ప్రయాణిస్తాడనే అంశంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్‌కు కొత్త తరం స్టార్‌గా యాత్ర ఎదుగుతాడా? ధనుష్ వారసత్వాన్ని కొనసాగిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటాడా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. అయితే మొదటి సినిమాతోనే యాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.
