Begin typing your search above and press return to search.

ఒక్క రోజు తేడాతో... తగ్గాల్సింది ఎవరు?

కేజీఎఫ్‌ సినిమా తర్వాత యశ్‌ స్థాయి అమాంతం పెరింది. కేజీఎఫ్‌ 2 ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో యశ్‌ తదుపరి సినిమా అదే స్థాయిలో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

By:  Ramesh Palla   |   20 Aug 2025 11:00 PM IST
Yash’s Toxic Set for March 2026 Release, Faces Clash with Bhansali’s Love and War
X

కేజీఎఫ్‌ సినిమా తర్వాత యశ్‌ స్థాయి అమాంతం పెరింది. కేజీఎఫ్‌ 2 ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో యశ్‌ తదుపరి సినిమా అదే స్థాయిలో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే చాలా గ్యాప్‌ తీసుకుని యశ్‌ టాక్సిక్‌ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా మేకింగ్‌కు చాలా ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగానే యశ్‌ సినిమాలు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు అంటారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా యశ్‌ టాక్సిక్‌ సినిమాకి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదట 2025లో సినిమా విడుదల చేయాలని మేకర్స్‌ బలంగా భావించారు. కానీ సినిమా మేకింగ్‌ ముందుగా అనుకున్నట్లుగా కాకుండా చాలా ఎక్కువ రోజులు తీసుకుంటుంది. అందుకే సినిమాను 2026 కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.

యశ్‌ టాక్సిక్‌ రిలీజ్‌ డేట్‌

కన్నడ సినిమా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం టాక్సిక్ సినిమాను ఖచ్చితంగా 2026 మార్చి 19న విడుదల చేయబోతున్నారు. ఆ తేదీని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా షూటింగ్‌ మరో నెల రోజుల్లో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆలస్యం అయితే మహా అయితే అక్టోబర్‌ వరకు పడుతుంది. ఆ తర్వాత వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌, ఇతర వర్క్‌ అంతా పూర్తి చేసి 2026 జనవరి చివరి వరకు ఫస్ట్‌ కాపీ రెడీ చేస్తారు. కనుక మార్చి లో సినిమాను విడుదల చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ మధ్య కాలంలో టాక్సిక్‌ సినిమాకు సంబంధించి అంచనాలు పెరిగే విధంగా చిత్ర యూనిట్‌ సభ్యులు లీక్‌లు ఇస్తున్నారు. దాంతో పాన్‌ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగాయి.

బాలీవుడ్‌ మూవీకి పోటీగా

ఒక వైపు కేజీఎఫ్‌ తో వచ్చిన స్టార్‌డంతో టాక్సిక్‌ సినిమాను ఓ రేంజ్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్న యశ్‌ కి పోటీగా బాలీవుడ్‌ మూవీ 'లవ్‌ అండ్‌ వార్‌' పోటీగా దిగే అవకాశాలు ఉన్నాయి. సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత ఆయన నుంచి రాబోతున్న సినిమా ఇది. సాధారణంగానే బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ సంజయ్ లీలా భన్సాలీ సినిమా వస్తుంది అంటే ఒకరకమైన ఆసక్తి, అంచనాలు ఉంటాయి. అలాగే ఈ సినిమా విషయంలోనూ అదే స్థాయిలో ఆసక్తి ఉంది. ఇప్పుడు లవ్‌ అండ్‌ వార్‌ సినిమా విషయంలోనూ హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా సంజయ్‌ లీలా భన్సాలీ చాలా కాలం తర్వాత అత్యధికంగా ఈ సినిమాను విదేశాల్లో చిత్రీకరించడం, లవ్‌ అండ్‌ వార్‌ అంటూ విభిన్నమైన టైటిల్‌ ఉండటంతో అంచనాలు పెరిగి పోయాయి.

సంజయ్ లీలా భన్సాలీ లవ్‌ అండ్‌ వార్‌

లవ్‌ అండ్‌ వార్‌ సినిమాలో రణబీర్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌ లు నటించారు. ఇద్దరు హీరోలు నటించిన సినిమా కావడంతో ఆసక్తి మరింతగా పెరిగింది. ముగ్గురి మధ్య ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతున్నట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేశారని తెలుస్తోంది. మొత్తానికి ఈ బిగ్ మల్టీస్టారర్‌ మూవీ పై బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. రెండు సినిమాలు కూడా హోరా హోరీగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండు పెద్ద సినిమాలు ఒకే సారి విడుదల అయితే ఏం జరుగుతుంది అనేది కూలీ - వార్‌ 2 విషయంలో వెళ్లడి అయింది. కనుక చివరి నిమిషంలో ఎవరో ఒకరు తగ్గితే బాగుంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.