బెంగళూరు కిక్కిరిసిపోయేలా లక్ష మంది రాకింగ్ ఫ్యాన్స్ రచ్చ!
ఈ వేడుక కోసం సుమారు లక్ష మందికి పైగా అభిమానులు నగరానికి తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆ రోజు బెంగళూరు మొత్తం `బ్లాకింగ్` అవ్వడం ఖాయమని కథనాలొస్తున్నాయి.
By: Sivaji Kontham | 2 March 2026 4:00 AM ISTకన్నడ నాట మాత్రమే కాకుండా యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ `టాక్సిక్`. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు బెంగళూరు నగరాన్ని ఊపేయడానికి సిద్ధమైంది. మార్చి 8న బెంగళూరులో భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్, ఆడియో వేడుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ వేడుక కోసం సుమారు లక్ష మందికి పైగా అభిమానులు నగరానికి తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆ రోజు బెంగళూరు మొత్తం `బ్లాకింగ్` అవ్వడం ఖాయమని కథనాలొస్తున్నాయి.
ఈ వేడుకను కేవలం సినిమా ప్రమోషన్ లాగా కాకుండా, ఒక భారీ ఉత్సవంలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాకింగ్ స్టార్ యశ్ క్రేజ్ దృష్టిలో ఉంచుకుని, బెంగళూరులోని ఒక విశాలమైన మైదానంలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో స్టేజ్ డిజైన్ చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్ నుండి వస్తున్న సినిమా కావడంతో.. అభిమానుల రచ్చ రంబోలా రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. మార్చి 8న భారీగా తరలివచ్చే ఫ్యాన్స్ సమక్షంలో `టాక్సిక్` గ్రాండ్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.
మరో విశేషమేమిటంటే.. ఈ ఈవెంట్ `అంతర్జాతీయ మహిళా దినోత్సవం` రోజున జరుగుతుండటంతో, మహిళలను గౌరవించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినది ఒక మహిళా దర్శకురాలు (గీతూ మోహన్ దాస్) కావడం, అలాగే సినిమాలో కీలక పాత్రల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వాణీ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటంతో.. వేదికపై మహిళా శక్తిని చాటిచెప్పేలా ఈ ఈవెంట్ ఉండబోతోంది.
టాక్సిక్ ఈవెంట్‌లో నయనతార, కియారా అద్వాణీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరిద్దరూ ఈ భారీ వేడుకలో పాల్గొని చిత్ర విశేషాలను పంచుకోనున్నారు. ఒకే వేదికపై యశ్, నయనతార, కియారాను చూడటం అభిమానులకు కన్నుల పండుగగా మారనుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న హుమా ఖురేషి వంటి మరికొందరు ప్రముఖ నటీమణులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ భారీ ఈవెంట్ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. లక్ష మందికి పైగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. అభిమానుల తాకిడికి బెంగళూరు వీధులు కిక్కిరిసిపోతాయని, ముఖ్యంగా ఈవెంట్ జరిగే పరిసర ప్రాంతాలు పూర్తిగా రాకింగ్ స్టార్ ఫ్యాన్స్ ఆధీనంలోకి వెళ్తాయని అంచనా వేస్తున్నారు. కర్ణాటక మూలమూలల నుండి అభిమానులు తరలిరావడానికి ఇప్పటికే వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారని గుసగుస వినిపిస్తోంది.
మొత్తానికి మార్చి 8న బెంగళూరులో జరగనున్న `టాక్సిక్` ఈవెంట్ భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. యశ్ తన స్వాగ్‌తో స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ సినిమాపై ఉన్న అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తుందని, పాన్ ఇండియా స్థాయిలో `టాక్సిక్` ప్రకంపనలు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. టాక్సిక్ టీజర్ కి వచ్చిన బజ్ దృష్ట్యా ఇప్పుడు ట్రైలర్ పై భారీ అంచనాలున్నాయి. టాక్సిక్ ట్రైలర్‌లో యశ్ మాస్ స్వాగ్ తో ప్రభంజనం సృష్టిస్తాడని అంచనా వేస్తున్నారు.
టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ చిత్రానికి గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించగా కెవిఎన్ ప్రొడక్షన్స్ - మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించాయి. ఈ ప్రాజెక్ట్ ద్విభాషా చిత్రం. కన్నడ, ఇంగ్లీష్ భాషలలో ఒకేసారి చిత్రీకరించారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలో డబ్ చేసిన వెర్షన్‌లను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.
