తండ్రి కొడుకులుగా యష్ డబుల్ ధమాకా ట్రీట్
కెజిఎఫ్ చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలోనే కాక అంతర్జాతీయంగా క్రేజ్ సంపాదించుకున్న రాకింగ్ స్టార్ యష్, తన తదుపరి చిత్రం `టాక్సిక్`తో థియేటర్లలో సరికొత్త సునామీ సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.
By: Sivaji Kontham | 8 Aug 2026 11:37 PM ISTకెజిఎఫ్ చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలోనే కాక అంతర్జాతీయంగా క్రేజ్ సంపాదించుకున్న రాకింగ్ స్టార్ యష్, తన తదుపరి చిత్రం `టాక్సిక్`తో థియేటర్లలో సరికొత్త సునామీ సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ద్వారా ప్రచారంలో ఉన్న రూమర్లకు తెరపడింది. ఇందులో యష్ త్రిపాత్రాభినయం చేయడం లేదని.. తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయంలో మాత్రమే అలరించబోతున్నారని స్పష్టమైంది. రయా - రూమి (టికెట్-రయా) అనే రెండు వైవిధ్యమైన పాత్రల్లో డార్క్, వింటేజ్ అండర్‌వరల్డ్ నేపథ్యంతో యష్ అందించబోతున్న ఈ `డబుల్ ధమాకా` అభిమానులకు నిస్సందేహంగా ఐ-ఫీస్ట్ కానుంది.
ట్రైలర్‌లో ప్రధానంగా ఆకట్టుకున్న అంశం `డాడీ` అనే పిలుపు వెనుక ఉన్న ఉత్కంఠ. యష్ ఈ రెండు పాత్రల్లోనూ చూపించిన వేరియేషన్ ప్రేక్షకుల మతులు పోగొడుతోంది. ఒకవైపు కొడుకు పాత్రలో ఆర్మీ గెటప్‌తో రఫ్‌గా.. పవర్‌ఫుల్ యాక్షన్ మోడ్‌లో అదరగొడుతుంటే.. మరొకవైపు గిరజాల జుట్టు, రొమాన్స్ - విధ్వంసకర యాక్షన్‌తో కనిపిస్తున్న `డాడీ` పాత్ర నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తండ్రీ కొడుకుల మధ్య ఏ సీన్ వచ్చినా స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయమని, ముఖ్యంగా వారిద్దరి లుక్స్ - క్యారెక్టరైజేషన్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అర్థమవుతోంది.
కథాపరంగా చూస్తే.. ఈ తండ్రీ కొడుకుల మధ్య జరిగే పోరాటం దేనికోసం అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉన్నా.. ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యంలో అధికారం, కోట్లాది రూపాయల డబ్బే లక్ష్యంగా ఈ కొట్లాట సాగుతుందని స్పష్టమవుతోంది. అయితే కథ కంటే కూడా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ షాట్ మేకింగ్ - విజువల్ విజన్ పైనే సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు భారతీయ సినిమాలో ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన `మ్యాడ్‌నెస్` ని తెరపై చూపించబోతున్నారని ట్రైలర్ శాంపిల్ ఇచ్చేసింది. దీనికి తోడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ పాశ్చాత్య ధోరణి కలిగిన విచిత్రమైన పాత్రలో కనిపించి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఇటీవలి కాలంలో టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా తండ్రీ కొడుకుల ద్విపాత్రాభినయంతో వచ్చిన కొన్ని సినిమాలు అద్భుత ఫలితాలను అందుకున్నాయి. `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)`, `దేవర` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను రాబట్టాయి. ఇప్పుడు అదే బాటలో ద్విపాత్రలతో వైవిధ్యమైన కథాంశంతో టేకింగ్ తో వస్తున్న`టాక్సిక్`చిత్రానికి యష్ ద్విపాత్రాభినయం అతిపెద్ద అసెట్‌గా మారబోతోంది. యష్‌లోని నటుడిని, ఆయనకున్న మాస్ ఇమేజ్‌ను దర్శకురాలు గీతూ రెండు పాత్రల్లోనూ సమర్థవంతంగా వాడుకున్నట్లు కనిపిస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే హై-వోల్టేజ్ డ్రామా.. ఫైట్స్ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయం.
అన్ని రకాల హంగులతో సరికొత్త కాన్సెప్ట్‌తో విజువల్ ఫీస్ట్‌గా రూపుదిద్దుకున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైలర్‌తోనే యూట్యూబ్‌లో వ్యూస్, లైక్స్ పరంగా రికార్డుల వేట మొదలుపెట్టిన యష్.. థియేటర్లలో ఏ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తాడో చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని ఆంగ్ల డైలాగులు, రీరికార్డింగ్ లో లౌడ్ నెస్ కొంత కన్ఫ్యూజన్ కి గురి చేసినా కానీ ఓవరాల్ గా టాక్సిక్ ట్రైలర్ అభిమానులకు ఒక కొత్త తరహా ట్రీట్ ని ఇచ్చింది. థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకోబోతోందో చూడాలనే ఉత్కంఠ పెరిగింది.
