యష్ 'టాక్సిక్'.. తెలుగు టార్గెట్ రీచ్ అవుతుందా?
దీంతో యష్ కెరీర్ లోనే కాకుండా తెలుగులో కన్నడ హీరోలకు సంబంధించిన సినిమాల్లో టాక్సిక్ టాప్ డీల్ అని తెలుస్తోంది.
By: M Prashanth | 6 Feb 2026 1:19 AM ISTస్టార్ హీరో యష్.. ఇప్పుడు టాక్సిక్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఆ చిత్రానికి గీతూ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ కానుకగా మార్చి 19వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు మేకర్స్. వరుస ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. వాటిని మరింత పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే పాన్ ఇండియా వైడ్ గా సినిమా రిలీజ్ కానుండగా.. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన థియేట్రికల్ హక్కులను పీవీఆర్- ఐనాక్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఆ విషయాన్ని అనౌన్స్ చేసింది. అయితే సుమారు రూ.40 కోట్ల అడ్వాన్స్ కు తెలుగు స్టేట్స్ రైట్స్ ను పీవీఆర్- ఐనాక్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో యష్ కెరీర్ లోనే కాకుండా తెలుగులో కన్నడ హీరోలకు సంబంధించిన సినిమాల్లో టాక్సిక్ టాప్ డీల్ అని తెలుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల విజయాల తర్వాత యష్ మార్కెట్ రేంజ్ పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి నిర్మాతలకు లాభాల వర్షం కురిపించింది. రూ.79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఆ మూవీ.. కంప్లీట్ రన్ లో రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
ఇప్పుడు అదే నమ్మకంతోనే టాక్సిక్ పై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు అర్థమవుతుంది. అయితే దానికి తగ్గట్లే సినిమా వసూళ్లు సాధించాలి. టాక్సిక్ బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఫైనల్ కలెక్షన్లలో సగం వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసినట్లు తెలుస్తోంది. అంటే రూ.70 కోట్లకుపైగా వసూలు చేయాలన్నమాట. అదే జరగాలి అంటే.. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావాలి.. కంటెంట్ అదిరిపోయేలా ఉండాలి. అప్పుడు ఆ నెంబర్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
అదే సమయంలో బడా సినిమాల థియేట్రికల్ హక్కులను కార్పొరేట్ సంస్థలు సొంతం చేసుకోవడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ గా మారింది. అలా టాక్సిక్ మూవీని పీవీఆర్- ఐనాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల రిలీజ్ మరింత గ్రాండ్ గా ఉండేలా కనిపిస్తుంది. స్క్రీన్ కౌంట్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పుడు టాక్సిక్ మూవీ.. తెలుగులో ఎలాంటి హిట్ అవుతుందో.. ఎంతటి వసూళ్లు సాధిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక సినిమా విషయానికొస్తే.. భారీ బడ్జెట్ తో స్టైలిష్ యాక్షన్ డ్రామాగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మూవీలో యష్‌తో పాటు అందాల భామలు కియారా అద్వానీ, హుమా ఖురేషీ, నయనతార, తారా నుతారియా, రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
