రాకింగ్‌స్టార్ యష్ ఫాలోయింగ్ కన్నడను మించి తెలుగులో?
సినిమా పరిశ్రమలో ఇటీవలి కాలంలో పరిస్థితులు అసాధారణంగా మారుతున్నాయి. భాష పరంగా సరిహద్దులు చెరిగిపోయాక కొందరు హీరోలు ఇతర భాషల్లో అసాధారణమైన ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నారు.
By: Sivaji Kontham | 11 Aug 2026 3:03 PM ISTకథానాయకులకు సొంత రాష్ట్రంలో ఆదరణ ఉండటం సాధారణ విషయమే కానీ.. పొరుగు భాషా రాష్ట్రాల్లో సైతం బ్రహ్మరథం పట్టడం అరుదుగా జరుగుతుంది. కన్నడ సూపర్‌స్టార్ యష్ విషయంలో సరిగ్గా ఇదే నిజమవుతోంది. `కేజీఎఫ్` ఫ్రాంచైజీతో పాన్-ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న యష్‌కు తన సొంత భాష కన్నడం కంటే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే అపారమైన అభిమాన గణం ఏర్పడింది. అతడు తన కొత్త సినిమా `టాక్సిక్` బిజినెస్..అడ్వాన్స్ బుకింగ్‌లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
సినిమా పరిశ్రమలో ఇటీవలి కాలంలో పరిస్థితులు అసాధారణంగా మారుతున్నాయి. భాష పరంగా సరిహద్దులు చెరిగిపోయాక కొందరు హీరోలు ఇతర భాషల్లో అసాధారణమైన ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నారు. ఉదాహరణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మలయాళంలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అక్కడ ఆయన సినిమాలకు స్వదేశీ స్టార్ల తరహాలోనే భారీ ఓపెనింగ్స్ కొల్లగొడుతున్నారు. అలాగే రెబెల్ స్టార్ ప్రభాస్‌కు కేవలం తెలుగులోనే కాకుండా హిందీ బెల్ట్‌తో పాటు జపాన్ దేశంలో కూడా ఊహించని రేంజ్ అభిమానులు ఉన్నారు. ప్రభాస్, బన్నీల బాటలోనే నేటితరం పాన్-ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో భారీ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు.
ప్రస్తుతం ఇదే తరహా ట్రెండ్‌ను యష్ కూడా కొనసాగిస్తున్నారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `టాక్సిక్` ద్వారా యష్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్, యుఎస్ మార్కెట్‌లో ప్రీమియర్ల కోసం ఓపెన్ చేసిన బుకింగ్స్ డేటాను పరిశీలిస్తే అంతా ఆశ్చర్యపోయేలా తెలుగు వెర్షన్‌దే పూర్తి డామినేషన్ కనిపిస్తోంది.
`టాక్సిక్` చిత్రానికి సంబంధించి కన్నడ, తెలుగు రెండు భాషల్లోనూ ఒకేసారి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనా కన్నడం కంటే తెలుగు వెర్షన్‌కే బుకింగ్స్‌లో భారీ లీడ్ కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలోని పాపులర్ ప్రైమ్ ఏరియా థియేటర్లలో తెలుగు భాషా షోల టికెట్లు శరవేగంగా అమ్ముడుపోతుండగా.. కన్నడ వెర్షన్ కంటే తెలుగు బుకింగ్స్ చాలా ముందంజలో ఉన్నాయి. దీన్ని బట్టి యష్ క్రేజ్ సొంత భాషను మించి తెలుగు వారిలోనే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యుఎస్ మార్కెట్‌లో కనిపిస్తున్న ఈ ట్రెండ్ ఆధారంగా `టాక్సిక్` చిత్రం విడుదల రోజున తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మక ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సొంత గడ్డపై కంటే పొరుగు రాష్ట్రంలో ఒక నటుడికి ఈ స్థాయి ఆధిక్యం, ఆదరణ దక్కడం చాలా అరుదైన విషయమని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా యష్ క్రేజ్ తెలుగు నాట మరోసారి రుజువు కావడంతో `టాక్సిక్` మూవీ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. అలాగే ప్రభాస్ - ఎన్టీఆర్- చరణ్ లాంటి స్టార్లు దూసుకెళ్లిన జపాన్ మార్కెట్లోను యష్ తన హవాను సాగిస్తాడా? అన్నది కూడా వేచి చూడాలి.
