యష్ 'టాక్సిక్' కు గోల్డెన్ ఛాన్స్ లభించిందా?
మార్చి 19.. ఇప్పుడు ఈ డేట్ అందరి దృష్టిని ఆకర్షించి తీవ్ర చర్చకు తెరలేపింది. ఈ డేట్‌న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
By: Ravindar Gorantla | 19 Feb 2026 3:24 PM ISTమార్చి 19.. ఇప్పుడు ఈ డేట్ అందరి దృష్టిని ఆకర్షించి తీవ్ర చర్చకు తెరలేపింది. ఈ డేట్‌న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవే రణ్‌వీర్ సింగ్ - ఆదిత్యధర్‌ల 'ధురంధర్ 2 :ది రివేంజ్', రాకింగ్ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్'. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన `ధురంధర్` ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వాస్తవంగా జరిగిన సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఇండియాపై పాక్ పన్నుతున్న కుట్రలని అంతే రాగా చూపించిన తీరు 'ధురంధర్' మూవీని ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యేలా చేసింది.
దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా రానున్న 'ధురంధర్ 2: ది రివేంజ్'పై సర్వత్రా ఆసక్తి నెలకొనడమే కాకుండా అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు, విమర్శకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ మూవీని మార్చి 19న భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించింది. పార్ట్ 1 హిందీలో తప్ప మిగతా భాషల్లో రిలీజ్ కాకపోవడం, పార్ట్ 2 హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుండటంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.
దీంతో 'టాక్సిక్' టీమ్ తీవ్ర అసంతృప్తికి గురైంది. ఇదే డేట్‌కు రాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్ ఇండియా మూవీ `టాక్సిక్`ని రిలీజ్ చేయాలని 'ధురంధర్ 2' టీమ్ రిలీజ్ డేట్ ప్రకటించడానికి ముందే ప్లాన్ చేశారు. డేట్ ప్రకటించారు. అయినా కూడా `ధురంధర్ 2` టీమ్ మార్చి 19నే వస్తున్నామని ప్రకటించడంతో 'టాక్సిక్'టీమ్ తీవ్ర అసహనానికి గురైంది. ఒకేసారి రెండు క్రేజీ సినిమాలు పోటీపడటం బాక్సాఫీస్ వద్ద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని కంగారు పడుతున్నారు. అయితే తాజా పరిణామాలు 'టాక్సిక్' టీమ్‌కు అనుకూలంగా మారినట్టుగా తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా 'ధురంధర్ 2' షూటింగ్ బృహన్ముంబయ్‌లోని ప్రతిష్టాత్మక ఫోర్ట్‌లలో జరుగుతోంది. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చిత్ర బృందం షూటింగ్ చేస్తోందని, ఇది చాలా సెన్సిటీవ్ ఏరియా అని, ఇక్కడ ఎలాంటా పర్మీషన్స్ లేకుండా డ్రోన్‌లని ఉపయోగించి చిత్రీకరణ చేస్తున్నారని బృహన్మంబై మున్సిపల్ కార్పొరేషన్ టీమ్‌కు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా నిర్మాణ సంస్థని బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తామంటూ ఫైర్ అయింది. ఇక టీమ్ మేనేజర్‌పై కేసు కూడా ఫైల్ చేయడంతో ఈ మూవీ షూటింగ్ రెండు వారాలుగా నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో 'ధురంధర్ 2' ముందుగా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. దీంతో యష్ 'టాక్సిక్'కు సోలో రిలీజ్ కు గోల్డెన్ ఛాన్స్ లభించిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే 'టాక్సిక్'కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని రీషూట్ చేయాల్సి వచ్చిందని, ఇందు కోసం టీమ్ ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు చేసిందని ఇన్ సైడ్ టాక్. ఈ మూవీకి కెవీఎన్ ప్రొడక్షన్స్ వెంకట్ కె. నారాయణతో పాటు యష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఈ ఖర్చు వీరికి పెద్ద బర్డెన్ అనిపించే అవకాశం లేదు.
