Begin typing your search above and press return to search.

యష్ తగ్గేదేలే.. ఆ విషయంలో నో ఛేంజ్!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదల తేదీలపై ఫుల్ డిస్కషన్ నడుస్తోంది. పెద్ద సినిమాలన్నీ తమ షెడ్యూల్‌ లను మారుస్తూ, క్లాష్‌ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాయి

By:  M Prashanth   |   29 Jan 2026 3:22 PM IST
యష్ తగ్గేదేలే.. ఆ విషయంలో నో ఛేంజ్!
X

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదల తేదీలపై ఫుల్ డిస్కషన్ నడుస్తోంది. పెద్ద సినిమాలన్నీ తమ షెడ్యూల్‌ లను మారుస్తూ, క్లాష్‌ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ ఆ ట్రెండ్‌ కు భిన్నంగా స్టార్ హీరో యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ మేకర్స్ మాత్రం తమ నిర్ణయంపై గట్టిగా నిలబడ్డారు. తమ మూవీ రిలీజ్ డేట్ మార్చి 19 అని చెబుతూనే ఉన్నారు.

కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్‌ గా ఎదిగిన యష్, మరోసారి బాక్సాఫీస్‌ పై కన్నేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర హీరోలు, నిర్మాతలు పోటీ భయంతో విడుదల తేదీలు మార్చుకుంటున్నా, యష్ మాత్రం ఎలాంటి వెనకడుగు వేయడం లేదని అభిమానులు సంబరపడుతున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ ఎవరినీ భయపడరంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

అయితే యష్ మార్చి నెలను ఎంచుకోవడం వెనుక స్ట్రాంగ్ లాజిక్ ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మార్చి అంటే సమ్మర్ సీజన్‌ కు ఆరంభం అన్న విషయం తెలిసిందే. అది స్కూల్, కాలేజ్ హాలిడేలు మొదలయ్యే సమయం కూడా.. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే టైమ్ అది.. అదే సమయంలో పాన్ ఇండియా సినిమాలకు అనుకూలమైన మార్కెట్ మార్చి అనే చెప్పాలి.

అందుకే ఆ డేట్‌ ను వదులుకోకుండా మేకర్స్ ముందుకెళ్తున్నారని సమాచారం. ముఖ్యంగా నార్త్ టు సౌత్.. యష్‌ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ ను దృష్టిలో పెట్టుకుని, సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందనే నమ్మకంతోనే నిర్ణయం తీసుకున్నారట. అయితే ఇదంతా ఒక వైపు అయితే, మరోవైపు క్లాష్ భయం కూడా లేకపోలేదు. అదే సమయంలో ఇతర భారీ సినిమాలు విడుదలవుతున్నాయి.

ముఖ్యంగా మార్చి 19వ తేదీన ధురంధర్ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ హిట్ గా ఫస్ట్ పార్ట్ నిలవగా.. ఇప్పుడు సీక్వెల్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత వీక్ లో పెద్ది, ప్యారడైజ్ లేదా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రానుంది. దీంతో కలెక్షన్లు డివైడ్ అయ్యే అవకాశం ఉంది. కానీ కంటెంట్ పై నమ్మకంతో టాక్సిక్ మేకర్స్ ఉన్నారట. అందుకే డేట్ మార్చడం లేదని తెలుస్తోంది.

ఇక టాక్సిక్ విషయానికొస్తే.. యష్ కెరీర్‌ లో చాలా కీలకమైన సినిమా. కేజీఎఫ్ ఇమేజ్‌ ను మించి, కొత్త తరహా కథ, కొత్త స్టైల్‌ లో ఆయన కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, లుక్‌ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూవీ సూపర్ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే.. యష్ మార్కెట్ మరింత పెరగడం ఖాయం. మరి చూడాలి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో..