Begin typing your search above and press return to search.

యష్ టాక్సిక్.. అసలు క్లారిటీ వచ్చేసింది

కేజీఎఫ్ సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ యష్, ప్రస్తుతం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ పనుల్లో బిజీగా ఉన్నారు.

By:  M Prashanth   |   13 April 2026 6:50 PM IST
యష్ టాక్సిక్.. అసలు క్లారిటీ వచ్చేసింది
X

కేజీఎఫ్ సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ యష్, ప్రస్తుతం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ పనుల్లో బిజీగా ఉన్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా టీజర్ లో యష్ కనిపించిన తీరు ఆయన ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కించేలా ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సినిమా అనుకున్న సమయానికి రావడం లేదని, మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు చిత్ర వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ తేదీన సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ స్పష్టం చేశారు. వాయిదా వార్తల్లో ఎలాంటి నిజం లేదని, షెడ్యూల్ ప్రకారమే పనులు సాగుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో యష్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ‘టాక్సిక్’ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి యష్ ఒక భారీ స్కెచ్ వేశారు. త్వరలో జరగబోయే ‘సినిమా కాన్’ ఈవెంట్‌లో యష్ పాల్గొనబోతున్నారు. అక్కడ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’తో పాటు ‘టాక్సిక్’ గురించి కూడా ఆయన మాట్లాడనున్నారు.

ఒక భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా విదేశాల్లో కూడా భారీ ఈవెంట్లు నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాలో భారీ తారాగణం ఉండటం మరో విశేషం. గంగ పాత్రలో నయనతార, అలాగే మరో పవర్ఫుల్ పాత్రలో కియారా అద్వానీ నటిస్తున్నారు.

వీరితో పాటు హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సాంకేతికంగా కూడా ‘టాక్సిక్’ ఉన్నత ప్రమాణాలతో రూపొందుతోంది. కన్నడ ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమా, విజువల్స్ పరంగా హాలీవుడ్ తరహాలో ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. డార్క్ ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో యష్ మేకోవర్ పూర్తిగా కొత్తగా ఉంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి.

ప్రొడక్షన్ డిజైన్ నుంచి గ్రాఫిక్స్ వరకు ప్రతిదీ వరల్డ్ క్లాస్ లెవల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 4 డెడ్ లైన్ ను అందుకోవడానికి చిత్ర యూనిట్ పక్కా ప్లాన్ తోనే పనులు పూర్తి చేస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ లో కేజీఎఫ్ తర్వాత యష్ రేంజ్ ఏంటో ఈ సినిమాతో మరోసారి నిరూపిస్తాడా లేదా అని అందరూ ఎదురుచూస్తున్నారు. వాయిదా పుకార్లకు జెట్ స్పీడ్ లో మేకర్స్ ఇచ్చిన క్లారిటీతో ప్రమోషన్ల జోరు మరింత పెరగనుంది. జూన్ మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద ‘టాక్సిక్’ వేట ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.