Begin typing your search above and press return to search.

ఇండియన్ సినిమా గ్లోబల్ మ్యాప్‌లో ఉండాలి: హైదరాబాద్ ఈవెంట్‌లో యష్

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన‌ ప్రతిష్టాత్మక చిత్రం `టాక్సిక్` ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్‌లో కన్నులపండువగా జరిగింది.

By:  Sivaji Kontham   |   23 Aug 2026 12:09 AM IST
ఇండియన్ సినిమా గ్లోబల్ మ్యాప్‌లో ఉండాలి: హైదరాబాద్ ఈవెంట్‌లో యష్
X

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన‌ ప్రతిష్టాత్మక చిత్రం `టాక్సిక్` ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్‌లో కన్నులపండువగా జరిగింది. ఈ సభలో యష్ ప్రసంగిస్తూ తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కేజీఎఫ్ తర్వాత తెలుగు వారు అందించిన ఆదరణ మరచిపోలేనిదని... ఏ ప్రాంతీయ లేదా భాషా సరిహద్దులు లేకుండా నిజాయితీగా కష్టపడే ప్రతీ నటుడిని ప్రోత్సహించే గొప్ప గుణం తెలుగు ప్రేక్షకుల సొంతమని ఆయన కొనియాడారు. కర్ణాటకలో కూడా తెలుగు సినిమాలకు అంతే ప్రేమ ఉందంటూ.. మనమందరం కలిసి భారతీయ సినిమా స్థాయిని త్వరలోనే అంతర్జాతీయ (గ్లోబల్) వేదికపై అగ్రస్థానంలో నిలబెడతామని నమ్మకంగా చెప్పారు.

సభకు హాజరైన వేలాది మంది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన యష్..వారికి ఒక ఆసక్తికరమైన కథ ద్వారా ప్రేరణనిచ్చారు. తొలిసారి స్టీమ్ బోట్ ఇంజిన్ కనిపెట్టినప్పుడు ప్రపంచం దాన్ని ఎలా సందేహించిందో వివరిస్తూ.. సమాజం ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటుందని.. కానీ ఎవరి మాటలు పట్టించుకోకుండా లక్ష్యం వైపు ముందుకు సాగితే విజయం క‌చ్చితంగా వెంటే వస్తుందని పిలుపునిచ్చారు. జీవితంలో ఏదైనా సాధించడంలో విఫలమైతే వేరొకరిని లేదా పరిస్థితులను నిందించకూడదని.. మన విజయాలకైనా ఓటములకైనా మనమే బాధ్యులమని గ్రహించి శ్రమించాలని యువతకు హితవు చెప్పారు.

సినిమా ఎంపిక గురించి మాట్లాడుతూ, `కేజీఎఫ్` వంటి భారీ విజయం తర్వాత తానేదో రొటీన్ కమర్షియల్ ఫార్ములా వైపు వెళ్తానని అందరూ భావించారని.. కానీ కథలోని బలాన్ని, దర్శకురాలు గీతు మోహన్‌దాస్ విజన్‌ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించానని స్పష్టం చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని.. వారి ఆలోచనలను .. విజన్‌ను ఈ సినిమాలో చాలా శక్తివంతంగా చూపించారని తెలిపారు. ప్రతి మహిళా సమాజంలో తన గొంతును వినిపించి విజయం సాధించగలదని నిరూపించేలా గీతు మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసించారు.

ఇక చిత్రనిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేతను ప్రశంసిస్తూ.. ఆయన కేవలం డబ్బు సంపాదించడానికి కాకుండా సినిమాపై ఉన్న ప్యాషన్‌తో చిత్రసీమలోకి వచ్చారని యష్ అన్నారు. ప్రతిభ ఉన్న ప్రతీ చిన్న, పెద్ద నటుడికి అవకాశాలు ఇస్తూ బిగ్ డ్రీమ్స్‌ను ప్రోత్సహించే గొప్ప బ్యానర్ అని కేవీఎన్‌ను ఆకాశానికెత్తేశారు. అలాగే ప్రఖ్యాత‌ నిర్మాత దిల్ రాజును ఇన్‌స్పిరేష‌న‌ల్ పర్సన్‌గా అభివర్ణిస్తూ.. ఈ చిత్రంలో నటించిన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ ప్ర‌శంసిస్తూ .. సంగీత దర్శకులు విశాల్ మిశ్రా, రవి బస్రూర్ అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.

తనకు తెలుగు సినిమాలంటే ఎంతో ఇష్టమని గుర్తుచేస్తూ మగధీర, పోకిరి, గబ్బర్ సింగ్, బాహుబలి, పుష్ప వంటి చిత్రాలను తాను ఎంతగానో ఆస్వాధించానని యష్ వెల్లడించారు. ముగింపుగా `టాక్సిక్` సినిమా గురించి చెప్తూ.. టాక్సిక్ అత్యంత బోల్డ్, ఒరిజినల్, ఆంబిషియస్ అండ్ పాత్ బ్రేకింగ్ మూవీ.. ఇది ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఎగ్జైట్ చేయడమే కాకుండా పల్స్ రేట్‌ను క‌చ్చితంగా మారుస్తుంది! అని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త సినీ అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.