Begin typing your search above and press return to search.

రాకింగ్‌ స్టార్ య‌ష్‌ 'టాక్సిక్' టెస్ట్ పాస‌య్యేదెలా?

సినిమా ప్రపంచంలో `ఫీమేల్ గేజ్` అంటే ఒక కథను లేదా సన్నివేశాన్ని మహిళల దృష్టికోణం నుండి ఆవిష్కరించడం.

By:  Sivaji Kontham   |   26 April 2026 11:12 AM IST
రాకింగ్‌ స్టార్ య‌ష్‌ టాక్సిక్ టెస్ట్ పాస‌య్యేదెలా?
X

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో కన్నడ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన యశ్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక సామాన్య నటుడి నుండి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన తర్వాత.. తన తదుపరి చిత్రం `టాక్సిక్`పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో సినిమా విడుదల తేదీ అంతకంతకూ వాయిదా పడటం అభిమానుల్లో కొంత ఆందోళనను కలిగిస్తోంది. రాకింగ్ స్టార్ తనపై ఉన్న ఈ భారీ అంచనాల భారాన్ని ఎలా అధిగమిస్తారో అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

ప్రారంభంలో విడుదలైన `టాక్సిక్` మొదటి టీజర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో అప్రమత్తమైన చిత్ర బృందం.. ఎంతో తెలివిగా భావోద్వేగాలను స్పృశించేలా రెండో టీజర్‌ను సిద్ధం చేసి వదిలింది. ఈ కొత్త టీజర్ సోషల్ మీడియాలో సునామీ వేవ్స్‌ని సృష్టించి.. సినిమాపై మళ్ళీ హైప్‌ను తీసుకొచ్చింది. అయితే కేవలం టీజర్లు లేదా ట్రైలర్లు చూసి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే రోజులు కావని.. కంటెంట్‌లో దమ్ముంటేనే సినిమాను ఆదరిస్తారని ట్రేడ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ - యశ్ కలయికలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక అగ్నిపరీక్ష లాంటిదని చెప్పవచ్చు. టీజర్‌లో కనిపించిన `కిక్కు` సినిమా ఆద్యంతం ఉంటేనే కేజీఎఫ్ స్థాయి విజయం సాధ్యమవుతుంది. ముఖ్యంగా గీతూ మోహన్ దాస్ అందించే కథనం.. యశ్ నటనపైనే ఈ సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది. కన్నడ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని సరికొత్త జోనర్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నామ‌ని చెబుతున్నారు గ‌నుక ఆ మేర‌కు క్వాలిటీ ఆఫ్ మేకింగ్ చాలా చాలా ముఖ్యం.

ఇక ఈ చిత్రంలోని బోల్డ్ సీన్స్‌పై వస్తున్న విమర్శలకు యశ్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఇవి కేవలం తక్షణ ఆకర్షణ కోసం పెట్టినవి కాదని.. మహిళా కోణం నుండి చిత్రీకరించినవని అత‌డు స్పష్టం చేశారు. కేవలం గ్లామర్ కోసం కాకుండా... పాత్రల మధ్య ఉండే భావోద్వేగ డెప్త్‌ను పెంచడానికే ఈ సీన్స్‌ను జోడించినట్లు య‌ష్‌ తెలిపారు. ఈ సరికొత్త ప్రయోగం ప్రేక్షకులకు ఒక వైవిధ్యమైన అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

చివరగా.. `టాక్సిక్` సినిమాను కేవలం కన్నడలో మాత్రమే కాకుండా.. హిందీ మార్కెట్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని పలు భాషల్లో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యశ్ తన మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి... `ఫీమేల్ గేజ్` క్వాలిటీతో ప్రయోగాత్మక కోణంలో ముందుకు వెళ్తుండటం నిజంగా సాహసోపేతమైన నిర్ణయమే. ఈ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సక్సెస్ అవుతుందో.. యశ్ తన పాన్ ఇండియా క్రేజ్‌ను ఎలా నిలబెట్టుకుంటారో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

`ఫీమేల్ గేజ్` అంటే?

సినిమా ప్రపంచంలో `ఫీమేల్ గేజ్` అంటే ఒక కథను లేదా సన్నివేశాన్ని మహిళల దృష్టికోణం నుండి ఆవిష్కరించడం. సాధారణంగా తెరపై స్త్రీలను కేవలం అందమైన వస్తువులుగానో లేదా పురుషుల కోరికలను తీర్చే పాత్రలుగానో చూపే `మేల్ గేజ్`కు ఇది పూర్తి భిన్నమైనది. ఇందులో కెమెరా కేవలం శారీరక ఆకర్షణపైనే కాకుండా, పాత్రల మధ్య ఉండే భావోద్వేగ సాన్నిహిత్యం, సున్నితత్వం.. మానసిక అనుబంధంపై దృష్టి పెడుతుంది. పురుష పాత్రలను కూడా కేవలం వీరత్వంతోనే కాకుండా.. వారిలోని భావోద్వేగాలను, బలహీనతలను గౌరవిస్తూ స్త్రీలు ఆశించే రీతిలో చిత్రీకరిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది మహిళల ఆలోచనలకు.. వారి అనుభూతులకు .. ఆకాంక్షలకు తెరపై ప్రాధాన్యతనిచ్చే ఒక కళాత్మక దృక్పథం.