Begin typing your search above and press return to search.

అసలు టాక్సిక్ ఎలా ఉండబోతోంది?

పాన్‌ ఇండియా స్టార్ యశ్ మరోసారి భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

By:  M Prashanth   |   18 April 2026 2:03 PM IST
అసలు టాక్సిక్ ఎలా ఉండబోతోంది?
X

పాన్‌ ఇండియా స్టార్ యశ్ మరోసారి భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్‌ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అమెరికాలోని సినిమా కాన్ వేదికగా ఆ చిత్రానికి సంబంధించిన 9 నిమిషాల ప్రివ్యూను ప్రదర్శించడం ఆసక్తిని మరింత పెంచింది.

ఈ సందర్భంగా మాట్లాడిన యశ్‌.. సినిమా కథా నేపథ్యాన్ని వెల్లడించారు. స్వాతంత్ర్యం అనంతరం గోవాలో కొంతకాలం కొనసాగిన పోర్చుగీసు పాలన నేపథ్యంలో చిత్రం రూపొందుతోందని తెలిపారు. ఆ కాలంలో ఉన్న రాజకీయ పరిణామాలు, గ్యాంగ్ వార్స్‌ తోపాటు తండ్రీకొడుకుల మధ్య నడిచే రివేంజ్ డ్రామాగా టాక్సిక్‌ తెరకెక్కిందని చెప్పారు. అయితే ఇది సాధారణ గ్యాంగ్‌ స్టర్ సినిమా కాదని, పూర్తిగా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే కథగా ఉంటుందని స్పష్టం చేశారు.

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా యశ్‌ సినిమా కోసం ప్రత్యేకంగా మాట్లాడారు. "ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు. భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో నాకు తెలుసు. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం" అని తెలిపారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌ తో పని చేయడం గొప్ప అనుభవమని, ఆమెకు సినిమా పై స్పష్టమైన విజన్ ఉందని అన్నారు.

ఈ సినిమాలో యశ్ రాయ్ అనే పవర్‌ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌ గా కియారా అద్వానీ నదియా పాత్ర పోషిస్తుండగా, నయనతార గంగగా నటిస్తున్నారు. అలాగే హుమా ఖురేషీ ప్రత్యేక పాత్రలో, తారా సుతారియా రెబెకాగా, రుక్మిణి వసంత్ మెలిసాగా కనిపించనున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఆ చిత్రం.. ఇంటర్నేషనల్ లెవెల్ లో రూపొందుతోంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మూవీ రిలీజ్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విడుదల చేయనున్నారు.

మొదట సినిమా మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ అభ్యర్థన మేరకు వాయిదా పడింది. ప్రస్తుతం జూన్ 4న సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ఖరారు చేసింది. విడుదల వాయిదా పడుతుందనే ప్రచారాన్ని కూడా టీమ్ ఖండించింది. అంతేకాకుండా టాక్సిక్‌ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌ తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌ తో తెరకెక్కుతున్న ఆ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.