టాప్ 5 కి ముందు.. ‘టాక్సిక్’ దాటాల్సింది యశ్ రికార్డే!
యశ్ ‘టాక్సిక్’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌తో యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఓపెనింగ్ మీద మొదటి నుంచి పెద్ద లెక్కలే ఉన్నాయి.
By: M Prashanth | 26 Aug 2026 10:00 AM ISTయశ్ ‘టాక్సిక్’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌తో యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఓపెనింగ్ మీద మొదటి నుంచి పెద్ద లెక్కలే ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చివరి రెండు రోజుల్లో స్పీడ్ అందుకున్నాయి. అయితే ఇండియన్ సినిమాల భారీ ఓపెనింగ్స్ లిస్ట్ చూస్తే ‘టాక్సిక్’ ముందు ఉన్న టార్గెట్ చిన్నది కాదు.
మంగళవారం రాత్రి వరకు ఇండియాలో తొలి రోజు కోసం 12.24 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని ట్రాకింగ్ లెక్కలు చెబుతున్నాయి. అడ్వాన్స్ గ్రాస్ రూ.41.25 కోట్ల దగ్గర ఉండగా, బ్లాక్ సీట్స్ కలిపితే రూ.54 కోట్లకు పైగా ఉంది. హిందీ వెర్షన్‌లోనే ఆరు లక్షలకు పైగా టికెట్లు వెళ్లడం మరో ప్లస్. ప్రస్తుతం ట్రేడ్ అంచనాలు వరల్డ్‌వైడ్ డే 1ను రూ.100 నుంచి 120 కోట్ల మధ్యలో పెడుతున్నాయి.
కానీ యశ్ ఇదివరకే ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ చూశాడు. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ 2022లో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు దాదాపు రూ.165 కోట్ల గ్రాస్ అందుకుంది. అప్పటికి ‘కేజీఎఫ్’ బ్రాండ్, మొదటి పార్ట్ తర్వాత వచ్చిన హైప్ రెండూ సినిమాకు కలిసొచ్చాయి. ‘టాక్సిక్’ మాత్రం కొత్త కథ, కొత్త దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో వస్తోంది.
ఇక పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన సినిమాల వరల్డ్‌వైడ్ డే 1 టాప్ లిస్ట్ చూస్తే సౌత్ సినిమాల డామినేషన్ క్లియర్ గా కనిపిస్తోంది. ‘పుష్ప 2’ చాలా ముందుండగా, ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి 2’ ఉన్నాయి. ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’ కూడా భారీ ఓపెనింగ్స్‌తో టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. వేర్వేరు బాక్సాఫీస్ ట్రాకర్లలో కొన్ని నంబర్స్‌లో తేడా ఉన్నా, అంచనాల ప్రకారం ఎక్కువగా రిపోర్ట్ అయిన లెక్కలు ఇవి.
అంచనాల ప్రకారం పాన్ ఇండియా సినిమాల్లో టాప్ వరల్డ్‌వైడ్ ఓపెనింగ్స్
పుష్ప 2: రూ.280-294 కోట్లు
ఆర్ఆర్ఆర్: రూ.223 కోట్లు
బాహుబలి 2: రూ.217 కోట్లు
కల్కి 2898 ఏడీ: రూ.180-191 కోట్లు
సలార్: రూ.178.7 కోట్లు
కేజీఎఫ్ ఛాప్టర్ 2: రూ.165 కోట్లు
ఈ లిస్ట్‌లోకి ‘టాక్సిక్’ రావాలంటే కనీసం రూ.179 కోట్లకు పైగా వెళ్లాలి. ప్రస్తుతం ఉన్న రూ.100-120 కోట్ల అంచనాతో చూస్తే టాప్-5 ఇంకా దూరంగానే ఉంది. ముందుగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ రూ.165 కోట్ల ఓపెనింగ్‌ను దాటితేనే యశ్ కెరీర్‌లో కొత్త డే 1 రికార్డు అవుతుంది. రిలీజ్ రోజు కౌంటర్ బుకింగ్స్, హిందీ మార్కెట్, ఓవర్సీస్ నుంచి వచ్చే నంబర్స్ ఇక్కడ కీలకం.
‘టాక్సిక్’కు మరో తేడా ‘ఏ’ సర్టిఫికెట్. మూడు గంటలకు పైగా రన్‌టైమ్ కూడా ఉంది. అయినా అడ్వాన్స్‌లో మిలియన్ టికెట్ల మార్క్ దాటింది. కాబట్టి రూ.100 కోట్ల ఓపెనింగ్ అందుకోవడం ప్రస్తుతం పెద్ద సర్‌ప్రైజ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ టాప్-5లోకి వెళ్లాలంటే అంచనాలకు మించి మరో రూ.60-70 కోట్ల జంప్ కావాలి. చూడాలి మరి ఆ ఓపెనింగ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో.
