వాళ్లిద్దరు పాన్ ఇండియా ఇమేజ్ హ్యాండిల్ చేయడంలో తడబాటు!
కన్నడ పరిశ్రమను ప్రాంతీయ సరిహద్దులు దాటించి పాన్ ఇండియా స్థాయిలో గర్వపడేలా చేసిన ఘనత ఆ శాండల్‌వుడ్ అగ్ర హీరోలకే దక్కుతుంది.
By: Srikanth Kontham | 5 Oct 2026 12:26 AM ISTకన్నడ పరిశ్రమను ప్రాంతీయ సరిహద్దులు దాటించి పాన్ ఇండియా స్థాయిలో గర్వపడేలా చేసిన ఘనత ఆ శాండల్‌వుడ్ అగ్ర హీరోలకే దక్కుతుంది. `కేజీఎఫ్` సిరీస్ తో యష్, `కాంతార`తో రిషబ్ శెట్టి , `విక్రాంత్ రోణ`తో కిచ్చా సుదీప్ దేశవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా వచ్చిన పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం, హిట్‌తో వచ్చిన అంచనాలను అందుకోవడం ఇప్పుడా నటులకు అతిపెద్ద సవాలుగా మారింది. ఆ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఒత్తిడి ప్రభావం వారి తదుపరి సినిమాల ఎంపిక .. విడుదలలపై స్పష్టంగా కనిపిస్తోంది.
`కేజీఎఫ్ 2` సృష్టించిన సునామీ తర్వాత యష్ తన చిత్రం కోసం దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్నారు. భారీ అంచనాల నడుమ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వచ్చిన ప్రాజెక్ట్ `టాక్సిక్` తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అటు విమర్శకుల నుంచి, ఇటు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో పాన్ ఇండియా ఇమేజ్ నిలబెట్టుకోవడంలో లాంగ్ గ్యాప్ తీసుకున్నా ఫలితం ఆశాజనకంగా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన చిత్రం `కాంతార` ప్రాంచైజీ. ఈ ప్రాంచైజీ రిషబ్ శెట్టి రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన నుంచి వరుసగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రకటనల రూపంలో వచ్చినా? ఏదీ వేగంగా పట్టా లెక్కకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. సుదీర్గ విరామం అన్నది మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
కన్నడ విలక్షణ నటుడు కిచ్చా సుదీప్ కథల ఎంపికలో తొలి నుంచీ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు. `ఈగ`, `విక్రాంత్ రోణ` చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో మంచి మార్కులే వేయించుకున్న సుదీప్ తదుపరి సినిమాల చేసిన కొన్ని ప్రయోగాలు వికటించాయి. అప్పటి నుంచి కొత్త ప్రాజెక్ట్ ల ప్రకటన విషయంలో సమయం తీసుకుంటున్నారు. దీంతో కొత్త సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అన్నది క్లారిటీ లేకుండా పోతుంది.
పాన్ ఇండియా ఇమేజ్ అనేది కేవలం మార్కెట్ పరిధిని మాత్రమే పెంచదు. దాంతో పాటు ప్రేక్షకుల నుంచి బాధ్యతను, చిత్రం పట్ల కొండంత అంచనాలను కూడా మోసుకొస్తుంది. ప్రాంతీయ మార్కెట్‌కు పరిమితమైనప్పుడు ఉండే స్వేచ్ఛ, పాన్ ఇండియా స్టార్‌డమ్ వచ్చాక ఉండదు. ప్రతి కథ, మేకింగ్ విజువల్స్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఆలోచనే నటుల్లో, దర్శకుల్లో ఒత్తిడిని పెంచుతుంది.
ఏదేమైనా? ఒక ప్లాప్ లేదా సుదీర్ఘమైన విరామం కథానాయకుల అసలు సత్తాను తగ్గించలేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు స్టార్ హీరోలందరూ ఈ విధమైన క్రేజ్, ఒత్తిడిని ఫేస్ చేసినవారే. సరైన కథ, బలమైన విజువల్స్ పడితే మళ్లీ కన్నడ రథసారథులు బాక్సాఫీస్ వద్ద విజృంభించడం ఖాయం. కాకపోతే పాన్ ఇండియా క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ వేగంగా సినిమాలు పూర్తి చేయడమే ప్రస్తుతానికి వారి ముందున్న సవాలు.
