4 వేల కోట్ల బడ్జెట్‌పై ట్రోల్స్.. యశ్ ఏమన్నాడంటే?
ఈ ఏడాది ముందు వరకు ఏ ఇండియన్ సినిమా మీదా వెయ్యి కోట్ల బడ్జెట్ కూడా ఎవ్వరూ పెట్టలేదు.
By: Garuda Media | 18 Aug 2026 1:00 AM ISTఈ ఏడాది ముందు వరకు ఏ ఇండియన్ సినిమా మీదా వెయ్యి కోట్ల బడ్జెట్ కూడా ఎవ్వరూ పెట్టలేదు. రాజమౌళి, మహేష్ బాబుల వారణాసి ఆ మైలురాయిని అందుకోనున్న తొలి సినిమా అని అందరూ భావిస్తుండగా.. రామాయణ ప్రాజెక్టును ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్లో రూపొందిస్తున్నట్లు గత ఏడాది నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించడంతో అందరూ విస్మయానికి గురయ్యారు.
ఇండియన్ సినిమాకు అంత మార్కెట్ ఎక్కడుంది.. అంత ఖర్చు పెట్టి బడ్జెట్ రికవర్ చేయడం ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయారు. కానీ నమిత్ మల్హోత్రా మాత్రం ఆ ప్రకటనకు కట్టుబడే ఉన్నాడు. కానీ రామాయణ పార్ట్-1 టీజర్, ట్రైలర్ చూస్తే బడ్జెట్‌కు తగ్గ క్వాలిటీ కనిపించలేదు. ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తే పొంతన లేనట్లున్నాయి,.దీంతో సోషల్ మీడియాలో రామాయణ బడ్జెట్ మీద ట్రోల్స్ తప్పలేదు.
ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా ఒక హిందీ టీవీ షోకు అతిథిగా హాజరైన యశ్‌కు రామాయణ బడ్జెట్ గురించి ప్రశ్న ఎదురైంది. దీని మీద వస్తున్న ట్రోల్స్ గురించి కూడా హోస్ట్ ప్రశ్నించారు. దీనికి యశ్ సమాధానమిస్తూ.. నిజంగానే రామాయణం మీద మేకర్స్ రూ.4 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిపాడు. ఈ బడ్జెట్ రామాయణం రెండు భాగాలకూ కలిపి అన్నది గుర్తుంచుకోవాలన్నాడు.
అలాగే ఈ ఖర్చంతా కేవలం ప్రొడక్షన్ కోసం పెడుతున్నది కాదని.. ఇందులో పారితోషకాలు సహా అదనపు ఖర్చులు చాలా ఉన్నాయని తెలిపాడు. మన పురాణ గాథల్లో అత్యంత గొప్పదైన రామాయణాన్ని గ్లోబల్ ఆడియన్స్‌కు చేరువ చేసే ఉద్దేశంతో భారీగా ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేస్తున్నారని.. రిలీజ్ కోసం కూడా చాలా బడ్జెట్ పెడుతున్నారని.. ఇలా అనేక ఖర్చులు కలిస్తేనే రూ.4 వేల కోట్ల బడ్జెట్ అని.. దీని మీద విమర్శలు అనవసరమని అతను అభిప్రాయపడ్డాడు.
మరోవైపు గతంలో రష్మిక మందన్నా తనను మిస్టర్ షోఆఫ్ అంటూ కామెంట్ చేయడం మీద కూడా ఈ షోలో యశ్ స్పందించాడు. రష్మిక కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో ఏ పరిస్థితుల్లో ఆ కామెంట్ చేసిందో అర్థం చేసుకోవాలని, ఆమెకు కొన్ని ఆప్షన్లు ఇచ్చి ఆ జవాబు చెప్పించి ఉండొచ్చని.. తాను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోనని, ఇతరులు ఏమంటారన్నదాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఏంటన్నది నిర్ణయం కాదని అతనన్నాడు.
