రాక్షసుడితో పోరాటంలో నువ్వే అంతకంటే పెద్ద రాక్షసుడిగా మారతావు!
ఇటీవల `కామిక్ కాన్` వేదికగా `రామాయణం`పైనా... రావణాసురుడి పాత్రపైనా రాకింగ్ స్టార్ యష్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
By: Sivaji Kontham | 26 July 2026 6:15 PM ISTఇటీవల `కామిక్ కాన్` వేదికగా `రామాయణం`పైనా... రావణాసురుడి పాత్రపైనా రాకింగ్ స్టార్ యష్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రామాయణంలో రావణుడి పాత్ర కేవలం ఒక సాధారణ విలన్ మాత్రమే కాదని... అత్యంత సంక్లిష్టమైన, బహుముఖ ప్రజ్ఞ కలిగిన సర్వశక్తి సంపన్నుడని యష్ అభివర్ణించారు. ఎలాంటి నేపథ్యం లేకుండా శూన్యం నుండి ప్రారంభమై.. తన తపస్సు, జ్ఞానంతో అత్యంత శక్తివంతమైన లంకాధిపతిగా ఎదిగిన రావణుడి ప్రయాణాన్ని ఆయన విశ్లేషించారు. అయితే ఎంతో జ్ఞానం ఉన్నా కానీ... అపరిమితమైన శక్తిని సరిగ్గా నియంత్రించుకోలేకపోవడమే తన పతనానికి దారితీసిందని యష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యష్ ఒక తత్వశాస్త్ర సూత్రాన్ని ప్రస్తావిస్తూ..ఒక రాక్షసుడితో లేదా దుష్టశక్తితో పోరాడే క్రమంలో.. ఒక్కోసారి నువ్వే అంతకంటే పెద్ద రాక్షసుడిగా మారే ప్రమాదం ఉంది! అని వ్యాఖ్యానించారు. రావణాసురుడు తన జీవితంలో శత్రువులతో పోరాడుతూ... అధికారాన్ని కాపాడుకునే క్రమంలో క్రమంగా తనలోని విచక్షణను కోల్పోయి పెద్ద రాక్షసుడిగా ఎలా మారాడో యష్ ఉదాహరణగా చెప్పారు. రావణుడు అపారమైన వేద పండితుడని.. పరమ శివభక్తుడని... సంగీత సాహిత్యాలలో ప్రవీణుడని గుర్తుచేస్తూ.. ఆయన పతనం కేవలం అహంకారం- శక్తి దుర్వినియోగం వల్లనే జరిగిందని విశ్లేషించారు.
అయితే యష్ చెప్పిన ఈ సిద్ధాంతాన్ని శ్రీరాముడికి వర్తింపజేస్తే.. రావణుడిపై దండెత్తి ఆయనను సంహరించిన శ్రీరాముడు కూడా రాక్షసుడిగా మారినట్టేనా? శ్రీరాముడు రావణుడిని మించిన రాక్షసుడా? అంటే కచ్చితంగా `కాదు`. ఎందుకంటే, రాక్షసత్వానికి , ధర్మానికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసమే `నియంత్రణ`. రావణుడు స్వార్థం, అహంకారం, పరస్త్రీ వ్యామోహంతో ధర్మాన్ని తప్పి రాక్షసుడిగా మారాడు. కానీ శ్రీరాముడు రావణుడిని సంహరించింది తన స్వార్థం కోసం కాదు.. లోక కళ్యాణం కోసం.. ధర్మ సంస్థాపన కోసం! శత్రువును అంతమొందించే సమయంలో కూడా రాముడు తన శాంతాన్ని, ధర్మాన్ని, రాచరిక మర్యాదలను వీడలేదు. రావణుడు కూలిపోయిన తర్వాత కూడా ఆయన పండితుడనే గౌరవంతో లక్ష్మణుడిని ఆయన వద్దకు పంపి జ్ఞానోపదేశం పొందేలా చేసిన ఉదాత్తమైన వ్యక్తి రాముడు. కాబట్టి రాముడి చర్య ధర్మబద్ధమైన యుగాంతర కర్తవ్యమే తప్ప రాక్షసత్వం కానే కాదు.
మన భారతీయ పురాణేతిహాసాలలో కూడా శత్రువులను లేదా అధర్మాన్ని అంతమొందించే క్రమంలో శాంతమూర్తులుగా ఉండే పాత్రలు అత్యంత ఉగ్ర రూపాన్ని దాల్చడం మనం చూస్తాం. శ్రీమహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరించడానికి ఎత్తిన నరసింహ అవతారం ఇందుకు పెద్ద ఉదాహరణ. ప్రహ్లాదుడిని కాపాడటానికి.. రావణుడి కంటే దారుణమైన రాక్షసుడైన హిరణ్యకశిపుడి పేగులను మాలగా వేసుకుని, రాక్షసత్వాన్ని అణచివేయడానికి అంతకంటే ఉగ్రమైన రూపం దాల్చాల్సి వచ్చింది. అలాగే మహాభారతంలో దుర్యోధనాదుల అధర్మాన్ని... ద్రౌపదీ వస్త్రాపహరణ దారుణాన్ని చూసి కోపోద్రిక్తుడైన భీముడు కురుక్షేత్రంలో దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగడం వెనుక ఉన్నది రాక్షసత్వం కాదు.. అధర్మంపై సాధించిన భయంకరమైన ధర్మ విజయం.
అలాగే `దేవీ భాగవతం`లో మహిషాసురుడు, సుంభ-నిశుంభుల వంటి రాక్షసులను వధించడానికి శాంత స్వరూపిణి అయిన పార్వతీ దేవి `కాళికా దేవి`గా, `చండి`గా అత్యంత భయంకరమైన రూపం దాల్చాల్సి వచ్చింది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవసరమైనప్పుడు ఉగ్రత్వాన్ని ప్రదర్శించడం భారతీయ సంస్కృతిలో `ధర్మయుద్ధం`గా పరిగణిస్తారు. కాబట్టి యష్ చెప్పినట్లు శక్తిని, స్వీయ ప్రయోజనాలకు వాడుకుని అహంకారంతో పతనమైన రావణుడు `రాక్షసుడు` అయితే.. సమాజ శ్రేయస్సు కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం ఆ ఉగ్రత్వాన్ని నియంత్రితంగా ఉపయోగించిన రాముడు.. ఇతర పురాణ మూర్తులు `ధర్మ రక్షకులు`గా నిలిచారు.
