Begin typing your search above and press return to search.

రావణుడిగా ప్రిపరేషన్: య‌ష్ కంటే ముందే సినిమా హిస్ట‌రీలో టాప్- 5 నటులు వీళ్లే!

ఇటీవల 2026 సన్ డియాగో కామిక్-కాన్ (ఎస్.డి.సి.సి) వేదికగా విడుదలైన `రామాయణ్` ట్రైలర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌న వ్యూస్ ని సాధించిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   8 Aug 2026 9:49 AM IST
రావణుడిగా ప్రిపరేషన్: య‌ష్ కంటే ముందే సినిమా హిస్ట‌రీలో టాప్- 5 నటులు వీళ్లే!
X

ఇటీవల 2026 సన్ డియాగో కామిక్-కాన్ (ఎస్.డి.సి.సి) వేదికగా విడుదలైన `రామాయణ్` ట్రైలర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌న వ్యూస్ ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో లంకేశ్వరుడి పాత్రలో నటిస్తున్న కెజియఫ్ ఫేమ్ యష్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. అయితే రాకింగ్ స్టార్ తన క్యారెక్టర్ ప్రిపరేషన్ గురించి తాజాగా జాతీయ మీడియా ఇంట‌ర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రామాయణం అందరికీ తెలిసిన కథే అయినా ఇప్పటికే ఎంతోమంది ఐకానిక్ నటులు పోషించిన ఈ రావణాసురుడి పాత్రకు తనదైన ప్రత్యేక వ్యాఖ్యానాన్ని అందించడమే తనకు లభించిన అతిపెద్ద సవాల్‌! అని యష్ పేర్కొన్నారు. రావణుడు అనగానే కేవలం ఒక రాక్షసుడిగా కాకుండా...అతడి చర్యల వెనుక ఉన్న ఉద్దేశం.. ఆలోచనా విధానాన్ని లోతుగా అధ్యయనం చేసి ఈ పాత్రకు ప్రాణం పోసినట్లు తెలిపారు.

ఈ కథలో శ్రీరాముడు .. రావణాసురుడి పాత్రల మధ్య ఉండే వైరుధ్యాన్ని యష్ విశ్లేషించిన తీరు సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీరాముడు రాజుగా జన్మించినా పరిస్థితుల వల్ల సర్వస్వం కోల్పోయి.. తన ధర్మబద్ధమైన చర్యలతో తిరిగి శక్తులను సాధిస్తే... రావణాసురుడు ఏమీ లేని స్థాయి నుండి స్వశక్తితో ఎదిగి మహా పండితుడిగా మారతాడని ఆయన వివరించారు. కానీ పరిమితి లేని అధికారం- పగ కారణంగా తన శక్తులపై నియంత్రణ కోల్పోయి చివరకు రాక్షసుడిగా ఎలా మారాడో యష్ తన క్యారెక్టర్ డిజైన్‌లోనే చూపించబోతున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. యష్ రావణుడిగా నటించిన ఈ మెగా విజువల్ వండర్ 1 బిలియన్ వ్యూస్ సాధించి దీపావళి 2026 పోరులో బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధమవుతోంది.

భారతీయ చలనచిత్ర చరిత్రలో యష్ కంటే ముందే రావణాసురుడి పాత్రను పోషించి చెరగని ముద్ర వేసిన టాప్-5 నటులలో న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మొద‌టి వ‌రుస‌లో ఉంటారు. భూకైలాస్, సీతారామ కళ్యాణం వంటి చిత్రాలలో ఎన్టీఆర్ చేసిన రావణుడి పాత్ర కోసం తీవ్రమైన శారీరక భాషతో పాటు...కావ్యాల్లోని శ్లోకాలు... వేద పఠనం.. గంభీరమైన స్వర ఉచ్ఛారణపై కఠిన శిక్షణ తీసుకున్నారు. రావణుడి శివభక్తిని , అహంకారాన్ని తన నటనా విశ్వరూపంతో పండించి.. ఆ పాత్రకు ఒక దైవికమైన .. గంభీరమైన క్రేజ్‌ను తీసుకువచ్చారు.

మరొక దిగ్గజ నటుడు ఎస్వి రంగారావు (ఎస్వీఆర్) `సంపూర్ణ రామాయణం`లో రావణుడిగా జీవించి.. పాత్ర మానసిక వేదనను.. రాక్షసత్వాన్ని ప్రదర్శించడానికి ప్రత్యేకమైన రసాభినయం అభ్యసించారు. న‌వ‌ర‌సాల్ని ఔపోష‌ణ ప‌ట్టిన ఏటి న‌టుడిగా ఎస్వీఆర్ న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌ను ఎప్ప‌టికీ తెలుగు ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేరు. అలాగే హిందీ టెలివిజన్ చరిత్రలో రామానంద్ సాగర్ `రామాయణ్` సీరియల్‌లో అరవింద్ త్రివేది రావణుడిగా నటించేందుకు థియేటర్ ఆంగికాభినయం, గుజరాతీ నాటకరంగ అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించారు. సునీల్ దత్ , జగయ్య వంటి నటులు కూడా రేడియో.. నాటకాలు... పౌరాణిక చిత్రాలలో గంభీరమైన సంభాషణలతో ఈ పాత్ర ప్రాధాన్యతను నిలబెట్టేలా కఠినమైన భాషాభ్యాసాలు చేశారు.

గతంలో ఈ నటులందరూ రావణుడిలోని శివభక్తి... వేద పండితుడి లక్షణాలు.. ఆధిపత్య ధోరణిని ప్రతిబింబింపజేసేలా ప్రత్యేక ప్రిపరేషన్ సాగించ‌గా.. యష్ ప్రస్తుత విజువల్స్ - సైకాలజికల్ ట్రెండ్‌కు తగ్గట్లుగా ఈ పాత్రలోని అంతర్మథనాన్ని స్ట‌డీ చేసాన‌ని తెలిపారు. ఒక సాధారణ వ్యక్తి మహా శక్తివంతుడిగా మారి..ఆపై అధికారం తలకెక్కి రాక్షసుడిగా మారే క్రమాన్ని లీనమై చూపించడమే యష్ ప్రిపరేషన్ ప్రత్యేకత. పాతతరం దిగ్గజాల వారసత్వాన్ని అందుకుంటూనే... ఈ తరం ప్రేక్షకులకు రావణుడి మానసిక విశ్లేషణను నూతన కోణంలో చూపించబోతున్న యష్ `రామాయణ్` చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.