ఇద్దరికీ అలా కలిసొచ్చింది? ప్రేక్షకులు ఏమంటారో?
బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న `రామాయణం`లో యశ్ రావణాసురుడి పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
By: Srikanth Kontham | 21 July 2026 3:43 PM ISTబాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న `రామాయణం`లో యశ్ రావణాసురుడి పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో విడుదలైన యశ్ గెడ్డం లుక్ ఇప్పుడు ప్రేక్షకులలో, పురాణ పండితులలో భిన్నమైన చర్చకు దారితీస్తోంది. సాంప్రదాయకంగా వస్తున్న రూపానికి భిన్నంగా యశ్ గెడ్డంతో కనిపించడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వాల్మీకి రాసిన రామాయణం ..సంప్రదాయ నాటకాలు, వీధి నాటకాలు .. గతంలో వచ్చిన పౌరాణిక చిత్రాలను పరిశీలిస్తే రావణాసురుడికి గెడ్డం ఉండేది కాదని స్పష్టమవుతుంది.
రావణుడి పాత్రధారులు మెలితిప్పిన పెద్ద మీసాలతో, కిరీటంతో, రాజసం ఉట్టిపడే రూపంలో కనిపిస్తారు. ఇది శతాబ్దాలుగా ప్రజల మనసుల్లో నాటుకుపోయిన రావణుడి ప్రామాణిక రూపు. కానీ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న మోడర్న్ వెర్షన్ రామాయణంలో మాత్రం యశ్ కోసం గెడ్డంతో కూడిన విభిన్నమైన రాక్షస రాజు లుక్‌ను డిజైన్ చేయడం పట్ల కొందరు పౌరాణిక అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ గెడ్డం లుక్ వెనుక దర్శకుడి సృజనాత్మక స్వేచ్ఛ మాత్రమే కాకుండా మరొక పెద్ద ప్రాజెక్ట్ పరమైన సాంకేతిక ఇబ్బంది కూడా ఉందనే బలమైన వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం యశ్ నటిస్తున్న మరో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రం `టాక్సిక్` షూటింగ్ కూడా సమాంతరంగా జరుగుతోంది. ఆ సినిమాలో యశ్ మోడర్న్, రగ్డ్ గెడ్డం లుక్‌లో కనిపించాల్సి ఉంది. రెండు భిన్నమైన భారీ చిత్రాల షూటింగ్‌లలో ఏకకాలంలో పాల్గొంటుండటం వల్ల గెడ్డం తీసేస్తే కంటిన్యూటీ సమస్య తలెత్తుతుంది. అందువల్ల `రామాయణం` చిత్ర యూనిట్ కూడా ఇదే లుక్‌ను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఒకవైపు పౌరాణిక నిబంధనలు, మరోవైపు కమర్షియల్ సినిమాల కంటిన్యూటీ సవాళ్లు. ఈ రెండూ కలిసి యశ్ రావణాసురుడి రూపానికి కొత్త రూపాన్ని తెచ్చిపెట్టాయి. కాలానికి తగినట్లుగా పౌరాణిక పాత్రల రూపకల్పనలో మార్పులు చేయడం కొత్తేమీ కాకపోయినా? రావణుడికి గెడ్డం ఉండటం మాత్రం ప్రేక్షకులకు కొంత కొత్తగా అనిపిస్తోంది. దర్శక నిర్మాతలు ఈ ప్రయోగాన్ని ఏ విధంగా తెరపై ఆవిష్కరిస్తారు? ప్రేక్షకులు దీనిని ఏ మేరకు స్వాగతిస్తారు? అనేది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది.
రెండు భిన్నమైన సినిమాల షూటింగ్‌ల కలయిక వల్ల ఏర్పడిన గెడ్డం లుక్ వివాదం తాత్కాలికమే అయినా? తెరపై రావణాసురుడిగా యశ్ చూపించే అభినయమే అంతిమంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. కాలానికి తగినట్లుగా పౌరాణిక పాత్రల చిత్రణలో వస్తున్న మార్పులను ప్రేక్షకులు ఏ విధంగా స్వీకరిస్తారో చూడాలి.
