బన్నీ పాన్ ఇండియా స్టార్ కాదా?
సౌత్ ఇండియన్ సినిమాల గురించి ఇక్కడ పని చేసిన ఫిలిం సెలబ్రెటీలను కవ్వించేలా ప్రశ్నలు అడిగి ఇరుకున పెట్టడం ఇటీవల బాలీవుడ్ మీడియా వాళ్లకు మామూలైపోయింది.
By: Garuda Media | 17 Aug 2026 11:09 PM ISTసౌత్ ఇండియన్ సినిమాల గురించి ఇక్కడ పని చేసిన ఫిలిం సెలబ్రెటీలను కవ్వించేలా ప్రశ్నలు అడిగి ఇరుకున పెట్టడం ఇటీవల బాలీవుడ్ మీడియా వాళ్లకు మామూలైపోయింది. అక్కడికేదో బాలీవుడ్లో పరమ పవిత్రమైన సినిమాలు తీస్తారన్నట్లుగా తమన్నా సహా అనేకమందితో సౌత్ సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడించడం, ఆ దిశగా ప్రశ్నలు అడగడం తెలిసిందే.
ఇదంతా నార్త్ ఇండియాలో సౌత్ సినిమాలు, ఇక్కడి స్టార్లు ఆధిపత్యం చలాయించడం చూసి తట్టుకోలేకే అని అర్థమవుతోంది. ఐతే వేరే ఫిలిం జర్నలిస్టులు ఇలాంటి ప్రశ్నలు అడగడం ఓకే కానీ.. ‘ఆప్ కీ అదాలత్’ పేరుతో టీవీ షో నిర్వహించే రజత్ శర్మ సాధారణంగా కొంచెం హుందాగానే ప్రశ్నలు వేస్తుంటాడు. కానీ ఆయన కూడా తాజాగా అదుపు తప్పాడు. తెలుగు స్టార్ల మీద ఇన్ డైరెక్ట్‌గా తన అక్కసును వెళ్లగక్కాడు.
‘ఆప్ కీ అదాలత్’ లేటెస్ట్ ఎపిసోడ్‌కు ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. అతణ్ని రజత్ అడిగిన ఒక ప్రశ్న టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. మీలా మిగతా సౌత్ స్టార్లు ఎందుకు పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించలేకపోయారు అంటూ.. రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయ్‌ల పేర్లను ప్రస్తావిస్తూ యశ్‌ను ప్రశ్న అడిగాడు రజత్ శర్మ.
‘కేజీఎఫ్’తో యశ్ పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్న మాట వాస్తవమే కానీ, అతడి మార్కెట్ ఏ స్థాయిలో ఉందన్నది ఇంకా క్లారిటీ లేదు. ‘టాక్సిక్’ రిలీజయ్యాక కానీ దాని మీద క్లారిటీ రాదు. కానీ అల్లు అర్జున్ ‘పుష్ప’తో అతడిని మించిన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయిలో సంపాదించాడు. ‘టాక్సిక్’ కంటే ‘రాకా’కే ఎక్కువ హైప్ ఉందన్నది వాస్తవం.
మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా నార్త్ ఇండియాలో మార్కెట్ సంపాదించుకున్నారు. మహేష్ బాబు ‘వారణాసి’తో ఆటోమేటిగ్గా పాన్ ఇండియా సూపర్ స్టార్ అవుతాడని అంచనా వేస్తున్నారు. కానీ రజత్ శర్మ మాత్రం వీళ్లందరినీ తక్కువ చేస్తూ యశ్ ఏదో పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా స్థిరపడిపోయినట్లు మాట్లాడ్డమే విడ్డూరం. ఐతే యశ్ మాత్రం ఈ ప్రశ్నకు హుందాగానే సమాధానం ఇచ్చాడు. ఆ హీరోలందరూ వాళ్ల వాళ్ల స్థాయిలో బాగా చేస్తున్నారని.. ఈ పాన్ ఇండియా స్టార్డమ్ అన్నది ఒక్క శుక్రవారంతో కరిగిపోతుందని వ్యాఖ్యానించాడు.
