Begin typing your search above and press return to search.

షారుఖ్ ఖాన్ కంటే నేనేం గొప్పకాదు!

`కెజిఎఫ్` చిత్రంతో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్ అద్భుతమైన నటనతోనే కాదు.

By:  Srikanth Kontham   |   14 Aug 2026 12:38 PM IST
షారుఖ్ ఖాన్ కంటే నేనేం గొప్పకాదు!
X

`కెజిఎఫ్` చిత్రంతో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్ అద్భుతమైన నటనతోనే కాదు. త‌న‌ వ్యక్తిత్వంతోనూ కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో యశ్ బాక్సాఫీస్ వద్ద తన సినిమా సాధించిన విజయం తనను సీనియర్ నటుడు షారుఖ్ ఖాన్ కంటే గొప్పవానిగా

పోల్చ‌డం అన్న‌ది అతి పెద్ద త‌ప్పుగా భావించారు. తన సినిమా కలెక్షన్ల పరంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సినిమాను క్రాస్ చేసినా? వందల కోట్ల కలెక్షన్లు తనను షారుఖ్ ఖాన్ కంటే పెద్ద హీరోగా నిలపలేవని య‌శ్ ఎంతో వినమ్రంగా చెప్పారు.

సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డులు, కలెక్షన్ల లెక్కలు సర్వసాధారణమని అయితే ఒక నటుడి స్థాయిని కేవలం ఆ సంఖ్యల ఆధారంగా అంచనా వేయకూడదని యష్ అభిప్రాయపడ్డారు. షారుఖ్ ఖాన్ దశాబ్దాలుగా సినీ పరి శ్రమకు అందించిన సేవలు, సంపాదించుకున్న అభిమానుల ఆదరాభిమానాలు ఎంతో గొప్పవని య‌శ్‌ కొనియాడారు. ఒకే ఒక్క సినిమా భారీ విజయం సాధించినంత మాత్రాన పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ దిగ్గజాల సరసన త‌న‌ను తాను సమానంగా పోల్చుకోవడం సరికాదని య‌శ్ పరిపక్వతను చాటి చెబుతుంది.

యష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పాటు ఆయన అభిమానులను మాత్రమే కాకుండా ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎంత పెద్ద స్టార్‌డమ్ వచ్చినప్పటికీ తోటి నటుల పట్ల.. ముఖ్యంగా సీనియర్ల పట్ల యష్ చూపించిన‌ గౌరవం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి వినయం, తోటి కళాకారులను అభినందించే తత్వం నేటి తరానికి చాలా అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కొత్త తరం పాన్-ఇండియా నటులు బాక్సాఫీస్ రికార్డుల గురించే కాకుండా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంపై దృష్టి పెట్టాలని యష్ మాటలు గుర్తు చేస్తున్నాయి. కలెక్షన్లు అనేది వ్యాపారపరమైన విజయమని, కానీ ఒక నటుడిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోవడమే అసలైన విజయమని నమ్ముతారు. భారీ విజయాలు తలకెక్కించుకోకుండా? నేల విడిచి సాము చేయని యష్ స్వభావం య‌శ్‌ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం యష్ తదుపరి భారీ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో ..నటనలో బిజీగా ఉన్నారు. కమర్షియల్ విజయాల మాయలో పడిపోకుండా? తనదైన శైలిలో కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని పంచడానికి సిద్ధ మవుతున్నారు. ఒకవైపు హీరోగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. మరోవైపు నిర్మాతగా పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న య‌శ్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగుతోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న న‌టిస్తోన్న `టాక్సిక్` ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.