ఆకట్టుకుంటున్న యష్ టాక్సిక్ లుక్.. డైరెక్టర్ ప్లాన్ అదుర్స్!
అలా కేజీఎఫ్ చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 27 Oct 2025 8:00 PM ISTప్రముఖ కన్నడ హీరో యష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు పలు యాడ్స్ ద్వారా కెరియర్ ఆరంభించిన ఈయన.. ఆ తర్వాత సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. మోడల్ గా కూడా కొంతకాలం పని చేసిన విషయం తెలిసిందే. అలాంటి ఈయనకు సినిమాలలో అవకాశాలు లభించాయి. అలా అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన యష్ (Yash), ప్రశాంత్ నీళ్ (Prashanth Neel) దర్శకత్వంలో కేజీఎఫ్ (KGF ) సినిమా చేసి సంచలనం సృష్టించారు. అంతేకాదు ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఈ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్ 2 చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేశారు. అంతేకాదు బాహుబలి2 చిత్రం తర్వాత స్థానాన్ని దక్కించుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు.
అలా కేజీఎఫ్ చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేశారు. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. నయనతార, యష్ కి సోదరి పాత్ర పోషిస్తోంది. వీరితోపాటు రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో మరొకవైపు యష్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. సాధారణంగా భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే మేకర్స్ అందులో నటించే హీరో లుక్ ను అధికారికంగా రివీల్ చేసే వరకు బయట ఎక్కడ కూడా వారు కెమెరా కంటికి చిక్కకూడదు అనే కండిషన్స్ పెడుతూ ఉంటారు. ఉదాహరణకు రాజమౌళి తన సినిమాలో హీరో లుక్ రివీల్ చేయకూడదని.. మహేష్ బాబుకు కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. అలా గీతూ మోహన్ దాస్ కూడా హీరో లుక్కుని దాచేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ గీతూ మోహన్ దాస్ చేసిన ప్లాన్ కి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. మొన్నామధ్య యష్ సిక్స్ ప్యాక్ బాడీ తో షర్ట్ లెస్ ఫోజుతో ఈ షూటింగ్ కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కన్నడ సినిమాటోగ్రాఫర్ గా కేజిఎఫ్, సలార్ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన భువన్ గౌడ పెళ్లిలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. లాంగ్ హెయిర్, స్టైలిష్ కళ్ళజోడుతో అమ్మాయిల మనసు దోచుకున్నారు. ఈ లుక్ ను బట్టి చూస్తే ప్రస్తుతం ఈయన టాక్సిక్ మూవీలో ఇదే లుక్ మెయింటైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా యష్ లుక్ ను అప్పుడప్పుడు ఇలా ఈవెంట్ల ద్వారా రివీల్ చేసి సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. అధికారికంగా రివీల్ చేయకుండానే ఇలా పరోక్షంగా సినిమాపై హైప్ పెంచుతున్న గీతూ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పథకాలపై వెంకట కే నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు అంతేకాదు భారీ బడ్జెట్తో కన్నడ, ఇంగ్లీషులో ఒకేసారి చిత్రీకరిస్తున్న మొదటి హై బడ్జెట్ ద్విభాషా చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.
