Begin typing your search above and press return to search.

'టాక్సిక్' బ్యూటీ కియారా అద్వాణీకి రాకింగ్ స్టార్ యష్ మ‌ద్ధ‌తు

ప్రసంగం మధ్యలో యష్ కియారా పేరు ఎత్తగానే.. ఆడియన్స్ నుంచి ఒక అభిమాని ఆమె నటించిన పాపులర్ పాటను గుర్తుచేస్తూ `తబాహి` అని గట్టిగా అరిచాడు.

By:  Sivaji Kontham   |   9 Aug 2026 2:51 PM IST
టాక్సిక్ బ్యూటీ కియారా అద్వాణీకి రాకింగ్ స్టార్ యష్ మ‌ద్ధ‌తు
X

బెంగళూరులో వైభవంగా జరిగిన `టాక్సిక్: ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్`ట్రైలర్ లాంచ్ వేడుక కేవలం ఒక ట్రైల‌ర్ ఆవిష్కరణగానే కాకుండా... ఎంతో భావోద్వేగానికి వేదికగా మారింది. `కేజీఎఫ్: ఛాప్టర్ 2` తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం రీ-ఎంట్రీ ఇస్తున్న రాకింగ్ స్టార్ యష్.. ఈ సినిమాలో తన సహనటి అయిన కియారా అద్వాణీ పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. త‌న‌కు బహిరంగంగా మద్దతు తెలిపడం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఈ కార్యక్రమంలో హీరో యష్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్, నిర్మాత వెంకట్ కే నారాయణలతో పాటు కథానాయికలు నయనతార, కియారా అద్వాణీ, తారా సుతారియా, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్ , యష్ సతీమణి రాధికా పండిట్, పెంపకందారు అనిల్ తడానీ, నటులు అక్షయ్ ఒబెరాయ్ తదితరులు పాల్గొన్నారు. వేదికపై యష్ మాట్లాడుతూ కియారా కష్టపడే తత్వాన్ని..ఈ ప్రాజెక్ట్ కోసం త‌న‌ శ్రమను ఆకాశానికెత్తారు.

ప్రసంగం మధ్యలో యష్ కియారా పేరు ఎత్తగానే.. ఆడియన్స్ నుంచి ఒక అభిమాని ఆమె నటించిన పాపులర్ పాటను గుర్తుచేస్తూ `తబాహి` అని గట్టిగా అరిచాడు. దానికి యష్ నవ్వుతూ `నిజంగానే తబాహి!` అని స్పందించడంతో ఆడిటోరియం అంతా నవ్వులతో నిండిపోయింది. ఆ తర్వాత యష్ మాట్లాడుతూ.. ``ట్రైలర్‌లో ప్రజలు చూసింది కియారా పాత్ర ఒక చిన్న మెరుపు మాత్రమే. ఈ సినిమా కోసం ఈ న‌టి చూపించిన అంకిత‌భావం.. పడ్డ కష్టం అసాధారణమైనవి`` అని కొనియాడారు.

సినిమా ట్రైల‌ర్ విడుదలైనప్పటి నుండి కియారా పాత్రపై నెటిజన్లు గుప్పిస్తున్న విమర్శల గురించి యష్ నేరుగా ప్రస్తావించారు. ``ఒక నటిగా నువ్వు కొన్ని అనవసరమైన విమర్శలను ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరం. కానీ ఆ నెగెటివిటీని నువ్వు అసలు పట్టించుకోవద్దు! నీ పనిని నువ్వు నమ్ముకో... తప్పకుండా ప్రేక్షకులు నిన్ను కొనియాడతారు. మనం కాలం కంటే కాస్త ముందున్నాం.. త్వరలోనే జనాలు దీని విలువ తెలుసుకుంటారు`` అంటూ కియ‌రాలో ధైర్యం నింపారు.

ఇక ఇదే వేదిక‌పై న‌య‌న‌తార స‌హా ప‌లువురు కియ‌రా అద్వాణీకి మ‌ద్ధ‌తుగా నిలిచారు. కియారాకు టాక్సిక్ ముందు టాక్సిక్ కి త‌ర్వాత అనేలా అద్భుత‌మైన పాత్ర ల‌భించింద‌ని న‌య‌న‌తార లాంటి సీనియ‌ర్ కితాబిచ్చారు. కియ‌రా స్వ‌యంగా త‌న స్పీచ్ లో ఈ సినిమాలో త‌న పాత్ర గొప్ప గుర్తింపును ఇస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్టు తెలిపారు.

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో యష్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. భారీ తారాగణం నటిస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం 26 ఆగస్ట్ 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.