ప్రపంచానికి మన సంస్కృతి, రామాయణం గొప్పతనాన్ని గట్టిగా వినిపిస్తున్న యష్
భారతీయ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచే `రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్` చిత్రం గ్లోబల్ ఆడియన్స్ ముందుకు అడుగుపెట్టిన వేళ.. రాకింగ్ స్టార్ యష్ పలికిన మాటలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతున్నాయి.
By: Sivaji Kontham | 28 Oct 2026 3:05 PM ISTభారతీయ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచే `రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్` చిత్రం గ్లోబల్ ఆడియన్స్ ముందుకు అడుగుపెట్టిన వేళ.. రాకింగ్ స్టార్ యష్ పలికిన మాటలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతున్నాయి. లాస్ ఏంజిల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో నిర్వహించిన ఈ గ్రాండ్ గ్లోబల్ ప్రీమియర్ వేడుకలో యష్ తన ఆలోచనలను ఎంతో పాజిటివ్‌గా, ఉద్వేగభరితంగా పంచుకున్నారు. శాండల్‌వుడ్ నుండి హాలీవుడ్ రెడ్ కార్పెట్ వరకు అతడు సాగించిన ప్రయాణం కేవలం ఒక నటుడి సక్సెస్ కథ మాత్రమే కాదు.. నమ్మకం, కష్టం ఉంటే ఎవరైనా అంతర్జాతీయ స్థాయిలో జెండా పాతవచ్చని నిరూపిస్తున్నారు.
ఈ వేడుకలో వేదికపైకి రాగానే హాలీవుడ్ ప్రముఖులు, గ్లోబల్ మీడియా ముందు యష్ సాంప్రదాయబద్ధంగా పలికిన `నమస్కార` అనే మాట ఆయనకు తన కన్నడ మూలాలపై ఉన్న అపారమైన ప్రేమను, భారతీయుడిగా ఉన్న గర్వాన్ని చాటిచెప్పింది. ప్రఖ్యాత నిర్మాత నమిత్ మల్హోత్రా పరిచయం చేసిన అనంతరం యష్ మాట్లాడుతూ..``మనం ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించామనేది.. మనం ఎంతటి దూరాలకు చేరుకోగలమనే విషయాన్ని ఎన్నటికీ నిర్దేశించలేదు`` అంటూ ఎంతో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి గ్లోబల్ వేదికను ఏలుతున్న ఒక సాధారణ యువకుడి ప్రయాణానికి ఈ మాటలు అద్దం పడుతున్నాయి.
భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో యష్ చూపిన చొరవ అభినందనీయం. రామాయణం గురించి అతడు మాట్లాడుతూ.. ``ఇది కేవలం ఒక కథ కాదు. తరతరాలుగా మన గుండెల్లో పదిలంగా దాచుకుని.. తర్వాతి తరాలకు అందిస్తున్న అమూల్యమైన సంస్కృతి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వైభవమైన రామాయణ కావ్యాన్ని నేడు ప్రపంచానికి పరిచయం చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు... మన వారసత్వం ప్రపంచానికి ఏం అందించగలవో చాటిచెప్పే సందేశం ఈ సినిమా ద్వారా అందుతుంది`` అని పాజిటివ్ ఆలోచనలను షేర్ చేసారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో యష్ కేవలం రావణాసురుడిగా శక్తివంతమైన పాత్రను పోషించడమే కాకుండా, తన `మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్` పతాకంపై నమిత్ మల్హోత్రాతో కలిసి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తించారు. యష్ కంబైన్డ్ విజన్, ఆయన ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత భారీ స్థాయిలో సాకారమైందని నమిత్ మల్హోత్రా కొనియాడారు. మొదటిసారి లాస్ ఏంజిల్స్‌లో కలిసినప్పుడే యష్ చెప్పిన మాటలు, ఆయనకున్న క్లారిటీనే తమ ఇద్దరినీ భాగస్వాములుగా మార్చిందని చెప్పడం యష్ లీడర్షిప్ క్వాలిటీస్కు అద్దం పడుతోంది.
రణ్‌బీర్ కపూర్ (శ్రీరాముడు), సాయి పల్లవి (సీతాదేవి), యష్ తన భార్య రాధికా పండిట్‌తో కలిసి హాజరైన ఈ ప్రీమియర్ వేడుకలో భారతీయులందరినీ గర్వపడేలా చేశారు. హాలీవుడ్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై మెరిసిపోవడం భారతీయ సినిమా సాధించిన గొప్ప విజయంగా నిలిచింది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఐదు ప్రధాన భాషల్లో విడుదల కానున్న `రామాయణం`, యష్ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
