Begin typing your search above and press return to search.

టాలీవుడ్ అగ్ర హీరోలకు KGF యష్ నేర్పిస్తున్న పాఠాలు!

ఇలా మన తెలుగు స్టార్లు ప్రయోగాలు చేస్తూ గ్లోబల్ ఐకాన్స్‌గా దూసుకుపోతున్న తరుణంలో వారికి కేజీఎఫ్ స్టార్ యష్ సరికొత్త పోటీని ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

By:  Sivaji Kontham   |   30 July 2026 12:20 PM IST
టాలీవుడ్ అగ్ర హీరోలకు KGF యష్ నేర్పిస్తున్న పాఠాలు!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ హీరోలు ఎందరో ఉన్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మేటి కథానాయకులుగా తమను తాము నిరూపించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతున్న మన గ్లోబల్ స్టార్లకు తోడుగా, దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న 'వారణాసి' చిత్రంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ గ్లోబల్ రేసులోకి అడుగుపెట్టారు. ఇలా మన తెలుగు స్టార్లు ప్రయోగాలు చేస్తూ గ్లోబల్ ఐకాన్స్‌గా దూసుకుపోతున్న తరుణంలో వారికి కేజీఎఫ్ స్టార్ యష్ సరికొత్త పోటీని ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 లాంటి రికార్డు బ్రేకింగ్ ఫ్రాంచైజీ చిత్రాల విజయంతో రెట్టింపు ఉత్సాహంలో ఉన్న యష్ ఆ తర్వాత తన తదుపరి సినిమాల ఎంపికలో చూపిస్తున్న పోటీతత్వం సర్వత్రా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇటీవల 'టాక్సిక్' ప్రాజెక్ట్‌తో పాటు ప్రతిష్టాత్మక 'రామాయణం' ఫ్రాంచైజీతో దేశ విదేశాలలో విపరీతమైన క్రేజ్‌ను సృష్టిస్తున్నారు. తాజాగా విడుదలైన 'రామాయణం' ట్రైలర్-1లో రావణుడిగా ఆయన ప్రదర్శించిన అసాధారణ నటనాభినవేశం, క్యారెక్టర్ సెలెక్షన్ అందరినీ కట్టిపడేసింది. ఒక నటుడిగానే కాకుండా.. నిర్మాతగా కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు టాలీవుడ్ అగ్ర హీరోలందరినీ మించి ఉన్నాయనే స్పష్టతను ఇస్తున్నాయి.

ఒక గొప్ప నటుడికి అత‌డిలోని అసలైన సామర్థ్యాన్ని (కాలిబ‌ర్) బయటకు తీసే సరైన పాత్ర దక్కడమే అత్యంత ముఖ్య‌మైన‌ది.. ఈ విషయాన్ని యష్ తన తాజా పాత్రల ఎంపిక ద్వారా మరోసారి ఘనంగా నిరూపించారు. కేవలం రొటీన్ మాస్ హీరో పాత్రలకే పరిమితం కాకుండా... విలక్షణమైన గ్రే షేడ్స్ ఉన్న నెగెటివ్ పాత్రలను కూడా అత్యంత శక్తివంతంగా పోషించడానికి అత‌డు ముందడుగు వేశారు. యష్ సాధిస్తున్న ఈ విజయాన్ని..అత‌డి ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇకపై మన బడా స్టార్లు కూడా తమ కథల ఎంపికలను రీవైండ్ చేసుకుని.. రీచెక్ చేసుకునే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.

ఇటీవలి కాలంలో తెలుగు హీరోల ఎంపికలు కూడా అసాధారణంగానే ఉన్నాయి. అవేమీ తీసిక‌ట్టుగా లేవు. పాన్ ఇండియా కథలు, పురాణేతిహాసాలు, మైథాలజీ, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ కథలపై మన స్టార్లు దృష్టి సారిస్తుండటం నిజంగా అభినందనీయం. అయితే అదే పురాణేతిహాసాల్లోని గొప్ప కథ `రామాయణం`లో అత్యంత సంక్లిష్టమైన రావణుడి పాత్రను ఎంచుకుని యష్ వీరందరికంటే ఒక అడుగు ముందే ఉన్నానని నిరూపించారు. విలన్ లేదా ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రను కూడా గ్లోబల్ స్థాయిలో షో స్టాపర్‌గా నిలపవచ్చని తన సెలెక్షన్‌తో చాటిచెప్పారు. కేవ‌లం ఎంపిక చేసుకున్న పాత్ర వ‌ల్ల‌నే కాదు.. అత‌డు 4000 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి ఒక నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం చూస్తుంటే అత‌డిలోని బాస్ వైబ్స్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఇది గ‌మ‌నించాక‌.. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు కేవ‌లం లీడ్ పాత్ర‌ల్లోనే కాదు.. నెగెటివ్ షేడ్ ఉన్న ప్ర‌తినాయ‌క‌ పాత్ర‌ల్లోను మెప్పించి త‌మ స్థాయిని విస్త‌రించాల‌నే అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే భారీ చిత్రాల్లో వారంతా భాగ‌మ‌వ్వాల‌ని, జాన‌ప‌దాలు- పౌరాణికాల్లోను ప్ర‌యోగాలు చేయాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల మధ్య నడుస్తున్నది అత్యంత ఆరోగ్యకరమైన పోటీ. ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందుతూ.. ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసి భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్తున్నారు. ఈ గ్లోబల్ రేసులో ఎవరు ఎలాంటి వ్యూహాలను, ఎత్తుగడలను అనుసరించి ప్రేక్షకులను మెప్పిస్తారనేది మునుముందు రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది.