Begin typing your search above and press return to search.

రాకింగ్ స్టార్ డైల‌మాలో ఉన్నాడా?

`కేజీఎఫ్` సిరీస్‌తో పాన్ ఇండియా లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ కెరీర్‌లో కీలకమైన మలుపులో ఉన్నారు.

By:  Srikanth Kontham   |   13 Oct 2026 4:00 AM IST
రాకింగ్ స్టార్  డైల‌మాలో ఉన్నాడా?
X

`కేజీఎఫ్` సిరీస్‌తో పాన్ ఇండియా లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ కెరీర్‌లో కీలకమైన మలుపులో ఉన్నారు. `కేజీఎఫ్ 2` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత యశ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే దానిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాల మధ్య మలయాళ మూలాలున్న లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో `టాక్సిక్` సినిమాను అనౌన్స్ చేయడం.. ఆ ప్రాజెక్ట్ తెరపైకి రావడం జరిగి పోయాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలే కపోవడంతో యశ్ తదుపరి సినిమాల ఎంపికపై సందిగ్ధత నెల‌కొంది.

గీతూ మోహన్‌దాస్‌పై నమ్మకంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన `టాక్సిక్` ఫలితం ఆశించిన విధంగా రాకపోవడంతో, రాకింగ్ స్టార్ ఆలోచనా విధానంలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. క్రియేటివ్ అప్రోచ్‌కు వెళ్లాక జరిగే రిస్క్ ఏంటో? ఈ అనుభవంతో యశ్‌కు క్లారిటీ వచ్చింది. దీంతో తదుపరి చిత్రాల విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దర్శకుల ఎంపిక విషయంలో య‌శ్ గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో యశ్ తదుపరి సినిమాల కోసం ఎవరిని ఎంచుకోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారుట‌. మళ్లీ సొంత పరిశ్రమ అయిన కన్నడ దర్శకులకే ప్రాధాన్యత ఇవ్వాలా? లేక కమర్షియల్ మాస్ సినిమాలను అద్భుతంగా డీల్ చేయడంలో పేరున్న టాలీవుడ్ దర్శకులతో పని చేయాలా? అనే మీమాంసలో పడ్డారుట‌. కన్నడ నేల నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినా? టాలీవుడ్ ఇస్తున్న సపోర్ట్.. ఇక్కడి డైరెక్టర్ల బాక్సాఫీస్ విజన్ రీత్యా టాలీవుడ్ వైపు మొగ్గు చూపడం బెటర్ అనే ఆలోచనలో యశ్ ఉన్నట్లు స‌మాచారం.

టాలీవుడ్ దర్శకులు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను, మాస్ మానియాని ఎలివేట్ చేసే తీరు పాన్ ఇండియా ప్రేక్షకులకు నచ్చుతుంది. యశ్ లాంటి హై-వోల్టేజ్ మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి తెలుగు టెక్నీషియన్లు .. డైరెక్టర్లు అయితేనే సరైన జస్టిఫికేషన్ చేయగలరని య‌శ్ సన్నిహితులు కూడా సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు యశ్‌కు కథలను వినిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే కన్నడ ఆడియెన్స్ నమ్మకాన్ని నిలబెట్టాలనే బాధ్యత కూడా ఆయనపై ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోవాలో? తెలియక సతమతమవుతున్నారు.

గీతూ మోహన్‌దాస్‌తో చేసిన ప్రయోగం వికటించడంతో ఇకపై పంథాను మార్చుకోవాలని యశ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రయోగాల కంటే పక్కా కమర్షియల్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే కన్నడ నాట కొత్త టాలెంట్‌ను నమ్ముతారా? లేక తెలుగు బాట పట్టి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తారా? అనేది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.