AI ముప్పు: ఓవైపు జాన్వీ అలా- మరోవైపు యామీ ఇలా!
సినీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సెలబ్రిటీలకు కొత్తగా ముప్పుతిప్పలు ఎదురవుతున్నాయి.
By: Sivaji Kontham | 5 Oct 2026 12:35 AM ISTసినీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సెలబ్రిటీలకు కొత్తగా ముప్పుతిప్పలు ఎదురవుతున్నాయి. ఓవైపు జాన్వీ కపూర్ మార్ఫింగ్ - డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోల గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుండగా.. మరోవైపు ప్రముఖ బాలీవుడ్ నటి యామీ గౌతమ్ దీనిపై బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తన ఫోటోలను ఏఐ ఫిల్టర్లు, ఎన్‌హాన్స్‌మెంట్ టూల్స్ ఉపయోగించి మార్చవద్దంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
పాపులర్ స్టిల్ ఫోటోగ్రాఫర్ల సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వైరల్ అయిన ఈ ప్రకటనపై నెటిజన్లు, అభిమానుల నుంచి విభిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. చాలామంది ఈ చర్యను స్వాగతిస్తూ.. ఏఐ ద్వారా జరిగే అనధికారిక మార్ఫింగ్‌పై యామీ ధైర్యంగా గళం విప్పడం అభినందనీయమని కొనియాడారు. అయితే కేవలం ఇలాంటి విజ్ఞప్తులతో సోషల్ మీడియా వినియోగదారులు మారరని.. భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరించాలని కొందరు సూచించారు.
సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులు, ప్రైవసీని కాపాడుకునే విషయంలో జాన్వీ కపూర్, యామీ గౌతమ్ లాంటి ప్రముఖులందరూ త్వరలోనే మరింత గట్టిగా పోరాడే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలువురు పెద్ద స్టార్ హీరోహీరోయిన్లు తమ వ్యక్తిగత హక్కుల(పర్సనాలిటీ రైట్స్)ను కాపాడుకునేందుకు కోర్టులను ఆశ్రయించి సానుకూల తీర్పులు కూడా తెచ్చుకున్నారు. సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి రూపాన్ని, వాయిస్‌ను వాణిజ్యపరంగా లేదా ఏఐ మార్ఫింగ్ కోసం వాడటం చట్టరీత్యా నేరమనే అభిప్రాయం బలపడుతోంది.
వైరల్ అయిన ఈ పోస్ట్ కామెంట్స్‌లో పలు ఆసక్తికరమైన చర్చలు కూడా నడిచాయి. పబ్లిక్ రిక్వెస్ట్‌లతో పాటు తమ వ్యక్తిగత భద్రత కోసం యామీ వెంటనే హైకోర్టును ఆశ్రయించాలని కొందరు అభిమానులు సలహా ఇస్తే, మరికొందరు ఆమె భర్త, దర్శకుడు ఆదిత్య ధర్ గత చిత్రాల నేపథ్యాన్ని ఉద్దేషించి సరదాగా సెటైర్లు వేశారు. అలాగే బాలీవుడ్‌లో డిజిటల్, ఏఐ మార్ఫింగ్ దుర్వినియోగంపై తొలిసారిగా గళం విప్పిన వారిలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారని కొందరు గుర్తుచేశారు.
మొత్తానికి ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఊహాతీతమైన ప్రమాదం తారలకు నిద్రలేకుండా చేస్తోంది. కేవలం సోషల్ మీడియాలో రిక్వెస్ట్‌లు పెడితే సరిపోదని.. భవిష్యత్తులో డిజిటల్ ఫోర్జరీలను అరికట్టడానికి మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు అవసరమని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్‌పై మునుముందు రోజుల్లో చట్టపరమైన పోరాటాలు మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
