దురంధర్: భార్య ప్రేమ అండదండల విలువ 3000 కోట్లు!
నిజానికి యామి గౌతమ్ అందించిన ఆ ప్రేమ, నమ్మకం విలువ వెలకట్టలేనిది. కొందరు దీనిని 3000 కోట్ల విలువైన అండగా అభివర్ణిస్తున్నారు.
By: Sivaji Kontham | 22 March 2026 2:00 PM ISTప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా దురంధర్ గురించిన మాటే వినిపిస్తోంది. ముఖ్యంగా దురంధర్, దురంధర్ 2 చిత్రాల విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అద్భుత దృశ్యకావ్యాల వెనుక ఉన్న అసలైన శక్తి ఆదిత్యాధర్. ఆయన అసాధారణమైన రచనా నైపుణ్యం, దర్శకుడిగా అతడి ప్రతిభ ఈ రెండు సినిమాలను భారతదేశంలోని అత్యుత్తమ చిత్రాల జాబితాలో నిలబెట్టాయి. ఒక రచయితగా దురంధర్ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఎంపిక చేయడంలోనే ఆదిత్యాధర్ తన అభిరుచిని, సృజనాత్మకతను చాటుకున్నారు.
శత్రుదేశ రాజకీయాల్లో కల్లోలం సృష్టించి, అక్కడ గూండాయిజాన్ని సర్వనాశనం చేస్తూ ఉగ్రమూకలను వారి గడ్డపైనే మట్టుబెట్టే ఒక ఇండియన్ స్పై కథతో ఆదిత్యాధర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సినిమా ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా.. ఇలాంటి ఎత్తుగడలు మరొకరికి సాధ్యం కావేమో అన్నంతగా ఆయన తన మేకింగ్ క్వాలిటీని ప్రదర్శించారు. ముఖ్యంగా ఆయన టేకింగ్, మ్యూజిక్ సెన్స్ ప్రతి ఒక్కరి హృదయాలను కట్టిపడేశాయి. నటీనటుల నుండి అద్భుతమైన పనితనాన్ని రాబట్టుకోవడంలో ఆయన సఫలీకృతమయ్యారు. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే దురంధర్ ఫ్రాంఛైజీ ఒక మైలురాయిగా నిలిచిపోయిందంటే అది ఆదిత్యాధర్ చలవే.
ఆదిత్యాధర్ ప్రయాణాన్ని గమనిస్తే.. ఆయన ఎదుగుదల ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఊరి - ది సర్జికల్ స్ట్రైక్స్ సినిమా తీసే సమయానికి ఆయన ఒక సామాన్య రచయితగా బాలీవుడ్ ఇన్‌సైడ్ వర్గాలకు మాత్రమే తెలుసు. దేశవ్యాప్తంగా ఆయనకు ఎలాంటి గుర్తింపు లేదు. కానీ తన మొదటి సినిమా ఊరి విడుదలతోనే ఆయన ఒక సంచలనంగా మారారు. ఇప్పుడు దురంధర్ ఫ్రాంఛైజీతో దర్శకుడిగా మరో స్థాయిని చూపిస్తూ బాలీవుడ్ చిత్రాల వాణిజ్య దాహాన్ని తీర్చారు. కమర్షియల్ సక్సెస్‌లో కింగ్ సైజ్ విజయాలను అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ అద్భుతమైన జైత్ర యాత్రలో ఆదిత్యాధర్ భార్య, నటి యామి గౌతమ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఆదిత్యాధర్ కష్టాల్లో ఉన్న సమయంలో ఒక దేవతలా ఆయన జీవితంలోకి యామి గౌతమ్ ప్రవేశించారు. అప్పట్లో ఆయనకు పెద్దగా పేరు ప్రఖ్యాతలు లేకపోయినా, తనలోని ప్రతిభను గుర్తించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త ఆశయాలకు వెన్నుదన్నుగా ఉంటూ అతడి విజయాల్లో భాగస్వామి అయ్యారు. ఆమె అండదండలు, నిరంతర ప్రోత్సాహం వల్లే ఆదిత్యాధర్ నేడు దురంధర్ వంటి భారీ ప్రాజెక్టులను ఇంతటి ఉన్నత స్థాయికి చేర్చగలిగారు.
నిజానికి యామి గౌతమ్ అందించిన ఆ ప్రేమ, నమ్మకం విలువ వెలకట్టలేనిది. కొందరు దీనిని 3000 కోట్ల విలువైన అండగా అభివర్ణిస్తున్నారు. దురంధర్ చిత్రం 1200కోట్లు వసూలు చేయగా, ఇప్పుడు దురంధర్ 2 చిత్రం 2000 కోట్లు పక్కా వసూల్ అన్న చర్చ సాగుతోంది. అంటే ఈ రెండు సినిమాలు కలిపి 3000 కోట్ల బెంచ్ మార్క్ ను అందుకోవడం అసాధారణమైనది. ఒక వ్యక్తి తనపై నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే ఇలాంటి సంచలనాలను సృష్టించగలడు. ఆదిత్యాధర్ ప్రతిభకు యామి గౌతమ్ తోడవ్వడం వల్ల నేడు ఈ విజయాలు సాధ్యమయ్యాయని అంతా నమ్ముతున్నారు. అద్భుతమైన కంటెంట్, క్వాలిటీతో దురంధర్ ఫ్రాంఛైజీ భారతీయ సినిమా కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తోంది.
