నటులవ్వాలనుకునే వారికి యామీ గౌతమ్ ధైర్యం!
బాలీవుడ్ నటి యామీ గౌతమ్ మరోసారి జాతీయ ఉత్తమ నటి చలనచిత్ర పురస్కారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 24 Sept 2026 12:00 AM ISTబాలీవుడ్ నటి యామీ గౌతమ్ మరోసారి జాతీయ ఉత్తమ నటి చలనచిత్ర పురస్కారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2024 లో విడుదలైన `ఆర్టికల్ 370` చిత్రంలో యామీగౌతమ్ అత్యుత్తమ నటనకు గానూ ఈ గౌరవం లభించింది. గుజరాత్‌లోని కేవడియా లో ఘనంగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా యామీ ఈ అవార్డును అందుకున్నారు.
పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం యామీ గౌతమ్ తన భావోద్వేగాలను మీడియాతో పంచుకున్నారు. జీవితాంతం శ్రమించే ఏ కళాకారుడికైనా జాతీయ అవార్డు దక్కడం ఎంతో గర్వకారణమని ఇదొక గొప్ప గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ అద్భుతమైన క్షణాన్ని తానింకా సంపూర్ణంగా ఆస్వాదించే ప్రయత్నంలోనే ఉన్నానని, దేశ అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం తనకు అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా గొప్ప కలలతో ముంబై నగరం బాట పట్టే వేలాది మంది ఔత్సాహిక నటులు , అవుట్‌సైడర్స్ కోసం యామీ ఓ స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. `భవిష్యత్తు మన కోసం ఏం దాచి ఉంచిందో ఎవరికీ తెలియదు. కాబట్టి పట్టువదలకుండా నిరంతరం కష్టపడండి. మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి... ఏదో ఒక రోజు తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది` అని కలలు కనే ప్రతీ ఒక్కరి తన తరఫున ధైర్యం చెప్పారు.
ఈ విజయం అభించినా? తన నటనా ప్రయాణంలో నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని యామీ గౌతమ్ ఎంతో వినయంగా స్పందించారు. `నేను ఇప్పుడు ఏ స్థాయికి చేరుకున్నానో నాకు తెలియదు కానీ నా ప్రయాణంలో ఇంకా ఎంతో నేర్చుకోవాలి. ఎన్నో విభిన్న పాత్రలలో నటించాల్సి ఉంది` అని అన్నారు. అలాగే ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశంలో పురస్కారాన్ని అందుకోవడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
అవార్డు ప్రధానోత్సవ వేడుకలో యామీ గౌతమ్ చిరునవ్వుతో భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్కరిస్తూ వేదికపైకి వెళ్లి అవార్డును స్వీకరించారు. ఆ సమయంలో సభలోని ప్రేక్షకుల మధ్య ఉన్న ఆమె భర్త, దర్శకుడు-నిర్మాత ఆదిత్య ధర్ ఎంతో గర్వంతో ఈ దృశ్యాన్ని తిలకించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భార్య అవార్డు అందుకుంటున్న క్షణాలను ఆయన ఎంతో ఆనందంతో వీక్షించారు.
ఆదిత్య సుహాస్ జంభాలే దర్శకత్వంలో తెరకెక్కిన `ఆర్టికల్ 370` చిత్రం 2024 లో విడుదలైన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వెనుక జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రంలో యామీ గౌతమ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించారు. ఆదిత్య ధర్, జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.
