యామీ గౌతమ్ - ఆదిత్య ధర్ రూమర్లకు చెక్!
బాలీవుడ్‌లో మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నటి యామీ గౌతమ్ -దర్శకుడు ఆదిత్య ధర్ దంపతుల చుట్టూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
By: Srikanth Kontham | 6 Oct 2026 8:00 PM ISTబాలీవుడ్‌లో మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నటి యామీ గౌతమ్ -దర్శకుడు ఆదిత్య ధర్ దంపతుల చుట్టూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబై మహానగరాన్ని పూర్తిగా వీడి తమ మాతృభూమి అయిన హిమాచల్ ప్రదేశ్‌లో శాశ్వతంగా స్థిరపడాలని ఈ జంట నిర్ణయించుకుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్లపై ఎట్టకేలకు స్పందించిన ఆదిత్య ధర్ అధికారిక బృందం వాటిలో ఎలాంటి నిజం లేదని పుకార్లకు చెక్ పెట్టింది.
ఈ వివాదానికి అసలు కారణం యామీ గౌతమ్ జీవన శైలి అని చెప్పొచ్చు. ముంబై సినీ పరిశ్రమలోని బిజీ లైఫ్‌కు కొంత విరామం ఇస్తూ యామీ తరచూ స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన ప్రకృతి ఒడిలో గడపడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. పచ్చని వాతావరణం, పర్వతాల మధ్య ప్రశాంతమైన జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే యామీ ముంబైని విడిచిపెట్టేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.
అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలన్నీ పూర్తిగా నిరాధారమైనవని ఆదిత్య ధర్ ప్రతినిధి బృందం కుండబద్దలు కొట్టింది. ఆ దంపతులు ముంబైని వదిలి వెళ్లడం లేదని, సినిమాల పరంగా తమ వర్క్ కమిట్‌మెంట్స్ అన్నీ ముంబై కేంద్రంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కేవలం తమ వ్యక్తిగత ప్రయాణాల్లో భాగంగా, ప్రశాంతత కోసం హిమాచల్ వెళ్లడం జరుగుతుందే తప్ప అక్కడ శాశ్వతంగా స్థిరపడే ఆలోచన ప్రస్తుతానికి లేదని తేల్చిచెప్పారు.
వృత్తిపరంగా చూస్తే యామీ గౌతమ్, ఆదిత్య ధర్ ఇద్దరూ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. వివాహం తర్వాత కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న జోడీ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు పెద్దపీట వేస్తోంది. ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలోనూ, దర్శకత్వ పనుల్లోనూ తలమునకలై ఉండగా, యామీ కూడా విభిన్న కథా పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముంబైలో ఉండటం ఎంత అవసరమో వారికి తెలుసు.
ఇక సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు రావడం కొత్తేమీ కాదు. చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తూ ప్రచారం చేయడం ట్రెండ్ అయిపోయింది. సెలబ్రిటీలు కుటుంబంతో గడిపే సమయాన్ని ..ప్రయాణాలను కూడా తప్పుగా అర్థం చేసుకుని పుకార్లు సృష్టిస్తుంటారు. తాజా ఘటనతోనైనా ఇలాంటి నిరాధారమైన వదంతులకు ఫుల్‌స్టాప్ పడుతుందని అభిమానులు భావిస్తున్నారు.
అంతిమంగా యామీ గౌతమ్ - ఆ దిత్య ధర్ జంట ముంబైని వీడుతున్నారనే వార్తల్లో ఎలాంటి సత్యం లేదని స్పష్టమైంది. ముంబైలో తమ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం కేటాయిస్తున్నారు.
