13 ఏళ్ల నిరీక్షణకు తెర.. వరల్డ్ వార్ Z సీక్వెల్‌తో బ్రాడ్ పిట్ భారీ కంబ్యాక్!
గతంలో ఈ సీక్వెల్‌కు దర్శకుడు డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చినా? వ్యయ అంచనాలు , ఇతర కారణాల వల్ల 2019లో ఆ ప్రతిపాదన రద్దయింది.
By: Srikanth Kontham | 19 Sept 2026 5:00 PM ISTప్రముఖ హాలీవుడ్ కథానాయకుడు బ్రాడ్ పిట్ అభిమానులకు తీపి కబురు అందింది. 2013లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రాణాంతక జాంబీ థ్రిల్లర్ `వరల్డ్ వార్ Z` కి ఎట్టకేలకు సీక్వెల్ పట్టాలెక్కబోతోంది. ఈ సీక్వెల్‌లో బ్రాడ్ పిట్ మళ్లీ జెర్రీ లేన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గ్రహీత, జర్మన్ దర్శకుడు ఎడ్వర్డ్ బెర్గర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ధృవీకరించింది.
మ్యాక్స్ బ్రూక్స్ రాసిన నవల ఆధారంగా 2013లో విడుదలైన మొదటి `వరల్డ్ వార్ Z` చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో 540 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన జాంబీ సినిమాగా చరిత్ర సృష్టించిన ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని నిర్మాతలు దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనేక సాంకేతిక సవాళ్లు, బడ్జెట్ కారణాల వల్ల ప్రాజెక్ట్ సుదీర్ఘ కాలం పాటు వాయిదా పడుతూ వచ్చింది.
గతంలో ఈ సీక్వెల్‌కు దర్శకుడు డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చినా? వ్యయ అంచనాలు , ఇతర కారణాల వల్ల 2019లో ఆ ప్రతిపాదన రద్దయింది. దీంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని భావించిన అభిమానులకు, పారామౌంట్ పిక్చర్స్ యంత్రాంగం సీక్వెల్‌ను హై ప్రయారిటీ గా భావించి మళ్లీ పట్టాలెక్కించడం ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోంది.
సీక్వెల్‌ను డైరెక్ట్ చేయనున్న ఎడ్వర్డ్ బెర్గర్ `ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్` చిత్రంతో ఆస్కార్ అవార్డును గెలుచుకోవడమే కాకుండా? ఇటీవల `కాంక్లేవ్` చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బ్రాడ్ పిట్, ఎడ్వర్డ్ బెర్గర్‌లు ఇప్పటికే `ది రైడర్స్` అనే సైకలాజికల్ థ్రిల్లర్ కోసం కలిసి పనిచేశారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే `వరల్డ్ వార్ Z` సీక్వెల్ ఐడియాను బెర్గర్‌కు బ్రాడ్ పిట్ ప్రతిపాదించినట్లు సమాచారం.
ప్రాజెక్ట్‌కి ప్రసిద్ధ బ్రిటిష్ రచయిత డెనిస్ కెల్లీ స్క్రిప్ట్ అందిస్తుండగా బ్రాడ్ పిట్‌కు చెందిన ప్లాన్ బి ఎంటర్‌టై న్‌మెంట్ తో కలిసి పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం సినిమా కథాంశం , విడుదల తేదీకి సంబంధించిన వివరాలను చిత్ర బృందం అత్యంత గోప్యంగా ఉంచింది. మొదటి భాగంలో ప్రపంచాన్ని కాపాడిన జెర్రీ లేన్ సీక్వెల్‌లో ఎలాంటి విపత్తును ఎదుర్కోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెరకెక్కనున్న సీక్వెల్ హాలీవుడ్ వర్గాల్లో -గ్లోబల్ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఎడ్వర్డ్ బెర్గర్ విజనరీ మేకింగ్, బ్రాడ్ పిట్ స్టార్‌డమ్ , ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్ తోడైతే, ఈ చిత్రం మరోసారి అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
