టాప్ స్టోరి: నటీమణులపై అనధికారిక బ్యాన్! అసలేం జరిగిందంటే?
బాలీవుడ్‌లో `మీటూ` ఉద్యమానికి నాంది పలికిన తనూశ్రీ దత్తా ఉదంతమే దీనికి ఒక పెద్ద ఉదాహరణ.
By: Sivaji Kontham | 25 May 2026 11:12 AM ISTగ్లామర్ ప్రపంచంలో ఎన్నో చీకటి కోణాలు.. నిశ్శబ్ద యుద్ధాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా తెరవెనక జరిగే అన్యాయాలపై.. సహచర నటీనటులు .. దర్శకులు లేదా ఇతరుల వేధింపులపై నోరు విప్పే నటీమణులను ఇండస్ట్రీ పట్టించుకునే పరిస్థితి ఉండదా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. హక్కుల కోసం పోరాడే వారిని.. వ్యవస్థలోని లొసుగులను ప్రశ్నించే వారిని అహంకారులు అని.. సమస్యలు సృష్టించేవారు! అని ముద్ర వేసి వారికి అవకాశాలు రాకుండా పక్కన పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ధైర్యంగా బయటపెట్టినందుకు కెరీర్ పరంగా భారీ మూల్యాన్ని చెల్లించుకున్న నటీమణుల కథలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతున్నాయి.
బాలీవుడ్‌లో `మీటూ` ఉద్యమానికి నాంది పలికిన తనూశ్రీ దత్తా ఉదంతమే దీనికి ఒక పెద్ద ఉదాహరణ. షూటింగ్ సెట్స్‌లో ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ తనను వేధించాడని ఉత్తరాది నటి తనూశ్రీ దత్తా ధైర్యంగా ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత తనకు బాలీవుడ్ లో సినిమా అవకాశాలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అన్సిబా హాసన్ కూడా తన సహనటుడు టినీ టామ్ నుంచి ఎదుర్కొన్న కక్ష సాధింపు చర్యల గురించి ఇటీవల బహిరంగంగానే మాట్లాడారు. ప్రముఖ మాలీవుడ్ నటిపై జరిగిన దారుణ అత్యాచార ఘటన తర్వాత.. మలయాళ ఇండస్ట్రీలోనే మహిళా హక్కుల కోసం.. తోటి నటీమణుల రక్షణ కోసం పోరాడిన పార్వతి తిరువోతు సైతం ప్రస్తుతం తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలోని పెద్దల కక్ష సాధింపు వల్లనే తనకు అవకాశాలు తగ్గాయని పార్వతి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు దర్శకుడిపై ఆరోపించిన కన్నడ నటి శ్రుతి కి కూడా అవకాశాలు తగ్గాయని ఆవేదన చెందారు. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ కం గాయని చిన్మయి శ్రీపాద ప్రముఖ లిరిసిస్టు వైరముత్తుపై ఆరోపించిన తర్వాత ఇండస్ట్రీ వర్గాలు దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల పలువురు తెలుగమ్మాయిలు (నటీమణులు) కాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా కామెంట్లు చేయడంతో సరైన అవకాశాల్లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్టు ఫిలింనగర్ లో గుసగుసలు ఉన్నాయి.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా టాలీవుడ్‌లో వేధింపులు లేదా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి కెరీర్‌ను కోల్పోయిన వారిలో నటి శ్రీరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇండస్ట్రీలోని పెద్దలపై తిరుగుబాటు చేసినందుకు ఈ నటిని తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపు పూర్తిగా దూరం పెట్టింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుండి కూడా శ్రీరెడ్డి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం తనకు తెలుగు సినిమాల్లో అవకాశాలు దాదాపు శూన్యమనే చెప్పాలి.
మరో సౌత్ ఇండియన్ నటి మాధవి లత కూడా ఇండస్ట్రీలోని ఇలాంటి చీకటి కోణాలపై గళమెత్తారు. కాస్టింగ్ కౌచ్‌ను వ్యతిరేకిస్తూ.. ఇండస్ట్రీలో నటీమణులకు జరుగుతున్న అన్యాయాలపై మాధవి లత పలు ఇంటర్వ్యూలలో నిర్మొహమాటంగా మాట్లాడారు. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోవడం... ఇక్కడి లొసుగులను ప్రశ్నించడం వల్లే తనకు నటిగా మంచి ప్రతిభ ఉన్నా అవకాశాలు ఇవ్వకుండా తొక్కేసారని ఆమె పలు సందర్భాల్లో ఆరోపించారు. ప్రశ్నించే నటీమణులను ఇండస్ట్రీ ఒక ముఠాగా ఏర్పడి ఎలా పక్కన పెడుతుందో మాధవీలత తన అనుభవాల ద్వారా వివరించారు. మీటూ తరహా ఆరోపణలు కాదు కానీ దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఫిలింమేకింగ్ శైలిని వివాదాస్పదం చేసిన కారణంగా తాప్సీ పన్ను లాంటి ట్యాలెంటెడ్ హీరోయిన్ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా, పూర్తిగా సౌత్ లోనే అవకాశాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
సినిమా ఇండస్ట్రీలో వేధింపులకు, వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడే మహిళలను `యారొగెంట్` అని ముద్ర వేసి దూరం పెట్టడం వల్ల ప్రతిభావంతులైన ఎందరో నటీమణులు తమ కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వస్తోంది. నిజానికి ఇలా అవకాశాలు కోల్పోయిన వారిలో చాలామంది ``మాకు ఛాన్సులివ్వడం లేద``ని బయటకు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే అలా చెప్తే మిగిలిన కొద్దిపాటి అవకాశాలు కూడా రాకుండా పోతాయనే భయం. తప్పును ప్రశ్నించిన వారిని ఇండస్ట్రీ వెలివేయడం అనేది ఇతర నటీమణులు నోరు విప్పకుండా భయపెట్టే ఒక వ్యూహాత్మక చర్యగానే చూడాల్సి ఉంటుంది. ఇటీవల మలయాళ నటి తన సహనటుడు, ఆర్టిస్టుల సంఘం సహచర సభ్యుడు టినీ టామ్‌పై అన్సిబా హాసన్ ఫిర్యాదు చేయడమే గాక పరిశ్రమలో అవకాశాలు తగ్గడంపైనా ఆవేదన చెందారు. అధిక పారితోషికాలు, అపరిమిత డిమాండ్ల కారణంగా బ్యాన్ కి గురవ్వడం వేరు.. ఇతర కారణాలతో ఆరోపించడం వేరు. ఈ రెండో కోణంలో పలువురు కథానాయికలు, నటీమణులు చాలా అవకాశాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. అయితే దీని నుంచి మహిళా నటీమణులను కాపాడేందుకు పరిశ్రమలో ఏర్పాటు చేసిన మహిళా కమిటీలు, కమీషన్లు ఏం చేస్తున్నాయన్నది ఎవరికీ అర్థం కాదనే విమర్శలున్నాయి.
