టాలీవుడ్‌లో మహిళా కొరియోగ్రాఫర్లను అణిచేస్తున్నారా?
పని ప్రదేశంలో మహిళల భద్రత విషయంలో ఇన్ సెక్యూర్డ్ గ్లామర్ రంగం అనే అభిప్రాయం ఇప్పటికీ పేరెంట్ ని వేధిస్తూనే ఉంది.
By: Sivaji Kontham | 27 Jun 2026 8:00 AM ISTచిత్ర పరిశ్రమ ఎంతగా అధునాతన సాంకేతికతతో మోడ్రనైజ్డ్ అయినా కొన్ని రంగాలలో ఇప్పటికీ పురుషాధిక్యత, పాత ఆలోచనా ధోరణులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సినిమా కొరియోగ్రఫీ లేదా డాన్స్ విభాగంలో ఒక మహిళా డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా రాణించడం వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు దాగి ఉన్నాయి. ఒకప్పుడు ఆడపిల్లలు డాన్స్ ఫీల్డ్‌లోకి వస్తామంటే సమాజంలో పరిశ్రమలో ఉన్న ఒక రకమైన `నెగెటివ్ మైండ్‌సెట్` వల్ల తల్లిదండ్రులు సైతం ఇందులో భవిష్యత్తు ఉంటుందో లేదో అని భయపడి తిరస్కరించేవారు. పని ప్రదేశంలో మహిళల భద్రత విషయంలో ఇన్ సెక్యూర్డ్ గ్లామర్ రంగం అనే అభిప్రాయం ఇప్పటికీ పేరెంట్ ని వేధిస్తూనే ఉంది. ఇలాంటి సామాజిక అడ్డంకులు, ఇబ్బందులు ఎన్నో ఎదురైనా ఎంతో మంది మహిళలు కేవలం తమకున్న పట్టుదల, కట్టుబాటుతో వాటన్నింటితో పోరాడి ఇండస్ట్రీలో నిలబడుతున్నారు. కొందరైతే డాన్స్ వదిలేయాల్సి వస్తే తమ ఊపిరి ఆగిపోయినట్లేనని భావించే అంతగా ఈ రంగాన్ని ప్రేమిస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో ఈ పరిస్థితిలో కొంత సానుకూల మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశాలలో డాన్సర్లకు ఉన్న అపారమైన డిమాండ్ కారణంగా... వారు కార్పొరేట్ ఉద్యోగాల కంటే కూడా ఎక్కువగానే సంపాదిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. దీనివల్ల ఇప్పుడిప్పుడే సమాజంలో వారికి ఒక మంచి గుర్తింపు, విలువ లభిస్తున్నాయి. కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాకుండా వ్యక్తిగత జీవితంలో కుటుంబ మద్దతు.. ముఖ్యంగా కొత్తతరహా ఆలోచనలు ఉన్న భాగస్వామి లభించడం కూడా మహిళా టెక్నీషియన్ల విజయానికి ఎంతో కీలకంగా మారుతోంది. సాక్షాత్తు నటరాజ స్వామి స్వరూపమైన ఒక `డాన్స్ పార్టనర్` భర్తగా రావడం వల్ల కెరీర్‌లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా డాన్స్ రంగాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు వీలుపడుతోందని ఇటీవల మెగాస్టార్ కి కొరియోగ్రాఫ్ చేస్తున్న ఒక లేడి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది. కానీ ఆ లేడి కొరియోగ్రాఫర్ ఒక పెద్ద హీరో సినిమా బాధ్యతల్ని పూర్తిగా తానే నిర్వర్తించే అవకాశం ఇప్పుడే లేనే లేకపోవడం ఆశ్చర్యకరం.
అయితే ఇంతటి సాంకేతిక, ఆర్థిక పరమైన మార్పులు వస్తున్నా... ప్రధాన స్రవంతి సినిమాలలో మహిళా కొరియోగ్రాఫర్లకు `క్రియేటివ్ లీడర్‌షిప్` లేదా పెద్ద హీరోల చిత్రాలకు ప్రధాన కొరియోగ్రాఫర్‌గా చేసే అవకాశం దక్కకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది `మాస్ అండ్ యాక్షన్` ఇమేజ్... కమర్షియల్ ఈక్వేషన్స్ ప్రధానమైనది. మన చిత్ర పరిశ్రమలో భారీ మాస్ స్టెప్పులు, హై-ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్ అనగానే అవి కేవలం మేల్ కొరియోగ్రాఫర్లు మాత్రమే కంపోజ్ చేయగలరనే ఒక మూస పద్ధతి బలంగా నాటుకుపోయింది. దీనివల్ల మహిళా కొరియోగ్రాఫర్లను ఎక్కువగా క్లాసికల్, మెలోడీ, లేదా హీరోయిన్ల సోలో గ్లామర్ సాంగ్స్‌కే పరిమితం చేసే ధోరణి కనిపిస్తోందనే ఆవేదన పలువురు లేడి కొరియోగ్రాఫర్లలో కనిపిస్తోంది. ఫలితంగా పెద్ద హీరోల కమర్షియల్ మాస్ సాంగ్స్ చేసే అవకాశం వారికి చాలా అరుదుగా లభిస్తోంది.
మరో ప్రధానమైన కారణం ఇండస్ట్రీలో ఉండే నెట్‌వర్కింగ్- కంఫర్ట్ జోన్ ... సినిమా పరిశ్రమలో అవకాశాలు అనేవి కేవలం ప్రతిభపైనే కాకుండా దర్శకులు, నిర్మాతలు, హీరోలతో ఉండే వ్యక్తిగత పరిచయాలపై ఆధారపడి ఉంటాయి. నైట్ షూట్స్, సుదీర్ఘమైన ఔట్‌డోర్ షెడ్యూల్స్ సమయంలో మేల్ కొరియోగ్రాఫర్లు హీరోలు, దర్శకులతో కలిసి సులభంగా ఒక కంఫర్ట్ జోన్‌ను ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఈ విధమైన వాతావరణం వల్ల పెద్ద ప్రాజెక్టుల చర్చలు జరిగేటప్పుడు వారి పేర్లే మొదట పరిశీలనలోకి వస్తాయి. కానీ మహిళా టెక్నీషియన్లకు ఇటువంటి ఇన్ఫార్మల్ నెట్‌వర్కింగ్ అవకాశాలు సామాజిక పరిమితుల వల్ల చాలా తక్కువగా అందుబాటులో ఉంటున్నాయి.
వందలాది మంది గ్రూప్ డ్యాన్సర్లను, భారీ సెట్‌ను మేనేజ్ చేయాల్సి వచ్చినప్పుడు మహిళల కంటే పురుషులే ఆ `కమాండ్` లేదా `లీడర్‌షిప్`ను ప్రదర్శించగలరనే పురుషాధిక్య భావన ఇండస్ట్రీలో అంతర్లీనంగా ఉంటోంది. ఈ సామాజిక మైండ్-సెట్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా కొరియోగ్రాఫర్ల ప్రతిభను కేవలం కొన్ని సాఫ్ట్ విభాగాలకే పరిమితం చేయకుండా... పెద్ద బడ్జెట్ కమర్షియల్ సాంగ్స్ అందించే సత్తా వారికి కూడా ఉందనే నమ్మకాన్ని స్టార్ హీరోలు, దర్శకులు కల్పించాల్సి ఉంది. అప్పుడే పరిశ్రమలో ఈ అసమతుల్యత తొలగిపోయి... మహిళా కొరియోగ్రాఫర్లకు లీడర్‌షిప్ స్థానాల్లో సమాన అవకాశాలు లభిస్తాయి. బాలీవుడ్ లో ఫరాఖాన్ రేంజులో ఎదగాలంటే టాలీవుడ్ లోను మహిళా కొరియోగ్రాఫర్లకు తగిన అవకాశాల్ని, క్రియేటివ్ ఫ్రీడమ్ ని ఇవ్వాల్సి ఉంది. బృందా మాస్టార్, సుచిత్ర చంద్రబోస్, స్వర్ణ మాస్టర్, యానీ మాస్టర్.. వీళ్ల తర్వాత టాలీవుడ్ లో కొత్తతరం మహిళా కొరియోగ్రాఫర్ల వేవ్ అంత స్పష్ఠంగా కనిపించడం లేదు. అయితే పరిశ్రమలో ఇంటర్నల్ గా చిన్న సినిమాలకు మాత్రమే అవకాశాలు అందుకోవడం వల్ల ఇలాంటి ప్రతిభ గ్లోబల్ స్థాయిలో ఫోకస్ ని పొందలేకపోతున్నారని భావించవచ్చు.
